అక్షరశక్తి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా శుక్రవారం రాత్రి కిరణ్ ఖారే బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కిరణ్ ఖారె హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సౌత్, వెస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తూ బదిలీల్లో భాగంగా భూపాలపల్లి జిల్లాకు ఎస్పిగా వచ్చారు. ముందుగా జిల్లా పోలీసుల కార్యాలయానికి చేరుకున్న నూతన ఎస్పి సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కిరణ్ ఖారె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో స్వేచ్చాయుత, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. జిల్లాలో మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, నేరాల నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ ఉండదని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. అనంతరం జిల్లాలోని పోలీసు అధికారులు నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు.