రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్
అక్షరశక్తి, హన్మకొండ : ఆదివాసీల మహిళలతో అమానుషంగా ప్రవర్తించిన ఫారెస్ట్ అధికారులపై
రాష్ట్ర గిరిజన-స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ఆదివాసీల జోలికొస్తే సహించేదిలేదని, ఆదివాసీ మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యవతి హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని రాచన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీగూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై శుక్రవారం ఫారెస్ట్ అధికారులు అసభ్యంగా ప్రవర్తించారన్న ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌ను ఆదేశించారు.
జీవనాధారం నిమిత్తం అటవీ ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని ఇప్పటికే పలు మార్లు హెచ్చరించామని, అయినా కొంతమంది అధికారుల తీరులో మార్పురావడంలేదని, అలాంటి వారిని ఇక ఉపేక్షించేదిలేదని మంత్రి హెచ్చరించారు. ఆదివాసీ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, మంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి, విచారణ ప్రారంభించారు. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ అధికారికి దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు.