- సాహితీ సేవలో సత్య మొండ్రేటి
- వేలాది కవితలు… వందలకొద్ది రచనలతో
సాహితీలోకంలో తనకంటూ ప్రత్యేక స్థానం - విమర్శకుల ప్రశంసలు అందుకున్న సత్యవాక్కులు గ్రంధం
- వరించిన జాతీయ, అంతర్జాతీయ సత్కారాలు
- ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రాలు..
- ఓరుగల్లులో వీణానాదాలు గ్రంధావిష్కరణ..
- అక్షరశక్తితో మాటముచ్చట..
అక్షరమే ఆమె నేస్తం… అక్షరమే ఆమెకు సమస్తం.. కళలకు పుట్టినిళ్లు కాకినాడ ఆమె జన్మస్థలం. శతాబ్దాలుగా ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా, సంగీత, సాహిత్య ఉద్యమ రంగాల్లో ఎంతో విశిష్టత గల ఈ నగరం నుంచి ఆయా రంగాల్లో ప్రతిభ చూపిన అనేక మంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు, పొందుతున్నారు. ముఖ్యంగా సాహితీ రంగంలో కాకినాడకు ప్రత్యేక స్థానం ఉంది. సుప్రసిద్ధ సాహితీవేత్తలుగా ఓ వెలుగు వెలిగిన దేవులపల్లి కృష్ణశాస్త్రి, రజనీకాంతరావు, వేదుల అక్కడివారే… అలాంటి కవులు, రచయితల అడుగుజాడల్లో నడుస్తూ తన అక్షరాలతో ప్రజల హృదయాలను నూతనంగా ఆవిష్కరిస్తున్నారు ప్రముఖ రచయిత్రి సత్యవీణ మొండ్రేటి.. ఆమె కలం నుంచి జాలువారిన కవితల్లో స్త్రీవాదం పరిమళిస్తుంది. సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలతోపాటు ప్రణయ గీతాలు, యుగళములతో సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు సత్యవీణ. వేలాది కవితలు.. వందలకొద్ది కథలు రాశారు, రాస్తున్నారు. సమాజంలో జరుగుతున్న అరాచకాలు, రుగ్మతలు, తన మనసును కదిలించిన ఆవేదననే అక్షరాలుగా మలుస్తూ సాహితీలోకంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. సత్య వాక్కులు పేరుతో తన రచనలను ఇటీవలే గ్రంధస్తంచేసిన ఆమె తాజాగా వీణానాధాలు పేరుతో రెండో గ్రంధాన్ని ప్రచురించారు. ఇటీవలే ఓరుగల్లులో సాహితీవేత్తలు, ప్రముఖుల సమక్షంలో పుస్తకావిష్కరణ గావించారు. ఈసందర్భంగా సత్యవీణ మొండ్రేటి అక్షరశక్తితో ముచ్చటించారు. తన అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. ఆమె మాటల్లోనే… (అక్షరశక్తి, వరంగల్)
వేలకొద్దీ కవితలు, వందలాది కథలు ..
సాగర తీరాన సూర్యోదయ గోదావరి జిల్లా కాకినాడ నగరం మాది. ఎందరికో మార్గ నిర్దేశకులు అయిన చిన్నం వెంకట్రావు-సుబ్బాయమ్మ తల్లిదండ్రులు. కొండయ్యపాలెంలో హైస్కూల్, అండాలమ్మ కాలేజ్‌లో ఇంటర్, పీవీఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివా. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశా. చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువ ఉండేది. విద్యార్థినిగా ఉన్నప్పటి నుంచే చిన్నచిన్న కథలు, రచనలు రాయడం మొదలపెట్టా. భర్త రాంబాబు మొండ్రేటి ఉద్యోగరీత్యా ఉత్తర భారతదేశంలో ఉండే వాళ్లం. అక్కడ కొన్నాళ్లు అధ్యాపకురాలిగా పనిచేశా. మాకు ఇద్దరు పిల్లలు విజ్ఞత (డెంటిస్ట్), ఆశిష్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (యూఎస్ఏ). పిల్లలు పుట్టాక జాబ్ మానేసి పూర్తిగా వారి బాధ్యతపైనే దృష్టి పెట్టా. మహాకవుల సాహిత్య పఠనం వల్లే సాహిత్యంపై ఆసక్తిపెరిగింది. చిన్నచిన్న కవితలతో మొదలైన సాహితీ ప్రయాణం… ధారావాహికలు వరకు చేరింది. కొన్నాళ్లు వేరే రాష్ట్రంలో ఉండడం వల్ల ఇంటి బాధ్యతలతో రచనలకు విరామం ప్రకటించి వాటిని భద్రంగా దాచుకున్నా. హైదరాబాద్ వచ్చాక తిరిగి నా సాహిత్యం స్పందించింది. చాలా పత్రికలకు నా కథలు పంపాను. ఈనాడు వసుంధరకు మూడు సంవత్సరాలపాటు ఆర్టికల్స్ రాశాను. వేలకొద్ది కవితలు, వందలాది కథలు రాశా.
వారి ప్రేరణతోనే..
చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర చదివా. పెద్దయ్యాక పుస్తక పఠనంతో ఆనాటి సాహిత్యం నన్ను ఆకర్షించింది. మహాకవుల రచనలు చదివి వారి ప్రేరణతోనే రాయాలన్న ఆలోచన నాలో మొదలైంది. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే చిన్న చిన్న కథలు, కవితలు రాయడం మొదలుపెట్టా.. ప్రేరనైతే వారిదే కానీ ఎవరినీ అనుకరించలేదు. నా శైలి నాదే. మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలకు, చలించి కలాన్ని కదిలించా. రచనా రంగంలో నాకు స్ఫూర్తినిచ్చింది గురజాడ, వీరేశలింగం, గిడుగు రామ్మూర్తి, స్త్రీవాద రచయిత్రి కే రామలక్ష్మి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షిగార్లు.. సమాజంలో కొందరినైనా నా రచనలు చైతన్యవంతులను చేస్తాయని నా నమ్మకం. ఇప్పటి వరకు మొత్తం 1000 కవితలు 200 కథలు.. 15 ప్రక్రియలలో 15 శతకాలు 20 బాల గేయాలు, 10 బాల సాహిత్యం, 20 ఆదిప్రా ప్రాసాక్షర కవితలు, 20 అంత్యప్రాసాక్షర కవితలు.. 50 చిత్ర కవితలు, గజల్స్ రుబాయిలు, ఇష్టపదులు, ఆట వెలది, లఘు ఆర్‌సీటీ కవితా ప్రక్రియలు రాసా. నవల రాస్తున్నాను, సీరియల్ కథలు రాశాను.ఇప్పటి వరకు రెండు గ్రంథాలు ప్రచురించాను. ఆధునిక ప్రక్రియల్లో సత్యవాక్కులు, కవితలు వీణానాదాలు ఆవిష్కరించాం. ఇంకా ప్రచురించవలసినవి చాలా ఉన్నాయి. రెండు పుస్తకాలు నాకు చాలా గుర్తింపు తెచ్చాయి. సత్యవాక్కులు కర్ణాటక తెలుగు సమాఖ్య వారి అవార్డును పొందింది. విజయవాడ తెలుగు పరిషత్ వారి అవార్డునూ దక్కించుకుంది.
సాహిత్య ప్రయాణం ..
నా తొలి ముద్రణ సత్యవాక్కులు ఎంతో పేరు తెచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉంది. రెండు నెలల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల సాహిత్య అవార్డులు పొందడం గర్వంగా ఉంది. వాగ్దేవి వరంతో నా రెండో ముద్రణ కవితలు నా స్వీయ కవితలు వీణానాధాలు గ్రంధస్తం చేయించా. కళలకు పుట్టినిల్లు అయిన ఓరుగల్లులో నా వీణానాధాలు పుస్తకాన్ని ఆవిష్కరించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి. కవితలు, రచనలతోనే సరిపెట్టుకోకుండా మనవంతుగా సమాజానికి ఏదైనా చేయలన్న ఆలోచనతో పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నా.. విద్య, వైద్యం, సామాజిక సేవలో భాగస్వామ్యం అవుతున్నా. అందులో భాగంగానే వృద్ధాశ్రమ నిర్వహణతోపాటు పలు ఆశ్రమాలకు విరాళాలు అందిస్తున్నా. తుపాను బాధితులకు ఆహార వితరణతోపాటు కొవిడ్ బాధితులకు సహాయంగా విరాళాలు అందజేయడం తృప్తినిచ్చింది.
స్వీకరించిన పురస్కారాలు..
సృజన శ్రీ, హరివిల్లు కవి మిత్ర, జ్ఞాన తేజ, శతతేనియకవి, శారదా తేజం, సాహితీ మిత్ర, తెలుగు శ్రీ,
బుల్లెట్ కవి శారద, మెరుపు మిత్ర, రాజశ్రీ, సావిత్రిబాయి పూలే, మాతృదేవోభవ, మదర్ థెరిస్సా పురస్కారంతోపాటు ఇప్పటి వరకు అనేక సంస్థల ద్వారా 15పైగా పురస్కారాలు , బిరుదులు లభించాయి. 50కి పైగా సన్మానాలు పొందాను. ప్రభుత్వపరంగా ప్రశంసాపత్రాలతోపాటు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ సర్టిఫికెట్లు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా.