- ల్యాండ్ పూలింగ్‌పై వెనక్కి తగ్గిన కుడా
- ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, కుడా చైర్మన్ సమావేశం
- తక్షణమే నిలిపివేస్తున్నట్లు సుందర్‌రాజ్‌యాదవ్ ప్రకటన
- తాత్కాలికమేనంటూ కుడా ప్రెస్‌నోట్‌లో ట్విస్ట్
- విరుద్ధ ప్రకటనలో రైతుల్లో అనేక అనుమానాలు
- కొంత కాలానికి మళ్లీ చేపడుతారేమోనని ఆందోళన
- రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్
- అప్పటిదాకా ఉద్యమం ఆగదంటున్న జేఏసీ చైర్మన్
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి : రైతుల ఉద్యమానికి కుడా (కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ) తలొగ్గింది. ల్యాండ్ పూలింగ్‌పై వెనక్కి తగ్గింది. పదిరోజులుగా కొనసాగుతున్న నిరసనలతో తక్షణమే పూలింగ్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్ రైతులతో చెప్పారు. అయితే… కుడా ప్రకటనపై రైతుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్‌లో కుడా ఆధ్వర్యంలో చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వరంగల్ పర్యటనలో ల్యాండ్ పూలింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించి తమకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. అప్పటిదాకా.. ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
27 గ్రామాల్లో.. 21,510 ఎకరాలు..
హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని పరకాల, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లోని 27 గ్రామాల్లో ఔటర్‌రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న 21,510.02 ఎకరాల భూమి సమీకరణకు కుడా ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. రింగు రోడ్డుకు ఇరువైపులా గ్రోత్ కారిడార్ పేరుతో అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కుడా అధికారులు చెబుతున్నారు. రైతుల భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి కుడా అడుగుపెడుతుందన్న వాదన బలంగా బయటకు వచ్చింది. ఇదే సమయంలో కుడా తీరుపై తీవ్రస్థాయిలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమకు తెలియకుండా రహస్యంగా సర్వే చేయడంపై, ఎలాంటి సమాచారం లే కుండానే ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌లో తమ భూముల సర్వే నంబర్లు వేయడంపై రైతులు భగ్గుమంటున్నారు. తమ పొట్టమీద కొట్టవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 27 గ్రామాల రైతుల నుంచి, కూలీల నుంచి, మేధావుల నుంచి ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో కుడా వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది.
కుడా దిగొచ్చింది అందుకేనా..?
రోజురోజుకూ ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా రైతు ఉద్యమం ఉధృతమవుతోంది. ఎక్కడికక్కడ రైతులు నిరసనలు చేపడుతున్నారు. దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పలుచోట్ల ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. జిల్లాలో పర్యటించిన మంత్రి హరీశ్‌రావుకు నిరసన సెగ తగిలింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ను అడ్డుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు ప్రభుత్వానికి తీవ్ర ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందన్న ఆలోచనతో వెంటనే బుధవారం ఉదయం కుడా కార్యాలయంలో ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్ వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించి పూలింగ్ ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కుడాకు వచ్చిన రైతులతో పూలింగ్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
రైతులతో ఎమ్మెల్యే సమావేశం..
ఈ క్రమంలోనే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బాధిత రైతులతో సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ల్యాండ్ పూలింగ్‌ను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. రైతులు అధైర్యపడాల్సిన పనిలేదని, ప్రభుత్వం భూసమీకరణను నిలిపివేస్తుందని హామీ ఇచ్చారు. అయితే.. ఎమ్మెల్యే ప్రకటనను స్వాగతించిన అన్నదాతలు దీనిపై కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేసి, మళ్లీ కొంతకాలానికి ముందుకు తీసుకొస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్వయంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్‌తోనే ల్యాండ్‌పూలింగ్‌ను వెనక్కి తీసుకుంటామని చెప్పించాలని కోరినట్లు సమాచారం. సానుకూలంగా స్పందించిన సదరు ఎమ్మెల్యే కేటీఆర్‌తోనే ప్రకటన చేయిస్తామని రైతులకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
ల్యాండ్ పూలింగ్‌ను నిలిపివేస్తున్నాం..
సుందర్‌రాజ్ యాదవ్, కుడా చైర్మన్
రైతుల ఆందోళన తెలుసుకుని ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, కుడా అధికారులందరం ల్యాండ్ పూలింగ్‌పై సమావేశం నిర్వహించి చర్చించాం. ల్యాండ్‌పూలింగ్‌ను తక్షణమే నిలిపివేస్తున్నాం. రైతులెవ్వరూ ఆందోళన చెందనవసరం లేదు. మనందరికీ తెలుసు.. కేసీఆర్ రైతుల పక్షపాతి. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు 24గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా ఇచ్చారు. అయితే, ల్యాండ్‌లు గుంజుకుంటారన్న వార్త తప్పుడు వార్త. తప్పుడు సంకేతాలు రైతుల్లోకి వెళ్లాయి. మా ఆలోచన ప్రకారం.. ఔటర్ రింగురోడ్డుకు ఇరువైపులా ఉన్న భూముల్లో డెవలప్‌మెంట్ చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వచ్చే రైతులు రావొచ్చునన్న ఉద్దేశంతోనే నోటిఫికేషన్ ఇచ్చాం తప్పించి వేరే ఉద్దేశంతో ఇవ్వలేదు. రైతులకు మేలు చేసే విధంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్ ఎల్లప్పుడూ ఆలోచిస్తారు. వేరే ఆలోచన ఉండదు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నిలిపివేస్తున్నాం. దాని గురించి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
జీవోను ప్రభుత్వమే రద్దు చేయాలి
బుద్దె పెద్దన్న, రైతు ఐక్య కార్యాచరణ సమితి వరంగల్ జిల్లా కన్వీనర్
తెలంగాణ ప్రభుత్వం వెలువరించిన జీవోను ప్రభుత్వమే రద్దు చేయాలి. పూలింగ్‌ను ప్రక్రియను విరమించుకుంటున్నామని ప్రకటన చేసిన కుడా చైర్మన్‌కు ఆ అధికారం లేదు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చిన జీవో 80(ఎ)ను రద్దు చేస్తూ అధికారిక ప్రకటన సీఎంవో నుండి వచ్చే వరకు ఉద్యమం ఆగదు. గతంలోనూ ఇలాగే జిల్లా కలెక్టర్ తో తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పి రైతుల ఉద్యమాన్ని ఆపారు. 8 నెలల తరువాత అధికారిక ప్రకటనతో మళ్లీ మా భూముల జోలికి వచ్చారు. ఇప్పుడు 27 గ్రామాల రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు. కాబట్టి మళ్లీ ఇలా ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి మాటలు నమ్మము.. అధికారిక జీవో విడుదల చేయాలి.