అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో టి-సాట్ నెట్వర్క్ గ్రూప్-1 అభ్యర్థుల కోసం ప్రత్యేక పాఠ్యాంశ ప్రసారాలు అందిస్తోంది. ప్రిలిమ్స్ మరియు మేయిన్స్ పరీక్షల కోసం ప్రత్యక్ష ప్రసారాలు, మాక్ టెస్టులు, క్విజ్ ఎపిసోడ్స్ అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది టి-సాట్. గ్రూప్-1 పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రసారాల వివరాలను టి-సాట్ సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి పత్రిక ప్రకటనలో వివరించారు. ఏప్రిల్ 25వ తేదీ నుండి లైవ్ ప్రసారాలను అందిస్తుండగా, 10వ తేదీ నుండి గంట పాటు రికార్డింగ్ పాఠ్యాంశాలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిపుణ ఛానల్ లో సాయంత్రం ఏడు నుండి ఎనిమిది గంటల వరకు, విద్య ఛానల్ లో ఉదయం ఏడు నుండి ఎనిమిది గంటల వరకు పున:ప్రసారాలుంటాయన్నారు. ప్రభుత్వం తొలిసారిగా భర్తీ చేస్తున్న 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని అనుభవం కలిగిన ఫ్యాకల్టీచే కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్ట్రీ, పాలిటీ, కల్చర్, ఎకనామీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల్లో సుమారు 1000 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
టెట్ ప్రసారాలు మరో గంట అదనం
ప్రభుత్వం జూన్ 12వ తేదీన నిర్వహించబోయే ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం పోటీ పడే అభ్యర్థులకు మరో గంట ప్రసారాలను అదనంగా అందిస్తున్నామని ఏప్రిల్ ఐదవ తేదీ నుండి అరగంట నిడివిగల రెండు పాఠ్యాంశ భాగాలను ప్రసారం చేస్తుండగా మరో అరగంట అదనంగా అందించడంతో పాటు ఉర్డూ పాఠ్యాంశాలను అరగంట అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఫలితంగా టెట్ అభ్యర్థులకు జూన్ ఐదవ తేదీ వరకు 150 ఏపిసోడ్స్ రోజు రెండు గంటల చొప్పున అందనున్నాయన్నారు.
క్విజ్ మరియు మాక్ టెస్టులు
పోటీ పరీక్షలకు అభ్యర్థులను అన్ని విధాలుగా సిద్ధం చేసేందుకు టి-సాట్ ప్రత్యేకంగా క్విజ్ ఎపిసోడ్స్ ప్రసారం చేస్తూ అన్ లైన్ మాక్ టెస్ట్ నిర్వహించి ప్రతిభకు పదును పెట్టే కార్యక్రమాన్ని చేపట్టిందని శైలేష్ రెడ్డి తెలిపారు. పాఠ్యాంశాల్లోని ప్రశ్నలను ఆకర్షణీయ పద్దతుల్లో గ్రాఫిక్స్, యానిమేషన్స్ జతచేస్తూ చేస్తున్న ప్రసారాలను అభ్యర్థులు వినియోగించుకొని విజయాలు సాధించాలని సూచించారు.