Saturday, May 4, 2024

వ‌రంగ‌ల్ లోక్‌స‌భ బీజేపీ అభ్య‌ర్థిగా రిటైర్డ్ డీజీపీ?

Must Read

– టికెట్ రేసులో టీ కృష్ణ‌ప్ర‌సాద్ ఐపీఎస్‌
– హైద‌రాబాద్‌కు గుర్తింపు తీసుకురావ‌డంలో కీల‌క భూమిక‌
– రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా పార్టీలో చురుకైన పాత్ర‌
– వ‌రంగ‌ల్‌తో విడ‌దీయ‌లేని అనుబంధం
– ఇక్క‌డి ఆర్ఈసీ(నిట్‌)లో బీటెక్ పూర్తి
– వ‌రంగ‌ల్ డీఐజీగానూ బాధ్య‌త‌లు
– కేపీ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి జిల్లాలో సేవా కార్య‌క్ర‌మాలు
– అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాలు
– ఈ నేప‌థ్యంలోనే కృష్ణ‌ప్ర‌సాద్‌వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ స్థానం నుంచి రిటైర్డ్ డీజీపీ, బీజేపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, టీ కృష్ణ‌ప్ర‌సాద్ ఐపీఎస్ బ‌రిలోకి దిగే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. టికెట్ రేసులో ప‌లువురు నాయ‌కులు ఉన్నా.. ప్ర‌ముఖంగా మాత్రం కృష్ణ‌ప్ర‌సాద్ పేరే వినిపిస్తోంది. ఉన్న‌త విద్యావంతుడిగా, ఐపీఎస్ అధికారిగా, సామాజిక సేవ‌కుడిగా తెలంగాణ వ్యాప్తంగా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లోనూ మంచి గుర్తింపు ఉన్న కృష్ణ‌ప్ర‌సాద్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త 2022లో అమిత్‌షా స‌మ‌క్షంలో బీజేపీలో చేరిన ఆయ‌న‌.. రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌ధానంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాతో ఆయ‌న‌కు విడ‌దీయ‌లేని అనుబంధం ఉంది. వ‌రంగ‌ల్ ఆర్ఈసీ(నిట్‌)లోనే బీటెక్ చ‌దువుకున్నారు. వ‌రంగ‌ల్ డీఐజీగానూ ఆయ‌న ఇక్క‌డ ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలో ఈ ప్రాంతంపై పూర్తి అవ‌గాహ‌న ఉన్న ఆయ‌న‌కు.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తోనూ స‌త్సంబంధాలు ఉన్నాయి. అంతేగాకుండా, కృష్ణ‌ప్ర‌సాద్ ఫౌండేష‌న్‌, మలుపు ఫౌండేష‌న్ల‌ను ఏర్పాటు చేసి.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాల్లోనే అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ప్ర‌ధానంగా, విద్య‌, మ‌హిళా సాధికార‌త‌కు కృషి చేస్తున్నారు. హైద‌రాబాద్ త‌ర్వాత రెండో రాజ‌ధానిగా ఉన్న వ‌రంగ‌ల్‌ను అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్ట‌డానికి అపార‌మైన వ‌న‌రులు ఉన్నాయ‌ని, వాట‌న్నింటినీ స‌రైన రీతిలో వినియోగంలోకి తీసుకొచ్చి, ఈ మ‌ట్టిరుణం తీర్చుకోవ‌డమే త‌న ల‌క్ష్య‌మ‌ని అనుచ‌రుల‌తో చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి మేధావులు వ‌రంగ‌ల్ ఎంపీగా వ‌స్తే బాగుంటుంద‌ని పార్టీవ‌ర్గాల‌తోపాటు సామాన్య‌ప్ర‌జ‌ల్లోనూ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

అత్యున్న‌త హోదాల్లో విధులు..
తెన్నేటి కృష్ణ‌ప్ర‌సాద్ హైద‌రాబాద్‌లో పుట్టిపెరిగారు. త‌ల్లిదండ్రులు సుబ్బ‌య్య‌-విజ‌య‌ల‌క్ష్మి. తండ్రి సుబ్బ‌య్య ఐటీఐ ప్రిన్సిపాల్‌గా, త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వ‌ర్తించారు. కృష్ణ‌ప్ర‌సాద్ పాఠ‌శాల‌, ఇంట‌ర్ విద్య‌ హైద‌రాబాద్‌లో, బీటెక్ వ‌రంగ‌ల్ ఆర్ఈసీ(నిట్‌)లో పూర్తి చేశారు. అనంత‌రం ఐఐఎం అహ్మ‌దాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. 1986లో ఐపీఎస్ సాధించారు. ఐపీఎస్‌గా వివిధ హోదాల్లో బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూనే ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఎల్ఎల్‌బీ, పీహెచ్‌డీ (స‌స్ట‌యిన‌ల్ అర్బ‌న్ మొబిలిటీ) పూర్తి చేశారు. ఐపీఎస్ సాధించిన త‌ర్వాత మొద‌టిసారిగా న‌ల్ల‌గొండ‌లో ఏఎస్పీగా ట్రైనింగ్ పొందారు. ఆ త‌ర్వాత వివిధ హోదాల్లో ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కామారెడ్డిలో ఏఎస్పీ, నిజామాబాద్‌లో ఏఎస్పీ, మెద‌క్‌తోపాటు మ‌రో మూడు జిల్లాల్లో ఎస్పీగా, లిడ్‌కాప్ సీఎండీగానూ ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అలాగే, ఏపీఐఐసీ హైద‌రాబాద్ ఈడీగా, వ‌రంగ‌ల్ డీఐజీగా, విజ‌య‌వాడ సీపీగా, ఆర్టీసీ డైరెక్ట‌ర్‌గా, పోలీస్ అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా, పోలీస్ క‌మ్యూనికేష‌న్స్ డైరెక్ట‌ర్‌గా, ప్రొవిజ‌నింగ్ అండ్ లాజిస్టిక్ అడిష‌న‌ల్ డీజీపీగా, సీఐడీ చీఫ్‌గా, టెక్నిక‌ల్ స‌ర్వీసెస్ అడిష‌న‌ల్ డీజీపీగా, రైల్వేస్ డీజీపీగా, రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీపీగా, చైర్మ‌న్‌గా టీ కృష్ణ‌ప్ర‌సాద్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించి రిటైర్డ్ అయ్యారు. ఏ హోదాలో ప‌నిచేసినా.. కృష్ణ‌ప్ర‌సాద్ త‌న‌దైన ముద్ర వేశారు. వ్య‌వ‌స్థ‌ల‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పెంచేందుకు అహ‌ర్నిశ‌లు కృషి చేశారు.

వ‌రంగ‌ల్‌తో విడ‌దీయ‌లేని అనుబంధం
టీ కృష్ణ‌ప్ర‌సాద్‌కు వ‌రంగ‌ల్‌తో విడ‌దీయ‌లేని అనుబంధం ఉంది. చ‌దువుకునే రోజుల నుంచే ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ఉన్నారు. వ‌రంగ‌ల్ ఆర్ఈసీ(నిట్‌)లో బీటెక్ పూర్తి చేశారు. అంతేగాకుండా, వ‌రంగ‌ల్ డీఐజీగానూ ఆయ‌న విధులు నిర్వ‌ర్తించారు. ఈ నేప‌థ్యంలో ఈప్రాంతంపై కృష్ణ‌ప్ర‌సాద్‌కు మంచి అవ‌గాహ‌న ఉంది. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌ధానంగా ఉన్న‌త విద్యావంతుడిగా, ఐపీఎస్‌గా ఎదిగిన టీ కృష్ణ‌ప్ర‌సాద్.. త‌న సామాజిక బాధ్య‌త‌ను మాత్రం మ‌ర‌వ‌కుండా ముందుకుసాగారు. ఇందులో భాగంగానే కృష్ణ‌ప్ర‌సాద్ ఫౌండేష‌న్‌తోపాటు మ‌లుపు ఫౌండేష‌న్‌ల‌ను ఏర్పాటు చేసి, అనేక సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ప్రధానంగా విద్య‌, స్వ‌యం ఉపాధి రంగాల‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. స్వ‌యం ఉపాధిరంగాల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత శిక్ష‌ణ‌, చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి, వారి సాధికార‌త‌కు ఎంతో కృషి చేస్తున్నారు. కేపీ ఫౌండేష‌న్, మ‌లుపు ఫౌండేష‌న్‌ ఆధ్వ‌ర్యంలో వ‌రంగ‌ల్‌లో మ‌హిళ‌ల‌కు కుట్టుమిష‌న్‌ శిక్ష‌ణ ఇప్పిస్తున్నారు. వారికి స‌ర్టిఫికెట్లు అందించి, బ్యాంకు లోన్లు ఇప్పిస్తూ.. అవ‌స‌ర‌మైన వారికి ఉచితంగా కుట్టుమిష‌న్లు అందిస్తూ.. స్వ‌యం ఉపాధి క‌ల్పిస్తున్నారు. ఇలా హ‌న్మ‌కొండ‌లో ప్ర‌త్యేకంగా కార్యాల‌యం నిర్వ‌హిస్తూ.. వరంగ‌ల్ మ‌హాన‌గ‌రంతోపాటు ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా స్వ‌యం ఉపాధి రంగాల్లో శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.

అత్యంత కీల‌క ప్రాజెక్టుల్లో…
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చేప‌ట్టిన అనేక ప్రాజెక్టుల్లోనూ టీ కృష్ణ‌ప్ర‌సాద్ అత్యంత కీల‌క పాత్ర పోషించారు. త‌న అపార‌మైన మేధ‌స్సుతో హైద‌రాబాద్‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు తీసుకురాడానికి ఎంతో శ్ర‌మించారు. ఏపీ ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా ప‌లు ప్రాజెక్టుల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. హైటెక్ సిటీ, హైద‌రాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌, హైద‌రాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌తోపాటు హైటెక్స్‌, గంగ‌వ‌రం పోర్ట్‌, కృష్ణ‌ప‌ట్నం పోర్ట్‌తోపాటు మ‌రో 17 మెగా ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప్రాజెక్టుల్లో కీల‌క భూమిక పోషించారు. అలాగే, అనేక పాల‌సీల‌ డ్రాఫ్టింగ్‌లో టీ కృష్ణ‌ప్ర‌సాద్ అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌ధానంగా ఏపీ ఇండ్ర‌స్ట్రీయ‌ల్ పాల‌సీ-2000, ఏపీ ఐటీ పాల‌సీ-2000, ఏపీ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎనాబ్లింగ్ యాక్ట్ -2001, ది సెజ్ యాక్ట్ -2005, హైద‌రాబాద్‌ మెట్రోరైల్ ప్రాజెక్టు, ఓఆర్ఆర్‌, గోల్ఫ్ కోర్స్, సైబ‌ర్ ట‌వ‌ర్స్‌, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టు త‌దిత‌ర‌ ప్రాజెక్టుల్లోనూ ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. ఇలాంటి అత్యంత ప్రాజెక్టుల్లో భాగ‌మై అంత‌ర్జాతీయ స్థాయిలో హైద‌రాబాద్‌కు గుర్తింపు తీసుకురావ‌డంలో కృష్ణ‌ప్ర‌సాద్ కృషి ఎంతో ఉంది.

పేద విద్యార్థుల చ‌దువుపై ప్ర‌త్యేక దృష్టి
చ‌దువుతోనే బంగారు భ‌విష్య‌త్ ఏర్ప‌డుతుంద‌న్న న‌మ్మ‌కంతో.. టీ కృష్ణ‌ప్ర‌సాద్‌ నిరుపేద పిల్ల‌ల చ‌దువు కోసం ఎంతో శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 2015లో వికారాబాద్ జిల్లాలో ఎర్ర‌వ‌ల్లి అనే గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని మౌలిక వ‌స‌తులు క‌ల్పించారు. ప్ర‌ధానంగా విద్యార్థుల‌ అవ‌స‌రాల‌న్నీ తీర్చుతున్నారు. అంతేగాకుండా, వ‌రంగ‌ల్‌లోని అనేక పాఠ‌శాల‌ల‌కు త‌న‌వంతు సాయం అందిస్తున్నారు. ఫ‌ర్నీచ‌ర్‌తోపాటు కంప్యూట‌ర్లు అందిస్తున్నారు. ఓ వైపు ఉద్యోగ ధ‌ర్మాన్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తూనే.. మ‌రోవైపు సామాజిక బాధ్య‌త‌ను మ‌ర‌వ‌కుండా ముందుకుసాగుతున్న టీ కృష్ణ‌ప్ర‌సాద్‌కు అనేక అవార్డులు వ‌రించాయి. ఇండియ‌న్ పోలీస్ మెడ‌ల్‌, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడ‌ల్‌, ఆంత్రిక్ సుర‌క్షా సేవ ప‌త‌క్ లాంటి గొప్ప గౌర‌వం పొందారు. అంతేగాకుండా, ట్రాఫికింగ్ ఇన్ ప‌ర్స‌న్స్ – టిప్ ఆఫ్ ది ఐస్‌బ‌ర్గ్ అనే పుస్త‌కాన్ని టీ కృష్ణ‌ప్ర‌సాద్ ర‌చించ‌గా, యునైటెడ్ నేష‌న్స్ ముద్రించడం గ‌మ‌నార్హం. ఆ పుస్త‌కాన్ని బిల్‌గేట్స్ కూడా చ‌దివి, ఢిల్లీలో క‌లిసిన సంద‌ర్భంలో ప్ర‌త్యేకంగా కృష్ణ‌ప్ర‌సాద్‌ను అభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img