వైరల్ అవుతున్న వీడియో
ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని నైట్ క్లబ్‌లో తన మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ ఐటీ ఇంచార్జీ అమిత్ మాల్వియా ఆ వీడియోను ట్వీట్ చేశారు. డిమ్ లైట్ ఉన్న నైట్‌క్లబ్‌లో ఓ మహిళా ఫ్రెండ్‌తో రాహుల్ ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ మ్యూజిక్‌కు జనం డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
ఫ్రెండ్ పెళ్లి కోసం వెళ్లి..
జర్నలిస్టు ఫ్రెండ్ సుమ్నిమా ఉడాస్ పెళ్లికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ ఆదివారం సాయంత్రం ఖాట్మాండు వెళ్లారు. విస్తారా ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్‌లో ఆయన 4.40 నిమిషాలకు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో పాటు ఆయన మిత్రులు.. ఖాట్మాండులోని మారియట్ హోటల్‌లో బస చేస్తున్నారు. సుమ్నిమా తండ్రి బీమ్ ఉదాస్ పంపిన ఆహ్వానం మేరకు రాహుల్ పెళ్లికి వెళ్లారు. బీమ్ ఉదాస్ గతంలో మయన్మార్‌కు నేపాలీ అంబాసిడర్‌గా పని చేశారు. జర్నలిస్టు సుమ్నిమా గతంలో సీఎన్ఎన్ కరస్పాండెంట్‌గా చేశారు. నిమా మార్టిన్ షెర్పాను ఆమె పెళ్లి చేసుకుంటోంది. మంగళవారం పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. మే 5వ తేదీన రిసెప్షన్ ఉంది. బౌద్ధలో ఉన్న హయ్యత్ రీజెన్సీ హోటల్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి కోసం ఇండియా నుంచి మరికొంత మంది వీవీఐపీలు హాజరయ్యారు. 2018లోనూ ఓ సారి రాహుల్ గాంధీ ఖాట్మాండు వెళ్లారు. టిబెట్‌లోని కైలాస్ మానససరోవరం వెళ్లే క్రమంలో ఆయన ఇక్కడకు వచ్చారు.
కాంగ్రెస్ నేతలకు ఊహించని ట్విస్ట్
కాగా మే 6వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు హాజరై కీలక వ్యాఖ్యలు చేయనున్నారు. సభకు మరో మూడ్రోజుల సమయం మాత్రమే ఉండగా, ఏర్పాట్లలో నేతలంతా బిజీగా ఉన్నారు. ఈక్రమంలోనే రాహుల్ గాంధీ పబ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు ఊహించని షాక్ తగిలినట్లయింది.