Monday, September 16, 2024

అసైన్డ్ భూములకు రిజిస్ట్రేష‌న్లు!

Must Read

– సెల్ఫ్‌ అసెస్‌మెంట్ మాటున త‌తంగం
– న‌ర్సంపేట స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో అక్ర‌మాలు
– మామూలుగైతే ప‌దివేలు.. ఈ రిజిస్ట్రేష‌న్ల‌కు ల‌క్ష‌ల్లోనే వ‌సూళ్లు
– అవినీతి ప‌ర్వంలో మునిసిపాలిటీ అధికారుల భాగ‌స్వామ్యం

అక్ష‌ర శ‌క్తి, నిఘా ప్ర‌తినిధి : గతంలో ప్రభుత్వా లు పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూముల కొనుగోలు, అమ్మ కాలపై నిషేధం ఉన్నా.. న‌ర్సంపేట‌లో మాత్రం విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. న‌ర్సంపేట మునిసిపాలిటీ ప‌రిధిలోని ప‌లు స‌ర్వే నెంబ‌ర్ల‌లోని అసైన్డ్ ల్యాండ్ల‌కు అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్లు జ‌రిగిపోతున్నాయి.  న‌ర్సంపేట‌, ఖానాపూర్ మండ‌లాల్లో అసైన్డ్ ల్యాండులు ఉన్నాయి. గ‌త ప‌దేళ్ల‌కాలంలో న‌ర్సంపేట ప‌ట్ట‌ణ భూముల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. దీంతో అసైన్డ్ భూముల‌పై క‌న్నేసిన కొంత‌మంది రియ‌ల్ట‌ర్లు అసైన్డ్ భూముల‌కు రెవెన్యూ రికార్డులు సృష్టింప‌జేస్తున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో న‌ర్సంపేట స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యం అధికారులు అన్నీ తామై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాధార‌ణంగా ఒక్కో ఫైలుకు ఐదు వేల వ‌ర‌కు పైకం విధిస్తున్న అధికారులు.. అసైన్డ్ భూముల వ్య‌వ‌హారంలో మాత్రం ఏకంగా ల‌క్ష‌ల్లో లంచాలు గుంజుతూ.. అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్లు కానిచ్చేస్తున్నారు. గుట్టుచ‌ప్పుడుగాకుండా సాగుతున్న ఈ తతంగంతో అక్ర‌మార్కులు అందిన‌కాడికి దండుకుంటున్న‌ట్లు అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం.

న‌ర్సంపేట మునిసిపాలిటీ పరిధిలో

న‌ర్సంపేట మునిసిపాలిటీ శివారులోని వంద‌లాది ఎక‌రాల భూమి అసైన్డ్ ల్యాండ్‌ అన్యాక్రాంత‌మ‌వుతూ వ‌స్తోంది. గ‌తంలో ప్ర‌భుత్వం పేద‌ల‌కు పంపిణీ చేసిన అసైన్డ్ భూమిని చాలా త‌క్కువ‌కు కొనుగోలు చేస్తున్న రియ‌ల్ట‌ర్లు స‌ద‌రు భూమిని ప్లాట్లుగా మార్చేస్తున్నారు. అసైన్డ్ భూమిలో ఇళ్ల నిర్మాణాల‌కు సంబంధించిన రిజిస్ట్రేష‌న్ చేయాలంటూ మీ సేవ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకుంటూ స‌మ‌ర్పిస్తున్న‌ సెల్ఫ్ అసెస్‌మెంట్‌నే రిజిస్ట్రేష‌న్ అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ద‌ర‌ఖాస్తుదారుడి ఏరియా, ప్రాంత వివ‌రాల ఆధారంగా అసైన్డ్‌, ప్ర‌భుత్వ భూముల్లో ప‌రిధిలో ఉందా అన్న విష‌యం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండానే రిజిస్ట్రేష‌న్లు కానిస్తుండ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి గ‌తంలోనూ ఇలాంటి రిజిస్ట్రేష‌న్లు జ‌రుగుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపించాయి. శాఖ‌ప‌ర‌మైన ఎంక్వ‌యిరీ జ‌ర‌గ‌కుండా త‌ప్పించుకున్న అధికారులు… గ‌త కొంత‌కాలంగా ఇబ్బ‌డి ముబ్బ‌డిగా రిజిస్ట్రేష‌న్లు చేసేస్తున్న‌ట్లు స‌మాచారం.

అక్ర‌మాల ప‌ర్వంలో ఇంట‌ర్ లింక్‌..

భూముల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వ భూమి కాద‌ని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అనుమానం క‌లిగితే ఎన్ వోసీ తెప్పించుకోవాలి. కానీ న‌ర్సంపేట స‌బ్ రిజిస్ట్రార్ ఇవేమీ చేయ‌క‌పోవ‌డం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. మునిసిపాలిటీకి- స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య అధికారుల‌కు అక్ర‌మాల్లో ఇంట‌ర్ లింక్ కనిపిస్తోంది. ఇంటి నెంబ‌ర్లు కేటాయించే స‌మమ‌యంలో క్షేత్ర‌స్థాయి త‌నిఖీలు నిర్వ‌హించాలి. ప్ర‌భుత్వ భూమిలో నిర్మాణం జ‌రిగిందా..? ప్రైవేటు ల్యాండా? నిర్ధార‌ణ చేసుకోవాల్సి ఉంది. కానీ అదేం జ‌ర‌గ‌డం లేదు. ఆ మాట కొస్తే అస‌లు ఖాళీ స్థ‌లాలకే ఇంటి నెంబ‌ర్లు జారీ చేసిన ఉదంతాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. వాస్త‌వానికి మొదటగా సంబంధిత  ఇంటి యజమాని మీసేవాలో ఇంటి నెంబర్ కోసం దరఖాస్తు చేసుకుంటాడు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటున్నారు. ఆ డాక్యూమెంట్స్ సాయంతో మునిసిపల్ అధికారులను కలుస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఆధారంగా ఇంటి నెంబర్లను కేటాయిస్తున్నామ‌ని వెల్ల‌డిస్తూ.. అక్ర‌మాల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img