Saturday, July 27, 2024

గుడిసెవాసుల‌పై దాడి వెనుక క‌బ్జా కుట్ర‌!

Must Read
  • గుండ్ల‌సింగారంలో ప్ర‌భుత్వ‌ భూమిపై పెద్ద‌ల క‌న్ను
  • గుడిసెవాసుల‌ను వెళ్ల‌గొట్టి కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం
  • స్థానిక‌త పేరుతో గ్రామ‌స్తుల‌ను ఉసిగొల్పిన‌ వైనం
  • పోలీసుల ప్రేక్ష‌క‌పాత్ర‌లో ఆంత‌ర్యం ఏమిటి..?
  • స్థానిక‌ బీజేపీ కార్పొరేట‌ర్‌పై సీపీఐ తీవ్ర ఆరోప‌ణ‌లు
  • గాయ‌ప‌డిన‌వారికి నారాయ‌ణ ప‌రామ‌ర్శ‌
  • భూమిని వ‌దిలిపెట్టేదిలేద‌ని స్ప‌ష్టం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 2వ డివిజ‌న్ ప‌రిధి గుండ్ల‌సింగారంలో గుడిసెవాసుల‌పై కొంద‌రు స్థానికులు చేసిన దాడి వెనుక భూక‌బ్జా కుట్ర దాగి ఉందా..? అక్క‌డి నుంచి పేద‌ల‌ను వెల్ల‌గొట్టి ఆ ప్ర‌భుత్వ భూమిని కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారా..? ఇందులో భాగంగానే గుడిసెవాసుల‌పైకి స్థానిక‌త పేరుతో గ్రామ‌స్తుల‌ను అధికార టీఆర్ఎస్, బీజేపీకి చెందిన కొంద‌రు నాయ‌కులు ఎగేస్తున్నారా..? అందుకే, గుడిసెవాసుల‌పైకి స్థానికులు క‌ర్ర‌లు, రాళ్ల‌తో విరుచుకుప‌డుతున్నా పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించ‌డంలో ఆంత‌ర్యం ఏమిటి..? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. గుండ్ల‌సింగారంలో మంగ‌ళ‌వారం గుడిసెవాసుల‌పై దాడి ఘ‌ట‌న వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో సంచ‌ల‌నం సృష్టించింది. ఆ వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీని వెనుక ఎవ‌రున్నారన్న దానిపై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ఘ‌ట‌న‌ను సీపీఐ పార్టీ కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పార్టీ అగ్ర‌నేత నారాయ‌ణ బుధ‌వారం హ‌న్మ‌కొండ‌కు వ‌చ్చి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఎంత‌మందిని కొడ‌తారో, ఎంత‌మందిని చంపుతారో చూస్తాం.. గుండ్లసింగారం భూమిని మాత్రం వ‌దిలిపెట్టేది లేద‌ని తేల్చి చెప్పారు.

నిలువ‌నీడ‌లేని పేద‌లు
అనేక దూర ప్రాంతాలు, గ్రామాల నుంచి బ‌తుకుదెరువు కోసం వంద‌లు, వేలాది మంది పేద‌లు వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రానికి త‌ర‌లివ‌స్తున్నారు. అద్దె ఇండ్ల‌లో ఉండ‌లేక‌, నిలువ‌నీడ‌లేక పేద‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే సీపీఐ పార్టీ పేద‌ల‌కు అండ‌గా నిలుస్తూ.. గూడు కోసం పోరుబాట నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ప్ర‌భుత్వ భూముల్లో గుడిసెలు వేయించి, నిలువ‌నీడ క‌ల్పిస్తోంది. ఈ క్ర‌మంలోనే గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ రెండో డివిజ‌న్ గుండ్ల‌సింగారంలో ఉన్న స‌ర్వేనంబ‌ర్లు 174, 175లోని సుమారు 14 ఎక‌రాల‌ ప్ర‌భుత్వ భూమిలో దాదాపు మూడువేల మంది పేద‌లు రెండు నెల‌ల క్రితం గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఇక్క‌డే త‌మ‌కు ఇండ్ల స్థ‌లాలు కేటాయించి, డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు క‌ట్టించి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ మేర‌కు ఉన్న‌తాధికారుల‌కు విన‌తిప‌త్రాలు కూడా అందిస్తున్నారు. ఇక తమ‌కు గూడు క‌ష్టాలు తీరిన‌ట్టేన‌ని, ఏదో ఒక ప‌నిచేసుకుంటూ బ‌త‌క‌వ‌చ్చున‌ని గుడిసెవాసులు ఆనంద‌ప‌డ్డారు. కానీ.. ఇంత‌లోనే, ఆ భూమిపై కొంద‌రు క‌బ్జాకోరుల క‌న్నుప‌డిన‌ట్లు తెలుస్తోంది.

గుడిసెవాసుల‌ భూమిపై క‌బ్జాకోరుల క‌న్ను
గుండ్ల‌సింగారంలోని పేద‌లు గుడిసెలు వేసుకున్న ప్ర‌భుత్వ భూమిపై కొంద‌రు క‌బ్జాకోరుల క‌న్నుప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఆ భూమిని కొల్ల‌గొట్టేందుకు ప‌క్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే, స్థానిక‌త పేరుతో కొంద‌రు గ్రామస్తుల‌ను పోగేసి, గుడిసెవాసుల‌పైకి ఉసిగొల్పేందుకు కుట్ర చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అంతేగాకుండా, ఆ ప్ర‌భుత్వ భూమిలో ఇండ్ల స్థ‌లాలు ఇప్పిస్తామంటూ ఏకంగా కొంద‌రి నుంచి క‌బ్జాకోరులు పెద్ద‌మొత్తంలో కూడా డ‌బ్బులు వ‌సూలు చేశార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. స్థానిక‌త పేరుతో గ్రామ‌స్తుల‌ను అడ్డుపెట్టుకుని, గుడిసెవాసుల‌ను ఇక్క‌డి నుంచి వెళ్ల‌గొట్టి, మొత్తంగా ఆ భూమిని త‌మ చేతుల్లోకి తెచ్చుకునే కుట్ర‌కు తెర‌లేపిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే గుడిసెల‌ను ధ్వంసం చేయ‌డం, త‌గ‌ల‌బెట్ట‌డం జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత‌ త‌మ గుడిసెల వ‌ద్ద‌కు రాకుండా, వెళ్ల‌కుండా దారుల‌కు ముళ్ల‌కంప వేయ‌డం జ‌రిగింది. ఇలా క‌బ్జాకోరుల కుట్ర‌తో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఏకంగా మంగ‌ళ‌వారం గుడిసెవాసుల‌పై క‌బ్జాకోరుల ప్రోద్బ‌లంతో కొంద‌రు స్థానికుల దాడి చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

వారిపైనే సీపీఐ నాయ‌కుల ఆరోప‌ణ‌లు
గుడిసెవాసుల‌పై జ‌రిగిన దాడి వెనుక బీజేపీకి చెందిన‌ స్థానిక కార్పొరేట‌ర్ ర‌వినాయ‌క్‌, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంద‌రు నాయ‌కుల హ‌స్తం ఉందంటూ సీపీఐ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో ఆరోపిస్తున్నారు. గుడిసెవాసుల‌పై దాడి చేయించిన వారికి పోలీసుల స‌హ‌కారం కూడా ఉందంటూ విమ‌ర్శిస్తున్నారు. ఈ మేర‌కు వ‌రంగ‌ల్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండ‌గా, బుధ‌వారం హ‌న్మ‌కొండ‌లో ప‌ర్య‌టించి, గాయ‌ప‌డిన వారిని పరామ‌ర్శించిన సీపీఐ అగ్ర‌నేత నారాయ‌ణ పోలీసు, రెవెన్యూ అధికారులపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అధికారుల క‌ళ్లు తెరిపించి, పేద‌ల‌కు భూమి ద‌క్కేదాకా త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img