Saturday, July 27, 2024

సీకేఎంలో ప్రైవేట్ ల్యాబ్‌ల దందా!

Must Read
  • ప్ర‌సూతి హాస్పిట‌ల్‌ ఎదుట ఏర్పాటు
  • ఆస్ప‌త్రి సిబ్బంది సొంత వ్యాపారం?
  • ఆ ప‌రీక్ష‌ల‌న్నీ ఆ ల్యాబ్‌ల‌కే..
  • చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న ఉన్న‌తాధికారులు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : వ‌రంగ‌ల్ సీకేఎం ప్ర‌సూతి ఆస్ప‌త్రిలో ప్రైవేట్ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల దందా జోరుగా న‌డుస్తోంది. ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తున్న న‌లుగురు సిబ్బంది క‌లిసి ఒక ల్యాబ్‌, ఒక ఉద్యోగి మ‌రో ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకుని దందాకు తెర‌లేపిన‌ట్లు తెలుస్తోంది. ఆస్ప‌త్రి నుంచి హార్మోన్ల‌కు సంబంధించిన ప‌రీక్ష‌ల‌తోపాటు మ‌రికొన్ని ఇత‌ర ప‌రీక్ష‌లన్నీ కూడా ఆ ల్యాబ్‌ల‌కే వెళ్తున్న‌ట్లు స‌మాచారం. ఇదంతా కూడా ఆస్ప‌త్రి ఉన్న‌తాధికారులకు తెలిసినా చూసీచూడ‌న‌ట్లు వ్య‌హ‌రిస్తున్నార‌ని, ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, వైద్యాధికారుల ప‌ట్టింపులేనిత‌నంతో నిరుపేద‌లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారనే విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి.

ఆ ప‌రీక్ష‌ల‌న్నీ ప్రైవేట్ ల్యాబ్‌ల‌కే…
వ‌రంగ‌ల్ సీకేఎం ప్ర‌సూతి ఆస్ప‌త్రికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాతోపాటు ఇత‌ర ప్రాంతాల నుంచి కూడా గ‌ర్భిణులు వ‌స్తున్నారు. నెల‌వారీ చెక‌ప్‌ల‌తోపాటు ప్ర‌స‌వం కోసం ఆప్ప‌త్రిలో అడ్మిట్ అవుతున్నారు. ప్ర‌తీ గ‌ర్భిణికి హార్మ‌న్ల ప‌రీక్ష‌ల‌తోపాటు మ‌రికొన్ని ఇత‌ర ప‌రీక్ష‌లు చేయాల్సి ఉంటుంది. అయితే.. సీకేఎం ప్ర‌సూతి ఆస్ప‌త్రిలో ఒక ఓపీ ల్యాబ్‌, మ‌రొక‌టి ఎమ‌ర్జెన్సీ ల్యాబ్ ఉంది. ఈ ల్యాబుల్లో హార్మ‌న్ల ప‌రీక్ష‌ల‌తోపాటు మ‌రికొన్ని ఇత‌ర ప‌రీక్ష‌లు చేసే సౌక‌ర్యం లేన‌ట్లు తెలుస్తోంది. ఇదే అవ‌కాశంగా తీసుకున్న ఆస్ప‌త్రిలో ప‌నిచేసే సిబ్బంది సొంతంగా రెండు ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఆస్ప‌త్రి ల్యాబుల్లో చేయ‌ని ప‌రీక్ష‌ల‌న్నీ కూడా త‌మ సొంత ల్యాబుల‌కు పంపించి చేయిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మా…?
ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో పేద‌ల‌కు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. వ‌రంగ‌ల్ సీకేఎం ఆస్ప‌త్రిలోని ల్యాబుల్లో అవ‌స‌ర‌మైన అన్నిర‌కాల ప‌రీక్ష‌లు చేసేలా సౌక‌ర్యాలు లేన‌ట్లు తెలుస్తోంది. ఓపీ ల్యాబ్‌కు గ‌ది ఉంది. ఇక ఎమ‌ర్జెన్సీ ల్యాబ్‌కు క‌నీసం గ‌దికూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితులు ఆస్ప‌త్రిలో క‌నిపిస్తున్నాయి. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో కొన్ని ప‌రీక్ష‌లు బ‌య‌ట ల్యాబ్‌ల‌కు పంపించాల్సి వ‌స్తుంద‌నే వాద‌న వినిపిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం వైఫ‌ల్యం, వైద్యాధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే ప్రైవేట్ ల్యాబ్‌ల దందా జోరుగా సాగుతుందని చెప్పొచ్చు. ఇప్ప‌టికైనా రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించి, ప్ర‌భుత్వ ప్ర‌సూతి ఆస్ప‌త్రిలోని ల్యాబుల్లో అన్నిర‌కాల ప‌రీక్ష‌లు చేసేలా ఏర్పాట్లు చేసి, ప్రైవేట్ ల్యాబ్‌ల దందాకు అడ్డుక‌ట్ట వేయాల్సిన‌ అవ‌స‌రం ఎంతైనా ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img