అక్షరశక్తి, వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన వాయిదా పడింది. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నట్లు సోమవారం కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ.. అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే.. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో మంగళవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటించనున్నారు. పంటనష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందించనున్నారు. ఇదిలా ఉండగా.. నర్సంపేట నియోజకవర్గంలో త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను, అభివృద్ధి పనుల ప్రారంభానికి సీఎం హాజరుకానున్నట్లు సమాచారం.
రైతుల్లో తీవ్ర నిరాశ..
అకాలవర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, అరటి, చిరుధాన్యాల పంటలు వందశాతం దెబ్బతిన్నాయి. కేసీఆర్ స్వయంగా వస్తున్నారన్న వార్తతో రైతులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ కష్టాలను చూస్తారని, తమను ఆదుకుంటారని అనుకున్నారు. కానీ.. తీరా.. సీఎం పర్యటన వాయిదా పడడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.