Sunday, September 8, 2024

వ‌ర్ధ‌న్న‌పేట‌లో అరూరికి ఎదురుగాలి!

Must Read
  • గ‌త ఎన్నిక‌ల్లో ర‌మేష్ తిరుగులేని విజ‌యం
  • ఈసారి అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితులు
  • వ‌రుస షాకులిస్తున్న కీల‌క అనుచ‌రులు
  • కాంగ్రెస్‌లోకి క్యూక‌డుతున్న నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు
  • తాజాగా 14 డివిజ‌న్ కార్పొరేట‌ర్, మాజీ జెడ్పీటీసీ కూడా..
  • రేపోమాపో మ‌రో కీల‌క నాయ‌కుడి రాజీనామా ?
  • ఇక ఉన్నోళ్లూ స‌హ‌క‌రించ‌డం క‌ష్ట‌మే..!
  • వ‌ర్ద‌న్న‌పేట‌ బీఆర్ఎస్ కోట‌కు బీట‌లు!

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోందా..? 2014, 2018 ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో తిరుగులేని విజ‌యం సాధించిన అరూరి ర‌మేష్‌.. ఈసారి అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారా..? ఆయ‌న అనుచ‌రులు, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు వ‌రుస రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి క్యూ క‌డుతుండ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మా..? పార్టీ నుంచి పోయిన‌వాళ్ల సంగ‌తి వ‌దిలేస్తే.. ఉన్నోళ్లూ స‌హ‌క‌రించ‌డం క‌ష్ట‌మేన‌నే టాక్‌ ప్ర‌తికూల‌త‌కు సంకేతమా..? అంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. ఎమ్మెల్యే అరూరి ర‌మేష్ తీరుపై క్యాడ‌ర్‌తో నెల‌కొన్న అసంతృప్తికి రాష్ట్ర వ్యాప్తంగా వీస్తున్న కాంగ్రెస్ గాలి తోడు కావ‌డంతో ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఉక్కిరిబిక్కిర‌వుతున్నార‌నే టాక్ గులాబీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నాయ‌కులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేర‌గా.. తాజాగా, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 14వ‌ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ తూర్పటి సులోచన, హన్మకొండ మండల మాజీ జెడ్పీటీసీ తూర్ప‌టి సారయ్య, శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓదెల రవితేజ హ‌స్తం గూటికి చేరారు. ఈ నేప‌థ్యంలో వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ కోట‌కు ఈసారి బీట‌లు వారుతున్నాయ‌నే చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సాగుతోంది.

కాంగ్రెస్‌లోకి నాయ‌కుల క్యూ…
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బ‌లంగా వీస్తుండ‌డంతో ఎమ్మెల్యే అరూరి ర‌మేష్‌పై తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ‌దారి తాము చూసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి క్యూ క‌డుతున్నారు. నిత్యం ఎవ‌రో ఒక‌రు బీఆర్ఎస్‌ కీల‌క నాయ‌కులు కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటున్నారు. తాజాగా, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 14వ‌ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ తూర్పటి సులోచన, హన్మకొండ మండల మాజీ జెడ్పీటీసీ తూర్ప‌టి సారయ్య కాంగ్రెస్ లో చేరారు. అలాగే, శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓదెల రవితేజ కూడా హ‌స్తం గూటికి చేరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది రోజుల కింద‌ట‌, ప‌ర్వ‌త‌గిరి మండ‌ల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, రెండు సార్లు ఎనుమాముల మార్కెట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన ప‌ల్లెపాటి శాంతికుమార్ ర‌త‌న్‌రావు, హ‌స‌న్‌ప‌ర్తి పీఏఏసీఎస్ చైర్మ‌న్ బిల్ల ఉద‌య్‌రెడ్డి, 65వ డివిజ‌న్ బీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు ఏరుగొండ శ్రీ‌నివాస్‌, ప‌ర్వ‌త‌గిరి జెడ్పీటీసీ సింగ్‌లాల్‌, ఆయ‌న భార్య‌, మాజీ కార్పొరేట‌ర్ క‌ల్ప‌న‌లు కూడా కాంగ్రెస్ గూటికి చేరిన విష‌యం తెలిసిందే. రేపోమాపో మ‌రో కీల‌క నేత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేర‌డం ఖాయ‌మ‌ని అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం.

కొంత‌కాలంగా అసంతృప్తి సెగ‌లు
వ‌ర్ధ‌న్న‌పేట బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే అరూరి ర‌మేష్‌పై కొంత‌కాలంగా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఒకానొక‌ద‌శ‌లో పార్టీ పెద్ద‌ల‌కు కూడా ఫిర్యాదు చేసిన‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అందులో నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క నాయ‌కులూ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు కొంత స‌ద్దుమ‌ణిగిన‌ట్లు క‌నిపించినా.. అదంతా వ‌ట్టిముచ్చ‌టేన‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఓ వైపు కొంద‌రు నాయ‌కులు, ప్రజాప్ర‌తినిధులు పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకుంటుండ‌గా.. పార్టీలో ఉన్న‌వాళ్లూ ఎమ్మెల్యే అరూరి ర‌మేష్‌కు పూర్తిస్థాయిలో స‌హ‌క‌రించే ప‌రిస్థితులు లేవ‌నే చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో పార్టీలో ఎవ‌రిని న‌మ్మాలో.. ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో తెలియ‌ని గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణాన్ని అరూరి ర‌మేష్ ఎదుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది. రేపో మాపో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీల‌క నాయ‌కుడు కూడా రాజీనామా చేసి.. కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు అత్యంత విశ్వ‌సనీయ స‌మాచారం.

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img