- వరంగల్ పశ్చిమపై బీజేపీ ప్రత్యేక దృష్టి
- పాత స్థానాన్ని దక్కించుకునే దిశగా అడుగులు
- ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థి రావు పద్మ
- ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ విన్నపం
- అన్ని వర్గాల నుంచి పెరుగుతున్న మద్దతు
- బీఆర్ఎస్‌పై వ్యతిరేకత.. కేంద్ర ప్రభుత్వ పథకాలే
ఎన్నికల్లో గెలిపిస్తాయని ధీమా..
అక్షరశక్తి, వరంగల్ పశ్చిమ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. పాత స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఎలాగైనా ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరవేయాలన్న పట్టుదలతో అడుగులు వేస్తోంది. అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్‌భాస్కర్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు అభ్యర్థి ఎంపికలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగానే దశాబ్దకాలానికిపైగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ, నిత్యం క్యాడర్‌తో మమేకమవుతూ, అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ ముందుకుసాగుతున్న బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను పోటీకి దించింది అధిష్టానం. ఈక్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ని ఓడించేందుకు రావు పద్మ వ్యూహాలు రచిస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆడపడుచుకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. అధికార బీఆర్ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రధాని మోడీ చరిష్మా, గ్రేటర్ వరంగల్‌లో వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే బీజేపీని గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో కీలక పాత్ర..
వరంగల్ మహానగరంలో దశాబ్దానికిపైగా బీజేపీలో రావు పద్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలిగా పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ కమలదళాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అనేక సందర్భాల్లో కేసులు, జైళ్లకు భయపడకుండా ముందుకు సాగుతూ శ్రేణుల్లో భరోసా నింపుతున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తనదైన శైలిలో బలంగా తీసుకెళ్తున్నారు. ఈనేపథ్యంలోనే రెండేళ్ల కింద జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తన మార్క్ చూపించారు. సమన్వయంతో పార్టీని ముందుండి నడిపించారు. అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఏకంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో పది సీట్లు బీజేపీ గెలుచుకోవడంలో రావు పద్మ కీలకంగా పనిచేశారు. ఇందులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచే నలుగురు కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మహిళల బ్రహ్మరథం..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఈ నియో జకవర్గం గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గంలో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగు లు మెజార్టీగా ఉన్నారు. అంతేకాదు ఇక్కడ రెడ్డి సామాజిక ఓట్లు అధికంగా ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ వీ రి ఓట్లే ఇక్కడ గెలుపు ఓటములను శాసిస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీరి ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అధిష్టానం ఈ ఎన్నికల్లో రావు పద్మను రంగంలోకి దిం పింది. గతంలో గెలిచిన స్థానం కావడంతో తిరిగి పాగా వేయాలని బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. కాగా, రావు పద్మకు టికెట్ ఇవ్వడం ద్వారా మహిళల ఓట్లు తమవైపు తిప్పుకోవచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. ఈక్రమంలోనే వరంగల్ పశ్చిమపై కాషాయ జెండా ఎగరేయాలన్న పట్టుదలతో రావు పద్మ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాలతో మమేకం అవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మీ ఇంటి ఆడబిడ్డను.. మీ కష్టాల్లో తోడుగా ఉన్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రావు పద్మ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.