- కర్రతో తలపై మోదిన కూతురు
- రక్తపు మడుగులోనే ప్రాణాలు వదిలిన వెంకన్న
- ప్రేమ, ఆస్తి గొడవలే కారణం ?
- మానుకోట జిల్లాలో దారణం
అక్షరశక్తి, మహబూబాబాద్ రూరల్ : మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం కన్న తండ్రినే కర్రతో కొట్టి హతమార్చింది ఓ కూతురు. ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా వేంనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లం వెంకన్న ( 46 ) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వెంకన్న భార్య ఐలమ్మ ఏడాది క్రితం కరోనాతో మృతిచెందింది. ఒక్కగానొక్క కూతురు అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడి ప్రేమలో పడింది. కొన్ని రోజుల కింద కుల పెద్దల వద్ద పంచాయతీ నిర్వహించారు. మేజర్ అయ్యాక పెళ్లి చేస్తామని, అప్పటి వరకు బుద్ధిగా ఉండాలని నచ్చచెప్పి ఒప్పించారు. వెంకన్నకు సంబంధించిన ఆస్తి కాగితాలు మొదట వారి బంధువుల వద్ద ఉంచారు. బంధువులతో ఘర్షణ పడుతుండగా ఆస్తి కాగితాలను బంధువులు కులపెద్దలకు అప్పగించారు. కూతురు ప్రేమ విషయంతో ఆస్తి కాగితాలను బంధువులు, కుల పెద్దల వద్ద ఉంచాల్సి వచ్చిందని తండ్రీ, కూతురు మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈక్రమంలోనే గురువారం వెంకన్నకు కూతురుకు మధ్య ఘర్షణ తీవ్రంగా జరిగింది. దీంతో సహనం కోల్పోయిన కూతురు.. తండ్రిని కర్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని కూతురు గ్రామ పెద్దలకు తెలపగా వారు రహస్యంగా ఉంచారు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో మానుకోట సీఐ రవికుమార్, ఎస్సై అరుణ్ కుమార్ క్లూస్ టీంలతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విచారణ జరుపుతున్నామని, కూతురే హత్య చేసిందా..? ఇంకెవరైనా ఉన్నారా..? అన్న కోణంలో దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.