Saturday, September 7, 2024

రాణా మార్క్‌!

Must Read
    • న‌ర్సంపేట‌లో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు
    • బీజేపీలోకి రాణాప్ర‌తాప్‌రెడ్డి
    • 16న ఢిల్లీలో క‌మలం గూటికి చేర‌నున్న యువ‌నాయ‌కుడు
    • నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌క్తిక‌రంగా ప‌రిణామాలు
    • టీఆర్ఎస్‌కు క‌ష్ట‌కాలం త‌ప్ప‌దా..?
    • నియోజ‌క‌వ‌ర్గంలో పుంజుకోనున్న బీజేపీ

అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట : న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ క‌ద‌లిక‌లు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌లో యూత్ లీడ‌ర్‌గా గుర్తింపు పొందిన రాణాప్ర‌తాప్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 16న క‌మ‌లం గూటికి చేర‌నున్నారు. ఢిల్లీలో ప‌లువురు అగ్రనేత‌ల స‌మ‌క్షంలో ఆ పార్టీ కండువా క‌ప్పుకోనున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయ‌కుడిగా పేరున్న రాణాప్ర‌తాప్‌రెడ్డిని ఇటీవ‌ల పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలోనే ఆయ‌న బీజేపీలో చేరుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న వెంట పెద్ద సంఖ్య‌లో యూత్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా క‌మ‌లం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

నాన్న స్ఫూర్తితో రాజ‌కీయాల్లోకి

ఒక‌నాడు కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ ఆనాటి నర్సంపేట ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్‌తో ఎదురొడ్డి నిలబడిన వారిలో ఒకరు గోగుల ప్రతాపరెడ్డి. నాన్న ప్రతాపరెడ్డి స్ఫూర్తితో రాణా ప్ర‌తాప్‌రెడ్డి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. డాక్టర్ వృత్తిని వదిలి పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో రెండువేల మంది యువకులతో టీఆర్ఎస్ పార్టీలో చేరి.. పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అయితే.. కొంత‌కాలంగా పార్టీలో రాణాప్ర‌తాప్‌రెడ్డి అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలిసింది. ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డికి దీటుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ.. జ‌న‌తా ట్ర‌స్ట్ పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ యూత్‌తోపాటు సామాన్య జ‌నంలోనూ గుర్తింపుపొందారు. అయితే.. రాణాప్ర‌తాప్‌రెడ్డి దూకుడు న‌చ్చ‌ని కొంత‌మంది నాయ‌కులు ఆయ‌న‌పై క‌క్ష‌పెంచుకుని, పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు అనుచ‌రుల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై స్పందించిన రాణాప్ర‌తాప్‌రెడ్డి.. తాను పార్టీకి ఎలాంటి ద్రోహం చేయ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ‌

న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో యూత్ లీడ‌ర్‌గా గుర్తింపు పొందిన రాణాప్ర‌తాప్‌రెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డం టీఆర్ఎస్‌కు కొంత‌న‌ష్ట‌మేన‌నే టాక్ వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న బీజేపీలో చేరుతుండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అంచ‌నావేస్తున్నారు. రాణాప్ర‌తాప్‌రెడ్డితోపాటు అనేక‌మంది కూడా టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరే అవ‌కాశాలు ఉన్నాయని, త‌న మార్క్ చూపించుకోవ‌డానికి రాణాప్ర‌తాప్‌రెడ్డి ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నార‌ని అనుచ‌రులు అంటున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్పుడు రాణాప్ర‌తాప్‌రెడ్డి చేరిక‌తో క‌మ‌ల‌ద‌ళం మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

20న వ‌రంగ‌ల్‌లో భారీ స‌మావేశం

ఈ నెల 16న ఢిల్లీలో పార్టీ పెద్ద‌ల‌తో స‌మ‌క్షంలో చేరిన అనంత‌రం.. 20వ తేదీన వ‌రంగ‌ల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆధ్వ‌ర్యంలో భారీ స‌మావేశం ఏర్పాటు చేసేందుకు రాణాప్ర‌తాప్‌రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. బండి సంజ‌య్ ముందు త‌న బ‌లం నిరూపించుకునేందుకు సుమారు 5వేల మందితో స‌మావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఐదు వేల మంది యువతీ యువకులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరూ బీజేపీలో చేరుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటికే యువ నాయకుడి అనుచరులు డివిజన్ల‌లో, మండల కేంద్రాల్లో గ్రామాల్లో కసరత్తులు ప్రారంభించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img