- దరఖాస్తులో తప్పులుంటే పరీక్షకు నో ఎంట్రీ..
- పేరు, పుట్టిన తేదీ, ఫొటో, సంతకం కీలకం
- ఎడిట్‌కు ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థుల విజ్ఞప్తి
టెట్ అభ్యర్థులకు కొత్త టెన్షన్ మొదలైంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అప్లికేషన్లలో తప్పులు దొర్లిన అభ్యర్థులకు కొత్త సమస్య వచ్చి పడింది. అప్లికేషన్లలో పేరు, పుట్టిన తేదీ, ఫొటో, సంతకం లాంటి ప్రధాన అంశాల్లో తప్పులుంటే.. ఇక ఆ అభ్యర్థులను పరీక్ష రాయనియ్యబోమని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అప్లికేషన్లలో తప్పులు దొర్లిన వేలాది మంది అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. ఎడిట్ ఆప్షన్ ఇవ్వకుండా తప్పులుంటే పరీక్ష రాయనియ్యబోమని చెప్పడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. జూన్‌లో పరీక్ష ఉన్నందున ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఎడిట్ ఆప్షన్ ఇవ్వబోం..
టెట్ పరీక్షకు మార్చి 26 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ ల12తో గడువు ముగిసింది. మొత్తం 6 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ క్రమంలో సర్వర్ ప్లాబ్లమ్, టెక్నికల్ ఎర్రర్స్‌తో చాలామంది అప్లికేషన్లలో తప్పులు దొర్లాయి. ఈసేవ, ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్లలో అప్లికేషన్లు ఇచ్చి రావడంతో పేర్లు, పుట్టిన తేదీ, జెండర్, స్టడీ, పేరెంట్స్ వివరాలు.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన తప్పులు దొర్లాయి. ఇంకొందరికి ఫొటోలు మారిపోగా, కొందరివి సంతకాలు అప్డేట్ కాలేదు. కొందరు మళ్లీ అప్లై చేసుకోగా.. అప్లికేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఎడిట్ ఆప్షన్ ఇస్తారని, ఆ టైమ్ లో సరిచేసుకోవచ్చని ఎక్కువ మంది భావించారు. కానీ ఇప్పుడు అప్లికేషన్ల ప్రక్రియ పూర్తయిందని, ఎడిట్ ఆప్షన్ ఇవ్వబోమని అధికారులు చెబుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ జిల్లాలోనే అధికమంది
పరీక్ష రాసేందుకు టెట్ అభ్యర్థులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే సెంటర్లను ఎంపిక చేసుకున్నారు. 30 వేలమంది హైదరాబాద్ జిల్లాలో, 22,878 మంది రంగారెడ్డి, 24,841 మంది నల్గొండ, 20,160 మంది మహబూబ్‌నగర్, 19,920 మంది ఖమ్మం, 18,720 మంది కరీంనగర్, 17,760 మంది నిజామాబాద్, 15 వేల మంది హన్మకొండ, 14,888 మంది సూర్యాపేటలో సెంటర్లు పెట్టుకున్నారు. అతి తక్కువగా 1,920 మంది ములుగు జిల్లాలో, 2,160 మంది భూపాలపల్లి, 5,040 మంది కుమ్రంభీం ఆసిఫాబాద్, 5,280 మంది పెద్దపల్లి జిల్లాలో సెంటర్లు పెట్టుకున్నారు. మొత్తం 3,90,421 మంది అభ్యర్థులు టెట్‌కు పేమెంట్ చేయగా.. వారిలో 3,79,101 మంది మాత్రమే అప్లికేషన్ పూర్తి చేశారు. కాగా, టెట్‌కు మొత్తం 6,26,928 అప్లికేషన్లు వచ్చాయి. దీంట్లో పేపర్ 1కు 3,50,205, పేపర్ 2 కు 2,76,723 దరఖాస్తులు అందాయి.