Tuesday, June 18, 2024

యువతను విస్మరిస్తే దేశ భవిష్యత్ అంధకారమే..

Must Read
 • ప్రజా కవి జయరాజు
 • మహబూబాబాద్‌లో పీవైఎల్ రాష్ట్ర 8వ మహాసభలు
 • వేలాదిమంది యువతతో భారీ ర్యాలీ, బహిరంగ సభ
  అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : దేశంలోని యువత శక్తి సామర్థ్యాలను ప్రభుత్వాలు విస్మరిస్తే దేశ భవిష్యత్తు అభివృద్ధి పూర్తి అంధకారంగా మారే ప్రమాదం ఉందని, దేశ సంపద సృష్టిలో యువత నైపుణ్యాలు చాలా కీలకమని ప్రజా కవి జయరాజ్ అన్నారు. దేశంలోని యువతను మద్యం, మత్తు పదార్థాలకు బానిసలుగా చేసి, యువత శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తూ మద్యం మత్తు పదార్థాలతో వచ్చిన ఆదాయ వనరులను అభివృద్ధి అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాలను నిలదీశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్‌) తెలంగాణ రాష్ట్ర 8వ మహాసభలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు వేలాదిమంది ప్రగతిశీల యువకులు రెడ్ షర్ట్స్ వేసుకొని రణ నినాదాలతో ముందుకు క‌దిలారు. దిక్కులు పిక్కటిళ్లేలా భగత్ సింగ్ , అల్లూరి, చంద్రశేఖర్ ఆజాద్ అమరహే.. అని నినదిస్తూ, జాతీయోద్యమ వీరుల స్ఫూర్తితో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకై కొట్లాడుదామని భారీ ప్రదర్శనతో పేరాల లక్ష్మి కట్టయ్య ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు.

 • అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజా కవి జయరాజ్ మాట్లాడుతూ దేశంలో తెల్లదొరల పాలన పోయి, నల్ల దొరల పాలన వచ్చిందని, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించని దౌర్భాగ్య స్థితి నేడు దేశంలో నెలకొందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి లేదు, స్త్రీలకు రక్షణ లేదు , రైతులకు గిట్టుబాటు ధర లేదు, కార్మికులకు కనీస వేతనాలు లేవు, కానీ ఈ దేశ కుబేరులు ప్రపంచ కుబేర్లుగా మార్చడం కోసం ఆదాని అంబానీలకు లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు పంచి, దేశంలోని సంపదను ఆదాని, అంబానీ లాంటి కార్పొరేటు శక్తులకు మోడీ చాయ్ అమ్మినట్టు అప్పనంగా అమ్మేస్తూ దేశాన్ని దివాలా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా మోడీ, కేసీఆర్‌లు దేశాన్ని, రాష్ట్రాన్ని నిరుద్యోగ ఖార్ఖానాలుగా మార్చి వేశారని దుయ్యబట్టారు. కుల,మత ,ఆర్థిక అంతరాలు లేని సమసమాజాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత నేటి యువత పైనే ఉందని వారు గుర్తు చేశారు.
  సిపిఐ ఎం.ఎల్ ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.హన్మేష్ మాట్లాడుతూ
  దేశంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన మోడీ ,కేసీఆర్ యువతకు ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని, యువతరాన్ని నమ్మించి మోసం చేసిన బిఆర్ఎస్ బిజెపి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

 • పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఎస్. ప్రదీప్ మాట్లాడుతూ దేశంలో 25 కోట్ల మంది, తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్నత చదువులు పూర్తిచేసుకుని నిరుద్యోగులుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 11 లక్షల టీచర్ పోస్టులు , రాష్ట్రవ్యాప్తంగా 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశంలో లక్ష పదివేల ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయని, దేశవ్యాప్తంగా 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అయినప్పటికి నోటిఫికేషన్లు వేసి ఖాళీలను భర్తీ చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి కెసిఆర్ నయవంచనకు గురి చేశాడని అన్నారు.
  గత ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని విద్యార్థి, యువత ప్రశ్నించి కెసిఆర్, నరేంద్ర మోడీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. పీవైఎల్‌ రాష్ట్ర అధ్యక్షులు కే. కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో పిఓడబ్ల్యు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ, సిపిఐ ఎం.ఎల్ ప్రజాపంథా మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి, పి వై ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు అజయ్ ఈశ్వర్, సహాయ కార్యదర్శులు కిషన్, ఎన్వి రాకేష్, పివై ఎల్ రాష్ట్ర నాయకులు పైండ్ల యాకయ్య, పివైఎల్ మహబూబాద్ జిల్లా అధ్యక్షులు కందాల రంగయ్య, ప్రధాన కార్యదర్శి ఇరుగు అనిల్ తదితరులు ప్రసంగించారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img