- దశబ్దాలు గడిచినా దశమారని జీవితాలు..
- ఇరవై ఏళ్ళ పైబడి శ్రమ దోపిడీకి గురవుతున్నాం..
- ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వహించినప్పటికీ గుర్తింపులేదు
- ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలి
- కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
- ఎన్‌హెచ్‌ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం లక్ష్మారెడ్డి
అక్షరశక్తి, కమలాపూర్ : తెలంగాణ ఎన్‌హెచ్‌ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం లక్ష్మారెడ్డి మండలకేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ దవాఖానల్లో దాదాపు 600 మంది ల్యాబ్ టెక్నీషియన్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. దశబ్దాలు గడిచినా దశమారని జీవితాలు మావని, సుమారు ఇరవై ఏళ్ళ పైబడి శ్రమ దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా, క్షయ లాంటి అంటు వ్యాధులు ప్రభలే సమయంలో నూ ప్రాణాలు ఫనంగా పెట్టి విధులు నిర్వహించినప్పటికీ గుర్తింపులేదని వాపోయారు. నిత్యం రోగుల కోసం పని చేస్తున్నప్పటికీ చాలీచాలని అత్తెసరు వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకు రావాల్సిన దుస్థితి నెల కొందన్నారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు రోగం వస్తే ఆస్తులు అమ్ముకుని పస్తులుండాల్సిన పరిస్థితుల్లో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యరంగంలో పనిచేస్తున్నప్పటికీ ఇంత వరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ కార్డులు కూడా ఇవ్వలేదని, వైద్య ఆరోగ్యశాఖలో ఉండి సేవ చేసినప్పటికీ తమ ప్రాణాలకు భరోసా లేదని అన్నారు. నిన్న మొన్నటి వరకు ప్రతి ఒక్కరిని వణికించిన కరోనా వల్ల ఓ దశలో కుటుంబ సభ్యులు కూడా దూరం పెట్టినప్పటికీ వాళ్ళకు అక్కున చేర్చుకుని మేము ఉన్నాం అని ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కోట్ల మందికి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణలో కీలక పాత్ర పోషించినప్ప టికీ ఎన్‌హెచ్ఎం ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వం విస్మరించడం అత్యంత విషాదకరం అన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలి
40 ఏండ్ల పైబడినందున, ఉద్యోగంలో చేరి ఇరవై యేళ్ళు కావస్తున్నందున చాలా మంది ఎన్‌హెచ్ఎం ల్యాబ్ టెక్నీషియన్లు ప్రభుత్వం నిర్వహించిన మెడికల్ బోర్డు పరీక్షకు అర్హత ను కోల్పోయారు. 2017 డిసెంబరులో టీఎస్పీఎస్సీ ద్వారా వచ్చిన నోటిఫికేషన్ (67/2017)లో ప్రకటించిన ఉద్యోగాలకు పరీక్ష రాసినప్పటికీ ఇంత వరకు దాని ఊసులేదు. కోర్టు తీర్పు కోసం వేచిచూసే వరకే జీవితాలు తెల్లారుతు న్నాయని, ఉద్యోగాలు ఇస్తారని కూడా గ్యారంటీ లేదని తెలంగాణ ఎన్‌హెచ్‌ఎం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు వైద్యులను క్రమబద్ధీకరించిన విధంగానే తమను కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో 40 మార్కులు వెయిటేజ్ ఉండగా దాన్ని 20 మార్కులకు కుదించడం చాలా బాధాకరం. ఇప్పుడు కొత్తగా వచ్చిన నోటిఫికేషన్లు డాక్టర్స్, స్టాప్ నర్స్ మాదిరిగా ల్యాబ్ టెక్నీషియన్లు కూడా మెడికల్ బోర్డుకిచ్చి ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. తమ సమస్యను మానవీయ కోణం లో చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించారు. తమ ప్రభుత్వం వస్తే కాంట్రాక్టు ఉద్యోగాల ను క్రమబద్ధీకరిస్తామన్న హామీని సీఎం నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో స్టేట్ అసోసియేట్ మెంబర్స్ బొద్దిరెడ్డి రాజు, వంగల రాజేంద్రప్రసాద్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.