Sunday, September 8, 2024

ఇలా చ‌ద‌వండి.. ఇంట‌ర్ విజేత‌లు మీరే..!

Must Read
  • ప‌రీక్షా స‌మ‌యంలో ఒత్తిడికి లోనుకావొద్దు
  • సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి
  • అర‌గంట ముందే ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాలి
  • ప్ర‌ముఖ ఫిజిక్స్‌ ఫ్యాక‌ల్టీ, మోటివేట‌ర్ దారం సోమేశ్వ‌ర్‌
  • ఇంట‌ర్ విద్యార్థుల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు

మే 6వ తేదీ నుంచి తెలంగాణ ఇంట‌ర్మీడియెట్ బోర్డు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ప‌రీక్ష‌లు అన‌గానే విద్యార్థులు ఎంతో ఒత్తిడికి లోన‌వుతుంటారు. భ‌యంతో వ‌ణికిపోతుంటారు. అప్ప‌టివ‌ర‌కూ ఎంతో ఉత్సాహంగా ఉన్న విద్యార్థులు ఒక్క‌సారిగా గంద‌ర‌గోళానికి గుర‌వుతుంటారు. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు ఎలా ఉండాలి..? ఆత్మ‌స్థైర్యం కోల్పోకుండా ఎలా ముందుకు వెళ్లాలి..? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..? త‌ల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి..? అన్న అంశాల‌పై అక్ష‌ర‌శ‌క్తి ప్ర‌తినిధితో ప్ర‌ముఖ భౌతిక‌శాస్త్ర సీనియ‌ర్ ఫ్యాక‌ల్టీ, మోటివేట‌ర్ దారం సోమేశ్వ‌ర్ గారు ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ప‌రీక్ష‌ల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించ‌డానికి అనేక స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు.
– సాతూరి న‌రేష్‌నందన్‌ ( అక్ష‌ర‌శ‌క్తి విలేక‌రి, న‌యీంన‌గ‌ర్ )

ప్ర‌శ్న‌: స‌ర్‌.. మే 6వ తారీఖు నుంచి తెలంగాణ ఇంట‌ర్మీడియెట్ బోర్డు ప‌రీక్ష‌లు జ‌రుగబోతున్నాయి క‌దా.. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌కు మీరిచ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు ఏమిటి..?
జ‌వాబు : ముందుగా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులంద‌రికీ శుభాకాంక్ష‌లు. మ‌న రాష్ట్రంలో దాదాపు 9ల‌క్ష‌ల‌కుపైగా విద్యార్థులు ఈ ప‌రీక్ష‌లకు హాజ‌ర‌వుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు సంవ‌త్స‌ర‌కాలంపాటు చ‌దివిన విష‌యాల‌ను మూడు గంట‌ల‌పాటు జ‌రిగే ప‌రీక్ష‌లో మీరేంటో అన్న విష‌యం నిరూపించుకోవాలి… ఇది మ‌ర‌వ‌రాదు. పిల్ల‌లు ప్ర‌శాంతంగా ఉండాలి, గాబ‌రాకు గురికావొద్దు. పిల్ల‌లు త‌మ ప‌రీక్ష కేంద్రం ఎక్క‌డ ఉంది..? అనేది హాల్‌టికెట్‌పై ఉండే వివ‌రాల ప్ర‌కారం ఒక‌రోజు ముందుగానే వెళ్లి చూసుకుని రావాలి. ప‌రీక్షా కేంద్రానికి త‌ప్ప‌కుండా హాల్‌టికెట్‌తో మాత్ర‌మే అనుమ‌తి ఇస్తారు. కావును త‌ప్ప‌కుండా తీసుకెళ్లాలి. అర‌గంట ముందే ప‌రీక్షా కేంద్రంలోకి అనుమ‌తి ఇస్తారు కాబ‌ట్టి అంద‌రూ ఆ విధంగా సెంట‌ర్‌కు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆల‌స్య‌మైనా ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌రు. ఇది విద్యార్థులు గ‌మ‌నించాలి. ఈ విధంగా ముందుగా హాల్‌కు చేరుకోవ‌డం వ‌ల్ల అక్క‌డి వాతావ‌ర‌ణానికి పిల్ల‌లు మాన‌సికంగా స‌న్న‌ద్ధుల‌వుతారు.

ప్ర‌శ్న : చాలామంది పిల్ల‌లు.. కొవిడ్ కార‌ణంగా అంత‌కుముందు సంవ‌త్స‌రం అంద‌రినీ ఉత్తీర్ణులుగా ప్ర‌కటించారు. ఈ ఏడాది కూడా అలాగే ఉంటుంది కావొచ్చున‌న్న సందేహంతో పిల్ల‌లు ఉంటారు. దీనికి మీ స‌మాధానం?
జ‌వాబు : చాలా మంచి ప్ర‌శ్న వేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ విద్యా సంవ‌త్స‌రం ప‌రీక్ష రాసిన విద్యార్థుల‌లో ఫెయిల్ అయిన వారికి మార్కులు క‌లిపి పాస్ చేయ‌డం అనేది ఉండ‌ద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా చెప్పింది. కాబ‌ట్టి విద్యార్థులు చ‌క్క‌గా సాధ‌న సాగించి ముందుకు వెళ్లాలి.

ప్ర‌శ్న : పిల్ల‌లు ప‌రీక్ష‌కు ఏ ప‌ద్ధ‌తిలో ప్రిపేర్ అయితే.. ఈ త‌క్కువ స‌మయాన్ని స‌ద్వినియోగం చేసుకునే అవ‌కాశం ఉంటుంది..?
జ‌వాబు : ఇక్క‌డ విద్యార్థులంద‌రూ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. ప్ర‌తీ ప‌రీక్ష‌కు ఒక‌రోజు కొన్ని ప‌రీక్ష‌ల‌కు మాత్రం రెండు రోజుల వ్య‌వ‌ధి ఉంది. ప‌రీక్ష‌కు ప‌రీక్ష‌కు మ‌ధ్య ఉండే స‌మ‌యంలో 75శాతం మొత్తం అంశాలు చ‌దివే విధంగా మిగిలిన 25శాతం స‌మ‌యాన్ని ముఖ్య‌మైన అంశాలు పున‌శ్చ‌ర‌ణ చేసుకునే విధంగా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోవాలి.

ప్ర‌శ్న : విద్యార్థులు ప‌రీక్షా పేప‌ర్‌ను ఏ విధంగా ప్రారంభించాలి..? ప‌రీక్ష రాసేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి..?
జ‌వాబు : ప‌రీక్షా ప‌త్రంలో ఎన్ని ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు రాయాలంటారో అన్ని ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు రాయ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. ఏ విభాగం ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు మంచిగా రాయ‌గ‌ల‌వో ఆ విభాగాన్నే మొద‌ట ప్రారంభిస్తే మంచిది. ఏదైనా ప్ర‌శ్న‌కు పూర్తిగా స‌మాధానం రాయ‌లేక‌పోయినా, పాక్షికంగా రాసినా నిబంధ‌న‌ల ప్ర‌కారం నీవు రాసినంత‌వ‌ర‌కు మార్కులు పాక్షికంగానైనా కేటాయించ‌బ‌డుతాయి. ఇది అంద‌రూ గ‌మ‌నించాలి. స్వ‌ల్ప స‌మాధాన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు అన్ని ఒకే ద‌గ్గ‌ర వ‌రుస‌గా ఉండేట‌ట్లు రాస్తే మంచిది. అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు రాసిన త‌ర్వాత మాత్ర‌మే అద‌న‌పు ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు రాయాలి. ఇది కొంత‌వ‌ర‌కు విద్యార్థికి లాభం చేకూర్చే అంశం. ప్ర‌తీ జ‌వాబు స్ప‌ష్టంగా కనిపించేలా రాయాలి. అవ‌స‌రం అనుకున్న చోట డ‌యాగ్రాం( బొమ్మ‌) లు క‌చ్చితంగా గీయాలి. వాటికి కూడా మార్కుల కేటాయింపు ఉంటుందన్న విష‌యం మ‌రువ‌రాదు. ఒక జ‌వాబుకు ప్రారంభం ఎంత ముఖ్య‌మో ముగింపు కూడా అంతే ముఖ్యం. విద్యార్థులు ఏ ప్ర‌శ్న‌కు జ‌వాబు రాస్తున్నారో ఆ ప్ర‌శ్న నంబ‌ర్ స్ప‌ష్టంగా, అర్థ‌మ‌య్యే విధంగా వేయ‌డం మంచిది. ఒక జ‌వాబు రాయడం పూర్తి అయిన త‌ర్వాత పెన్సిల్‌తో అడ్డంగా ఒక లైన్ కొట్టి త‌దుప‌రి జ‌వాబు మొద‌లుపెట్టాలి. దానివ‌ల్ల మూల్యాంక‌నం చేసేవారికి స్ప‌ష్టంగా తెలుస్తుంది.

ప్ర‌శ్న : ఇంట్లో చ‌దువుకునే వాతావ‌ర‌ణాన్నివిద్యార్థులు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి?
జ‌వాబు : సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇంట్లో ఒక ప్ర‌త్యేక గ‌దిలో కూర్చొని చ‌దువును కొన‌సాగించాలి. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఆ గ‌దిలో చ‌ర‌వాణి(సెల్‌ఫోన్‌) ఉండ‌రాదు. ఒక‌వేళ చ‌రవాణి ఉంటే.. విద్యార్థుల ఏకాగ్ర‌త దెబ్బ‌తిని స‌మ‌యం వృథా అవుతుంది. ఈ విష‌యాన్ని విద్యార్థుల‌తో పాటు త‌ల్లిదండ్రులు కూడా గ‌మ‌నించాలి.

ప్ర‌శ్న : ప‌రీక్షా స‌మ‌యంలో విద్యార్థులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
జ‌వాబు : ఇది వేస‌వి కాలం కాబ‌ట్టి సాధ్య‌మైనంత వ‌ర‌కు ఎక్కువగా మంచినీరు తాగాలి. రోజూ తినే ఆహార‌మే అయిన‌ప్ప‌టికినీ కారం, మ‌సాలాల‌తో కూడిన ఆహారానికి దూరంగా ఉండాలి. కొంద‌రు విద్యార్థులు ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద చిరుతిండ్లు తిన‌డానికి ఇష్ట‌ప‌డుతారు. ఇది ఎంత‌మాత్ర‌మూ మంచిదికాదు. దీనివ‌ల్ల‌.. ఏకొంచెం క‌డుపులో అల‌జ‌డి క‌లిగినా.. అది ఆరోజు ప‌రీక్ష మీద ప్ర‌భావం చూపుతుంది. ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద విద్యార్థులు ఎండ‌లో నిల‌బ‌డ‌రాదు.

ప్ర‌శ్న : ప‌రీక్షా స‌మ‌యంలో త‌ల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి..?
జ‌వాబు : త‌ల్లిదండ్రులు సాధ్య‌మైనంత వ‌ర‌కు విద్యార్థుల ప‌రీక్ష‌లు పూర్తి అయ్యేంత వ‌ర‌కు ఇంట్లో టీవీ వాడ‌కుండా ఉంటే మంచిది. పిల్ల‌ల ద‌గ్గ‌ర చ‌ర‌వాణి లేకుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. వారిపై ఒత్తిడి క‌ల‌గ‌కుండా ప్ర‌శాంతంగా చ‌దువుకునే విధంగా వాతావ‌ర‌ణం క‌ల్పించాలి. ఈ స‌మ‌యంలో ఇంట్లో జ‌న్మ‌దిన‌, పెళ్లిరోజు వేడుక‌లు ఆర్భాటంగా జ‌రుపుకోకుంటే మంచిది. దీనివ‌ల్ల పిల్ల‌ల ఏకాగ్ర‌త‌కు భంగం క‌లిగే ప్ర‌మాదం ఉంటుంది.

ప్ర‌శ్న : చివ‌ర‌గా.. విద్యార్థుల‌కు మీరిచ్చే సందేశం?
జ‌వాబు : సంక‌ల్ప‌మే స‌గం బ‌లం. మంచి సంక‌ల్పం మ‌న‌సులో కలిగితే.. ఎప్పుడూ మంచే జ‌రుగుతుంది. ఆత్మ‌విశ్వాసం కోల్పోకుండా ఉండి ప‌రీక్ష‌లు రాయ‌డం పూర్తి చేయాలి. శ్ర‌మే నీ ఆయుధం అయితే.. విజ‌యం నీ బానిస అవుతుంది.. అన్న వివేకానందుడి సూక్తిని మ‌రువ‌రాదు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img