మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్న రామాచారి
అక్షరశక్తి, హన్మకొండ : కేసముద్రం మండల సాక్షి విలేకరి దూదికట్ల రామాచారి రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్నారు. కురవి మండలకేంద్రానికి చెందిన రామాచారి సాక్షి దినపత్రికలో దశాబ్దకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. “అయ్యో పాపం” ‘కానరాని లోకాలకు కన్న తల్లిదండ్రులు’ శీర్షికతో సాక్షి దినపత్రికలో గత ఏడాది వార్తా కథనాన్ని రాశారు. ఈ కథనం అధికారులను, ప్రజాప్రతినిధులను కదిలించింది. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలిచింది. అధికారులు , స్వచ్ఛంద సేవ సంస్థలు ముందుకొచ్చి, అనాథ పిల్లలను అక్కున చేర్చుకున్నాయి. వారి చదువుకు అయ్యే ఖర్చులను భరించడమేగాక, ఆర్థికసాయం చేసి, పిల్లల కోసం ఇంటిని నిర్మించారు.
ఈక్రమంలోనే ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ మీడియా 2020-2021 సంవత్సరానికిగాను ఉత్తమ మానవీయ కథనంగా ఎంపికచేసింది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు జర్నలిస్టు రామాచారికి రాష్ట్ర స్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందజేసి అభినందించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో.. జర్నలిస్టులు ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్లు.. సభలు, సమావేశాలకు పరిమితమవుతున్న నేపథ్యంలో మానవీయ కథనాలను వెలుగులోకి తీసుకువచ్చి.. నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపడం అభినందనీయం అంటూ రామాచారిని అభిందించారు. కాగా, రాష్ట్రస్థాయి అవార్డు పొందిన దూదికట్ల రామాచారిని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ బండి సంపత్ కుమార్‌తోపాటు సహచర జర్నలిస్టులు, మిత్రులు, కేసముద్రం మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.