- అధికారులు, సర్పంచ్‌ల మధ్య నలిగిపోతున్న పంచాయతీ కార్యదర్శులు
- నిత్యం వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడి
- బయ్యారం మండలంలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
- క్రమబద్దీకరణ గడువు పెంచుతూ తాత్సారం
- ప్రభుత్వం తీరుపై యూనియన్ నేతల మండిపాటు
అక్షరశక్తి ప్రధాన ప్రతినిధి
అధిక ఒత్తిడి, పనిభారంతో రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు నలిగిపోతున్నారు. ఉద్యోగ భద్రతలేదనే కారణంతో మానసిక క్షోభకు గురవుతున్నారు. ఓవైపు అధికారుల నుంచి ఒత్తిడి, మరోవైపు సర్పంచుల తీరుతో సతమతవుతున్నారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులతో కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేస్తుంటే, మరికొందరు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరుగురు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఆత్మహత్య చేసుకున్నారని యూనియన్ నేతలు పేర్కొంటున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఈసం వెంకటేశ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నాలుగు రోజుల కింద పురుగుల మందుతాగి దవాఖానలో చికిత్స పొందిన ఆయన ఇవ్వాళ తుది శ్వాస విడిచారు. నారాయణపురం సర్పంచ్, ఉప సర్పంచ్‌ల వేధింపుల వల్లే తాను తనువు చాలిస్తున్నానని మానుకోట జిల్లా అడిషనల్ కలెక్టర్, కలెక్టర్‌కు ఈసం వెంకటేశ్ రాసిన సుసైడ్ నోట్.. విధి నిర్వహణలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఎదురువుతున్న వేధింపులు, ఇబ్బందులకు అద్దంపడతోంది.
ప్రొబేషనరీ పిరయడ్ నాలుగేండ్లు
2018లో స్టేట్ పంచాయతీరాజ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12,761 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలను మూడేండ్ల ప్రొబేషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేసింది. ఇందులో 9,355 మంది విధుల్లో చేరి వివిధ గ్రామాల్లో సేవలు అందిస్తున్నారు. వీరి సేవలు సత్ఫలతాలు ఇవ్వడంతో సీఎం కేసీఆర్ 2020లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామానికి ఒక పంచాయతీ సెక్రటరీ ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈక్రమంలోనే గతేడాది జూనియర్ పంచాయతీ సెక్రటరీల కాలపరిమితిని ప్రభుత్వం నాలుగేళ్లకు పెంచింది. 2022 ఏప్రిల్ తో గడువు ముగియనుండగా, తాజాగా ప్రొబేషన్ పిరియడ్‌ను 2023 ఏప్రిల్ వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి..
ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి అన్ని సదుపాయాలు అందుతుంటే.. జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాత్రం రూ.28,719 వేతనం మాత్రమే లభిస్తోంది. వీరిని క్రమబద్దీకరించకుండా, వివిధ లక్ష్యాలు నిర్ణయిస్తూ, పని చేయకుంటే నిబంధనల మేరకు ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికార వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయి. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం.. గ్రామాల్లో కార్యనిర్వాహక, ఆర్థిక అనుమతులు పాలకవర్గాలకే అప్పగించాయి. పంచాయతీ పాలకవర్గంలోని రాజకీయ విబేధాలతో అభివృద్ది పనులు చేసినప్పుడు గొడవలు జరుగుతున్నాయి. సర్పంచ్‌పై కోపంతో ఉప సర్పంచ్‌లు సంతకాలు పెట్టేందుకు నిరాకరిస్తున్నారు. ఫలితంగా పంచాయతీ కార్యదర్శులు ఆర్థికంగా ఇబ్బందులపాలవుతున్నారు.
ఇది ఉద్యోగమా..? బానిస బతుకా..?
ఇది ఉద్యోగమా..? బానిస బతుకా..? పంచాయతీ పనులకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. మధ్య తరగతి జీవులం డబ్బు ఎక్కడి నుంచి తేగలం.. అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేసిన బయ్యారం మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈసం వెంకటేశ్ (35) సోమవారం ఉదయం చనిపోయాడు. ఈనెల 4వ తేదీన ఇంట్లోనే పురుగుల మందుతాగి తాగగా, కుటుంబ సభ్యులు మానుకోట ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామం ఇర్సులాపురం తీసుకురాగా, తీవ్ర విషాదం నెలకొంది. పంచాయతీ కార్యదర్శులు పెద్దసంఖ్యలో అంత్యక్రియలకు హాజరై, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుంటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, వెంకటేశ్ కుటుంబానికి న్యాయం చేస్తామని, మృతుడి భార్యకు కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం కమిటీ వేయాలి
– తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు ఏటి మహేశ్
ఏ ఇతర ప్రభుత్వ శాఖల్లో లేనివిధంగా కేవలం పంచాయతీ సెక్రటరీలు మాత్రమే ఎందుకు చనిపోతున్నారో ప్రభుత్వం ఆలోచించాలి. వివిధ కారణాలతో మూడు వేల మంది ఉద్యోగాలు వదిలి వెళ్లిపోగా, ఆరుగురు విధి నిర్వహణలోనే మరణించారు. కొందరు రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూయగా, మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రస్థాయిలో అత్యున్నత కమిటీ వేసి ఈ మరణాల మీద విచారణ జరపాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలి.
ఉద్యోగ భదత్రలేదు.. అధిక ఒత్తిడి
– తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం మానుకోట జిల్లా అధ్యక్షుడు నాగవళ్లి రంజిత్
ఉద్యోగ భద్రత లేకపోవడంతోపాటు ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి అధిక ఒత్తిడి ఉంటోంది. గ్రామాల్లో అన్ని రకాల పనులను మాతోనే చేయించుకుంటున్నారు. భవిష్యత్‌లో ఉద్యోగం ఉంటుందో.. ఉండదో అన్న బెంగ ఒకవైపు, విధి నిర్వహణలో ఎదురువుతున్న ఒత్తిడి మరోవైపు కుంగదీస్తున్నాయి.
ఈ కారణాల చేత తీవ్ర మానసిక సంఘర్షణతో పంచాయతీ సెక్రటరీలు కొందరు ఉద్యోగాలు వదిలేస్తుండగా, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.