Sunday, September 8, 2024

అరూరిని సొంత‌వైఖ‌రే ముంచిందా..?

Must Read
  • 2014, 2018 ఎన్నిక‌ల్లో ర‌మేష్ ఘ‌న విజ‌యం
  • 2023 ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం
  • ల‌క్ష మెజార్టీ నుంచి ఓట‌మికి ప‌డిపోయిన వైనం
  • ప‌దేళ్లూ క్యాడ‌ర్‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే కార‌ణ‌మా..?
  • అసంతృప్తుల‌ను బుజ్జ‌గించ‌డంలో విఫ‌లం
  • రియ‌ల్ ఇన్‌చార్జులపై తీవ్ర విమ‌ర్శ‌లు?
  • వ‌ర్ధ‌న్న‌పేట రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ‌
  • ఇకనైనా ప‌ట్టించుకోండి..
  • స‌మీక్ష స‌మావేశంలో కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : 2014 ఎన్నిక‌ల్లో 86,349 ఓట్ల మెజార్టీ, 2018 ఎన్నిక‌ల్లో 99,240 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన అరూరి ర‌మేష్‌.. 2023 ఎన్నిక‌ల్లో మాత్రం ఎందుకు దారుణ ప‌రాజ‌యం పాల‌య్యారు? గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ తిరుగులేని విజ‌యాల‌ను అందించిన వ‌ర్ధ‌న్న‌పేట ప్ర‌జ‌లు.. ఈసారెందుకు అవ‌మాన‌క‌ర‌రీతిలో తిర‌స్క‌రించారు? గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ అరూరి గెలుపును త‌మ‌ గెలుపుగా భావించి రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్టప‌డిన నాయకులు, కార్య‌క‌ర్త‌ల్లో అనేక‌మంది.. ఇప్పుడెందుకు త‌మ‌కు సంబంధంలేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు వ‌ర్ద‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా వినిపిస్తున్నాయి. ఈసారి కూడా త‌న‌కు తిరుగులేద‌న్న ధీమాతో ఉన్న అరూరి ర‌మేష్‌ను జ‌నం తిర‌స్క‌రించ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌జ‌ల‌కు దూరంగా.. రియల్ట‌ర్ల‌కు ద‌గ్గ‌ర‌గా..!
2014 ఎన్నిక‌ల్లో వ‌ర్ధ‌న్న‌పేట నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన అరూరి ర‌మేష్‌ను ప్ర‌జ‌లు భారీ మెజార్టీతో గెలిపించారు. ఇక 2018 ఎన్నికల్లోనూ ఏకంగా సుమారు ల‌క్ష మెజార్టీ అందించారు. అయితే, అరూరి ర‌మేష్ మాత్రం ఏనాడు కూడా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయ‌లేద‌ని విమ‌ర్శ‌ల‌ను మూట‌గ‌ట్టుకున్నారు. వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధికి, ప్ర‌జ‌ల‌కు దూరంగా, కేవ‌లం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు ద‌గ్గ‌ర‌గా అరూరి ర‌మేష్ వ్య‌వ‌హ‌రించార‌ని, నియోజ‌క‌వ‌ర్గంలోని ఏ మండ‌లానికి వెళ్లినా.. బినామీ పేర్ల‌పై అరూరి రియ‌ల్ దందా చేశార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపించాయి. కేవలం ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ప‌లు సంక్షేమ ప‌థ‌కాల చెక్కులు, ఇత‌ర చిన్న‌చిన్న కార్య‌క్ర‌మాల‌కు త‌ప్ప‌.. ఏనాడు కూడా నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం అరూరి ర‌మేష్ ప‌నిచేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు సామాన్య ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చాయి. క‌నీసం నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌రికి కూడా డ‌బుల్‌బెడ్‌రూమ్ క‌ట్టించ‌లేద‌ని, తాను మాత్రం మండ‌లానికో ఫాంహౌస్ క‌ట్టుకున్నాడ‌నే టాక్ జ‌నంలోకి వెళ్లింది. ఈ నేప‌థ్యంలో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ తిరుగులేని విజ‌యాన్ని అందించిన జ‌నం.. ఈసారి మాత్రం అదేరీతిలో తిర‌స్క‌రించారు.

క్యాడ‌ర్‌లో తీవ్ర అసంతృప్తి
గ‌త రెండు ఎన్నిక‌ల్లో అరూరి ర‌మేష్ గెలుపును త‌మ గెలుపుగా భావించిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డారు. జ‌నంలోకి వెళ్లారు. అరూరిని గెలిపించాల‌ని వేడుకున్నారు. ఓవైపు మ‌న తెలంగాణ అనే భావ‌న‌, మ‌రోవైపు గులాబీద‌ళం క‌ష్టం.. ఈ క్ర‌మంలోనే గ‌త‌ రెండు ఎన్నిక‌ల్లోనూ తెలంగాణ‌లోనే హ‌రీశ్‌రావు త‌ర్వాత అత్య‌ధిక మెజార్టీతో గెలిచిన ఘ‌న‌తను అరూరి సొంతం చేసుకున్నారు. కానీ.. ఈ ప‌దేళ్ల‌లో ఏరోజు కూడా సెకండ్ క్యాడ‌ర్ ఎదుగుద‌ల‌కు అరూరి స‌హ‌క‌రించ‌లేద‌ని, క‌నీసం ఒక్క‌ నామినేటెడ్ పోస్టు కూడా ఇప్పించ‌లేద‌నే విమర్శ‌లు ఉన్నాయి. ఒక ద‌ళిత ఎమ్మెల్యేగా ఉన్న అరూరి.. అదే ద‌ళిత నాయ‌కుల‌ను అణ‌చివేసేందుకు ప్ర‌య‌త్నం చేశార‌నే ఆరోప‌ణ‌లు కూడా బ‌లంగా ఉన్నాయి. వ‌రంగ‌ల్ ఏనుమాముల వ్య‌వ‌సాయ మార్కెట్ చైర్మ‌న్ ప‌ద‌విని నియోజ‌క‌వ‌ర్గానికి ఇప్పించ‌లేక‌పోయార‌ని, ఆఖ‌రికి ద‌ళిత మ‌హిళ‌కు అవ‌కాశం వ‌చ్చినా.. ద‌క్కించుకోలేక‌పోయార‌నే ఆవేద‌న ఆయా వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మ‌రోవైపు.. కొంద‌రు అసంతృప్త నాయ‌కులు ఈ ఎన్నిక‌ల్లో నిజాయితీగా ప‌నిచేసినా.. మ‌రికొంద‌రు నాయ‌కులు మాత్రం సైలెంట్‌గా ఉంటూనే అరూరికి వ్య‌తిరేకంగా ప‌నిచేసార‌నే గుస‌గుస‌లు కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అసంతృప్తుల‌ను బుజ్జ‌గించ‌డంలో విఫ‌లం
వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో అరూరి ర‌మేష్‌గా తీరుపై అసంతృప్తి ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. అనేక‌మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అరూరి పోక‌డ‌పై అప్ప‌టి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, అప్ప‌టి రాష్ట్ర ప్ర‌ణాళికాసంఘం ఉపాధ్య‌క్షులు వినోద్‌కుమార్‌ను క‌లిసి ఫిర్యాదు చేశార‌నే వార్త‌లు నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అయితే.. అసంతృప్త నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను బుజ్జ‌గించ‌డంలో అరూరి ర‌మేష్ విఫ‌లం చెందార‌నే టాక్ వినిపిస్తోంది. అసంతృప్త నాయ‌కులను, కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడి, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని, త‌న తీరును స‌రిదిద్దుకోవ‌డానికి అరూరి ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని, పైగా.. త‌న‌ను ఎవ‌రూ ఏమీచేయ‌లేర‌న్న అహంకారంతో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే… అసంతృప్త సెగ‌లు తారా స్థాయికి చేరి.. తీరా ఎన్నిక‌ల్లో అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితుల‌కు దారితీసాయ‌నే టాక్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మీ తీరు మార్చుకోవాలి.. లేదంటే ఎన్నిక‌ల్లో తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంది.. అంటూ నేరుగా చెప్పినా వినిపించుకోక‌పోవ‌డం వ‌ల్లే ఈరోజు ఈ ప‌రిస్థితి ఏర్ప‌డిందంటూ ప‌లువురు నాయ‌కులు ఆవేద‌న‌తో చ‌ర్చించుకుంటున్న‌ట్లు తెలిసింది.

ఇన్‌చార్జులుగా రియ‌ల్ట‌ర్లు?
2023 ఎన్నిక‌ల్లో వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో అరూరి ర‌మేష్.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను కాద‌ని కేవ‌లం త‌న రియ‌ల్ఎస్టేట్ వ్యాపారంలో భాగ‌స్వాములుగా ఉన్న వారితోపాటు, ఓ ప్ర‌ముఖ విద్యాసంస్థ‌ య‌జ‌మానికి ఇన్‌చార్జులుగా బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు ప్ర‌చారం జరిగింది. ఇలా చేయ‌డంపై కూడా క్యాడ‌ర్‌లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మైన‌ట్లు తెలిసింది. ఏళ్ల‌కొద్దీ ప‌నిచేస్తున్న త‌మ‌ను కాద‌ని.. నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధంలేని వారికి ఇన్‌చార్జులుగా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ అరూరి గెలుపు కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మించిన అనేక మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. ఈసారి త‌మ‌కు సంబంధంలేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఈ ఎన్నిక‌ల్లో అరూరి ర‌మేష్ దారుణ ప‌రాజ‌యం పాల‌య్యార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక‌నైనా మారండి..
2023 ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యంపై నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ఆదివారం నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశంలో ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అరూరి ర‌మేష్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. ఇకనైనా మారండి.. క్యాడ‌ర్ క‌ష్ట‌సుఖాల‌ను ప‌ట్టించుకోండి.. అంటూ చెప్పిన‌ట్లు స‌మాచారం. క్యాడ‌ర్‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే.. ఈ ఎన్నిక‌ల్లో న‌ష్టం జ‌రిగిందంటూ ప‌లువురు త‌మ ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కిన‌ట్లు తెలిసింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అరూరి రమేష్‌.. దారి ఎలా ఉంటుందో వేచి చూడాలి మ‌రి.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img