Saturday, September 7, 2024

భూపాల‌ప‌ల్లిలో గులాబీ పోలీస్ ?

Must Read
  • ఎమ్మెల్యే గండ్ర‌కు కొమ్ముగాస్తున్న కొంద‌రు అధికారులు !
  • బీఆర్ఎస్‌ పార్టీకి అనుకూలంగా మారారంటూ విమ‌ర్శ‌లు
  • ఓట‌మి భ‌యంతో ర‌మ‌ణారెడ్డి ఆఖ‌రి అస్త్రం ?
  • పోలీసుల‌ను అడ్డుపెట్టుకుని రాజ‌కీయం !
  • భూపాలపల్లి నియోజకవర్గంలో
    చ‌ర్చ‌నీయాంశం అవుతున్న ఖాకీల ప‌నితీరు
  • తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్న ప్రతిప‌క్షాలు, ప్ర‌జ‌లు

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో కొంద‌రు పోలీసుల తీరు తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అధికార బీఆ ర్ఎస్‌ పార్టీకి కొమ్ముకాస్తున్నానే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి తొత్తులుగా మారిన కొంద‌రు ఖాకీలు ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు కోసం కండువాలేని కార్య‌క‌ర్త‌ల మాదిరిగా పనిచేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా సాయం చేసిన సార్‌కు కృతజ్ఞతా భావంతో కొంతమంది పోలీసు అధికారులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే టాక్ నియోజకవర్గంలో బలంగా వినిపిస్తుంది. గ‌తంలో భూపాలపల్లి ఎస్పీగా పని చేసిన సురేందర్‌రెడ్డిని ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం ఎలక్షన్ కమిషన్ ఇక్కడి నుంచి బదిలీ చేసింది. సురేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి సమీప బంధువనే ఆరోపణలు రావ‌డంతోనే ఈసీ నిర్ణయం తీసుకున్నట్లు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. అయితే తాజాగా.. జిల్లాలో ప‌నిచేస్తున్న సీఐలు, ఎస్సైలు కొందరు ఇప్పటికీ ఎమ్మెల్యే గండ్రకు లోలోపల అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. నిష్ప‌క్ష‌పాతంగా విధులు నిర్వ‌హించాల్సిన పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా ప‌నిచేయ‌డం ఏంట‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు మండిప‌డుతున్నారు. ఇలాంటి పోలీసుల‌పై కూడా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ స‌త్వరం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వీళ్ల మూలంగా మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ‌పేరు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని కోరుతున్నారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా..

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలంటే అందులో పోలీస్ వ్యవస్థది కీలకపాత్ర. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ శాఖదే. రాజకీయ పార్టీలకతీతంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ భూపాలపల్లి నియోజకవర్గంలో ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కొంద‌రు పోలీసు అధికారులు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కనుసన్నల్లో పని చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో నియోజకవర్గంలో కోరుకున్న చోట పోస్టింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేపై కొంద‌రు సానుభూతి చూపుతూ కృత‌జ్ఞ‌తా భావంగా ఎన్నికల్లో
ప‌నిచేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది అధికారులు ఏకంగా అధికార పార్టీ కార్యకర్తల మాదిరిగానే వ్యవహరిస్తున్నారని అభిప్రాయాలు నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల‌న్నీ ఎన్నికల నిర్వహణకు ఇబ్బందికరంగా మారనున్నాయి. ప్ర‌స్తుతం భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులపై ప్రతిపక్షాలతోపాటు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌ల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పలుమార్లు బహిరంగ సభల్లో ఓపెన్ గానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతూ వేధింపుల‌కు గురిచేస్తున్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని పలు సందర్భాల్లో చెప్పారు. ఈ మేరకు అధికార పార్టీకి సహకరిస్తున్న అధికారుల జాబితాను కూడా తయారు చేసినట్లు కూడా చెబుతున్నారు. కానీ నియోజకవర్గంలోని కొంతమంది పోలీసు అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా బీఆర్ఎస్‌ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు. ఇలాంటి అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తప్ప‌వంటూ ప‌లువురు నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img