Saturday, September 7, 2024

రైల్వే నిధుల్లో తెలంగాణ‌కు మొండిచేయి

Must Read
  • బడ్జెట్‌లో రాష్ట్రానికి కంటితుడుపుగా కేటాయింపులు
  • కొత్త లైన్ల ఊసేలేదు.. ఉన్న‌వాటికి అర‌కొర కేటాయింపులు
  • కాజీపేట‌లో వ్యాగ‌న్ త‌యారీ క‌ర్మాగారంతో ఉద్యోగాలు రావు
  • ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ఈనెల 1న పార్లమెంటులో కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీర‌ని అన్యాయం జ‌రిగిందని, ముఖ్యంగా రైల్వే నిధుల్లో మళ్లీ మొండిచేయి చూపార‌ని ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ నుంచి ప్రతిపాదనలు పంపిన కొత్త రైల్వేలైన్ల‌, రైళ్ల‌కు అనుమ‌తి ఇవ్వకపోగా, పాత ప్రాజెక్టులకు మొక్కుబడిగా నిధులు కేటాయించింద‌ని ఆరోపించారు. తెలుగు రాష్టాల‌కు 2023-24 రైల్వే బ‌డ్జెట్‌లో 12,824 కోట్లు కేటాయించిన‌ట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్ల‌డించార‌ని, ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.8,406 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు మాత్రం రూ.4,418 కోట్లు మాత్రమే విదిల్చి రాష్ట్రంపై మ‌రోసారి త‌న వివ‌క్ష ప్ర‌ద‌ర్శించింద‌ని మండిప‌డ్డారు. కేంద్ర బ‌డ్జెట్‌పై వినోద్‌కుమార్ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత రైల్వే బ‌డ్జెట్ ర‌ద్దు చేసి, సాధార‌ణ బ‌డ్జెట్‌లోనే రైల్వే ప‌ద్దులు చూపుతుండ‌టంతో ప్ర‌జ‌ల‌కు రైల్వే బ‌డ్జెట్‌పై న‌మ్మ‌కం పోయింద‌న్నారు. ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త దేశాల మ‌ధ్య మూడో లైన్‌కు నిధులు కేటాయించి, సికింద్రాబాద్ ద‌క్షిణ మధ్య రైల్వేకు కేటాయించామ‌ని చెప్పుకోవ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు. తాను హ‌న్మ‌కొండ ఎంపీగా ఉన్న 2004- 2009 మ‌ధ్య కాలంలోనే రామ‌గుండం- మ‌ణుగూరు రైల్వే లైన్ స‌ర్వే జ‌రిగిందని, దాదాపు 15 ఏండ్లు గ‌డిచిన త‌ర్వాత ఇప్ప‌డు రూ. 15 కోట్లు కేటాయించార‌న్నారు. మొత్తం ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ. 19 వంద‌ల కోట్ల‌యితే.. కేవ‌లం రూ. 10 కోట్లు కేటాయించ‌డం దారుణం అన్నారు. మ‌నోహ‌రాబాద్ – కొత్త ప‌ల్లి రైల్వే లైన్‌కు రూ. 450 కోట్లు కేటాయించార‌ని, దీనికి మూడో శాతం నిధులు రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించ‌డ‌మేగాక‌, భూసేక‌ర‌ణ కూడా చేప‌డుతుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌ర్చుచేస్తున్న వాటికి వాళ్ల వంతుగా బ‌డ్జెట్ కేటాయించారు త‌ప్పితే, తెలంగాణ‌కు కొత్త‌గా రైల్వే లైన్‌ను కేంద్రం ఒక్క‌టి కూడా అనుమ‌తించలేద‌ని వినోద్ కుమార్ అన్నారు. అంతేగాక ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో అంత‌ర్భాగ‌మైన తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క రాష్టాల‌కు బుల్లెట్ ట్రైన్‌, వందేభార‌త్‌, ఎంఎంటీఎస్ రైళ్ల‌ల‌లోనూ తెలంగాణ‌కు కేంద్రం మొండిచేయి చూపింద‌ని ఆయ‌న ఆరోపించారు.

రైల్వే మంత్రి స‌మాధానం చెప్పాలి

కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం లేదని, పీవోహెచ్‌ ఓవర్‌హాలింగ్‌ కేంద్రాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చెప్పుకొచ్చార‌ని, ఓవర్‌హాలింగ్ కేంద్రంతో కొత్త‌గా ఒక్క ఉద్యోగం కూడా రాద‌ని వినోద్‌కుమార్ అన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందిప‌ర్చినప్ప‌టికీ కాజీపేటలో కోచ్ ఫ్యాక్ట‌రీ అవ‌స‌రంలేద‌ని చెప్పి లాధోర్‌లో ఏర్పాటుచేయ‌డం వెనుక ఆంత‌ర్యం ఏంట‌ని ప్ర‌శ్నించారు. దేశంలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీలు చాలానే ఉన్నాయని, కాజీపేటలో అవసరం లేదంటూ కొత్త ప్రాజెక్టుల విషయంలో దాటవేత ధోరణి అవలంభించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాజీపేట‌లో ఏర్పాటు చేస్తామ‌ని చెబుతున్న వ్యాగ‌న్ ప‌రిశ్ర‌మ కోసం ఎంత భూమి సేక‌రించాలి..? ఎన్ని కోట్ల రూపాయ‌లు మీరు పెట్టుబ‌డి పెడుతున్న‌రు..? ఎంత‌మందికి ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయి..? అనే అంశాల‌పై నేడు సికింద్రాబాద్‌కు వ‌స్తున్న కేంద్ర రైల్వే శాఖా మంత్రి స్ఫ‌ష్ట‌త ఇవ్వాల‌ని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img