- అధ్వానంగా పథకం అమలు
- అశాస్త్రీయంగా నేత్ర పరీక్షలు
- కేవలం రీడింగ్ గ్లాసెస్‌కే పరిమితం
- జాడలేని ప్లస్1.25, 1.75, 2.25, 2.75 అద్దాలు
- ఎక్కువ డోస్‌తో తీవ్ర ఇబ్బందులు
- వారం దాటినా అందని ప్రిస్కిప్షన్ గ్లాసెస్
- రెండు నెలలు కావొస్తున్నా అందని జీతాలు
- తీవ్ర అసంతృప్తిలో సిబ్బంది
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : తెలంగాణలో అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు, వారు ఎక్కడ నివసిస్తున్నా ఏమి చేస్తున్నా, ఏ కంటి సమస్య ఉన్నవారైనా నివారణ మార్గాలను అత్యున్నత నాణ్యత గలిగిన వైద్యం ఖర్చు లేకుండా అందుబాటులోకి తేవడం.. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం తన సంకల్పంగా చెబుతోంది. కానీ.. క్షేత్రస్థాయిలో కంటివెలుగు పథకం అమలు తీరు అధ్వానంగా కనిపిస్తోంది. ప్రభుత్వం చెబుతున్న దానికి.. జరుగుతున్నదానికి సంబంధంలేకుండా కనిపిస్తోంది. శిబిరాల్లో నేత్రపరీక్షలు, కళ్లద్దాల పంపిణీ అశాస్త్రీయంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతితక్కువ ధరలకు దొరికే రీడింగ్ గ్లాసెస్‌కే కంటి వెలుగు కేంద్రాలు పరిమితమయ్యాయనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇక ప్రిస్కిప్షన్ గ్లాసెస్ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. స్వయంగా వైద్యసిబ్బంది కూడా పథకం అమలు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు శిబిరాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యసిబ్బందికి కూడా రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం గమనార్హం. కాగా, మొదటి దఫా కంటి వెలుగులో సర్జరీలతోపాటు బైఫోకల్ గ్లాసెస్ ఇచ్చారు. ఈసారి, కేవలం రీడింగ్ గ్లాసెస్ మాత్రమే ఇస్తున్నారు.
- అశాస్త్రీయంగా పరీక్షలు
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాల్లో పరీక్షలు అశాస్త్రీయంగా జరగుతున్నాయి. సాధారణంగా దగ్గరిచూపు సమస్యతో బాధపడుతున్న వారిలో 40ఏళ్ల వయస్సున్న వారికి ప్లస్1.00 అద్దాలు, 45ఏళ్ల వయస్సు వారికి ప్లస్ 1.50 అద్దాలు, 50ఏళ్ల వయస్సు వారికి ప్లస్ 2.00 అద్దాలు, 55ఏళ్ల వయస్సు వారికి ప్లస్ 2.50 అద్దాలు, 60ఏళ్ల వయస్సు వారికి ప్లస్ 3.00 అద్దాలు ఇస్తారని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం కంటి వెలుగు కేంద్రాల్లో ఇవే అద్దాలను ఇస్తున్నారు. కానీ, 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి అవసరమైన ప్లస్ 1.25 అద్దాలు, 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి అవసరమైన ప్లస్ 1.75 అద్దాలు, 50 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు వారికి అవసరమైన ప్లస్ 2.25 అద్దాలు, 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారికి అవసరమైన ప్లస్ 2.75 అద్దాలు ఇవ్వడం లేదు. ఇంతవరకూ ఆ స్టాకే లేనట్లు సమాచారం. అయితే.. వీరికి కూడా ప్లస్1.00, ప్లస్ 1.500, ప్లస్ 2.00, ప్లస్ 2.500, ప్లస్ 3.00 అద్దాలు ఇస్తుండడంతో కొంతమేరకు డోస్ ఎక్కువై ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక చేసేది ఏమీలేక వైద్యసిబ్బంది సైలెంట్‌గా ఉండిపోతున్నట్లు సమాచారం. - కళ్లద్దాలు ఇవ్వలేకనే..
కంటి వెలుగు కేంద్రాల్లో పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి కూడా అద్దాలు ఇచ్చే పరిస్థితులు లేనట్లు తెలుస్తోంది. నిజానికి, డిస్టెన్స్ విజన్‌లో 6|6 పరీక్షలు చేయాలి. కానీ, కంటి వెలుగు శిబిరాల్లో వరకు 6|12వరకే చూస్తున్నారు. సాధారణంగా నియర్ విజన్‌లో ఎన్6 వరకు చూడాలి. కానీ ఎన్9 వరకు చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఏకంగా 6|24 వరకే పరీక్షించాలని, కళ్లద్దాలు ఇవ్వడం మరింతగా తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానురాను కంటి వెలుగు కేంద్రాల నిర్వహణ తూతూమంత్రంగానే సాగనున్నట్లు వైద్యసిబ్బందిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై స్వయంగా వైద్యసిబ్బందే నోరెళ్లబెడుతుండడం గమనార్హం. ఇలా అయితే, అంధత్వ నివారణ ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దగ్గరిచూపు సమస్యతో బాధపడుతున్న వారి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక దూరదృష్టి, ఇతర నేత్ర సమస్యలున్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. - జాడలేని జీతాలు..
కంటి వెలుగు కేంద్రాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ నేత్ర వైద్యసిబ్బందిని ఏజెన్సీ ద్వారా తాత్కాలిక పద్ధతిలో విధుల్లోకి తీసుకుంది. ఇందులో ఆప్తాల్మిక్ అసిస్టెంట్, ఆప్తోమెట్రిస్టు, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. వీరిని గత డిసెంబర్ 8న విధుల్లోకి తీసుకుంది. స్థానిక డీఎంహెచ్‌వోల పర్యవేక్షణలో వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత జనవరి 19 నుంచి కంటి వెలుగు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయితే, డిసెంబర్ 8వ తేదీన విధుల్లో చేరినా.. ఇంతవరకూ వారికి అందాల్సిన జీతాలు అందకపోవడంతో వైద్యసిబ్బంది తీవ్ర అసహనంతో ఉన్నారు. రెండు నెలలు కావొస్తున్నా.. జీతాలు ఇవ్వకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా, చాలావరకు కంటి వెలుగు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అయితే.. ఎలా పనిచేస్తామంటూ వైద్యసిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1500మంది నేత్రవైద్య సిబ్బంది ఉండగా, హన్మకొండలో 45మంది ఉన్నారు.