Saturday, July 27, 2024

ఆప‌రేట‌ర్ పోస్టుల మాయ!

Must Read

 

  • ఎన్పీడీసీఎల్‌లో రిటైర్డ్ ఉద్యోగుల స‌ర్టిఫికెట్ల‌తో దందా
  • అమ్మ‌కానికి స‌బ్‌స్టేష‌న్ల‌లో ఆప‌రేట‌ర్ పోస్టులు
  • స‌ర్టిఫికెట్ ఇచ్చినందుకు రూ.75వేల నుంచి ల‌క్ష‌కుపైగా వ‌సూలు
  • సెస్ సిరిసిల్ల నుంచి జ‌న‌గామ‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ డివిజ‌న్ల‌కు..?
  • ద‌ళారులుగా యూనియ‌న్ నాయ‌కులు, అధికారులు?
  • మోస‌పోతున్న అమాయ‌క నిరుద్యోగులు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : స‌ర్టిఫికెట్ ఒక‌రిది.. ప‌నిచేసేది మాత్రం మ‌రొక‌రు.. ఇదేలా సాధ్య‌మ‌ని అనుకుంటున్నారా..? ఇదంతా ఎన్‌పీడీసీఎల్ ప‌రిధిలోని స‌బ్‌స్టేష‌న్‌ల‌లో ఆప‌రేట‌ర్ల పోస్టుల విష‌యంలో సాధ్య‌మ‌వుతోంది. రిటైర్డ్ ఉద్యోగుల స‌ర్టిఫికెట్ల‌తో న‌యా దందా న‌డుస్తోంది. ఒక్క పోస్టుకు సుమారు 75వేల రూపాయ‌ల నుంచి ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు వ‌సూలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కొంద‌రు యూనియ‌న్ నాయ‌కులు, అధికారుల క‌నుస‌న్న‌ల్లోనే ఈ దందా న‌డుస్తోంద‌నే ఆరోప‌ణలు బ‌లంగా వినిపిస్తున్నాయి. అమాయ‌కుల నుంచి వ‌సూలు చేసిన డ‌బ్బును త‌లాకొంత పంచుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని జ‌న‌గామ‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ డివిజ‌న్ల‌లో కొంత‌మంది ఆప‌రేట‌ర్లు.. ఎన్పీడీసీఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ స‌ర్టిఫికెట్లపై ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అస‌లేం జ‌రుగుతోంది…?
ఎన్పీడీసీఎల్ ప‌నిచేస్తూ రిటైర్డ్ అయిన ఓఎన్ఎం స్టాఫ్‌.. కొత్త‌గా ఏర్పాటు చేస్తున్న‌ స‌బ్‌స్టేష‌న్ల‌లో ఆప‌రేట‌ర్లుగా ఉద్యోగం చేసుకునే వెసులుబాటును సంస్థ క‌ల్పిస్తూ అంత‌ర్గతంగా స‌ర్క్యుల‌ర్ జారీ చేసిన‌ట్లు తెలిసింది. రిటైర్డ్ అయిన ఓఎన్ఎం స్టాఫ్‌.. జేఎల్ఎం, ఏఎల్ఎం, ఎల్ఐ, ఫోర్‌మెన్లు స‌బ్‌స్టేష‌న్ల‌లో ఆప‌రేట‌ర్లుగా ప‌నిచేసుకునే అవ‌కాశం క‌ల్పించింది. ఇందుకుగాను.. నెల‌కు రూ.15వేల జీతం కూడా ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో స‌మీపంలో ఉన్న‌ సబ్‌స్టేష‌న్ల‌లో రిటైర్డ్ ఉద్యోగులు ఆప‌రేట‌ర్లుగా ప‌నిచేస్తున్నారు. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క, దూర‌ప్రాంతం వెళ్లి రాత్రిప‌గ‌లు ఆప‌రేట‌ర్లుగా ప‌నిచేయ‌లేక మ‌రికొంద‌రు ఇంటివ‌ద్ద‌నే ఉంటున్నారు. దీనినే ఒక అవ‌కాశంగా తీసుకున్న కొంద‌రు యూనియ‌న్ నాయ‌కులు, అధికారులు ద‌ళారుల అవ‌తార‌మెత్తి.. రిటైర్డ్ ఉద్యోగుల స‌ర్టిఫికెట్ల‌పై స‌బ్‌స్టేష‌న్ల‌కు స‌మీప దూరంలో ఉన్న వారితో ఆప‌రేట‌ర్లుగా ప‌నిచేయిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందుకుగాను, స‌ర్టిఫికెట్‌పై ప‌నిచేస్తున్న వారి నంచి భారీగానే డ‌బ్బులు దండుకుంటున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

సెస్ సిరిసిల్ల కేంద్రంగా దందా…?
ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్ల‌లోని కోఆప‌రేటివ్ ఎల‌క్ట్రిక్ స‌ప్ల‌య్ సొసైటీ(సెస్‌)కేంద్రంగా ఈ దందా ఎక్కువ‌గా న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ ప‌నిచేసి రిటైర్డు అయిన వారి స‌ర్టిఫికెట్ల‌పై జ‌న‌గామ‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ డివిజ‌న్ల‌లోని ప‌లు స‌బ్‌స్టేష‌న్ల‌లో ఆప‌రేట‌ర్లుగా ఇత‌రులు ప‌నిచేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సిరిసిల్ల ప్రాంతం నుంచి రిటైర్డ్ ఉద్యోగులు ఇక్క‌డికి వ‌చ్చి ఆప‌రేట‌ర్లుగా రాత్రిప‌గ‌లు ప‌నిచేసే అవ‌కాశాలు లేవు. కానీ.. వారి స‌ర్టిఫికెట్లు మాత్రం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌లు డివిజ‌న్ల‌లో ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల స‌ర్టిఫికెట్ల‌పై ఆప‌రేట‌ర్లుగా ప‌నిచేస్తే.. భ‌విష్య‌త్‌లో ప‌ర్మినెంట్ అవుతుందంటూ మాయ‌మాట‌లు చెప్పి.. అమాయ‌క నిరుద్యోగుల‌ను నిండాముంచుతున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ స‌ర్టిఫికెట్ ఇచ్చిన రిటైర్డ్ ఉద్యోగి మ‌ర‌ణిస్తే.. అత‌ని స‌ర్టిఫికెట్‌పై ప‌నిచేస్తున్న వ్య‌క్తి ఆప‌రేట‌ర్ ఉద్యోగం పోయిన‌ట్టే. దీంతో అత‌డికి తీర‌ని అన్యాయం జ‌రుగుతోంది. ఆ త‌ర్వాత‌, మ‌రో రిటైర్డ్ ఉద్యోగి ఆప‌రేట‌ర్‌గా రావ‌డ‌మా..? లేక అత‌డి స‌ర్టిఫికెట్‌పై ఇంకోవ్య‌క్తి ప‌నిచేయ‌డ‌మా..? ఏదోఒక‌టి జ‌రుగుతుంది. ఇదంతా కూడా కొంద‌రు యూనియ‌న్ నాయ‌కులు, అధికారుల మాయా ప్ర‌పంచంలో జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img