Tuesday, June 18, 2024

మానుకోట‌పై బ‌హుజన జెండా ఎగిరేనా ?

Must Read
  • మ‌హ‌బూబాబాద్ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా గుగులోత్ శేఖ‌ర్‌నాయ‌క్
  • రెండేళ్లుగా పార్టీ బ‌లోపేతానికి కృషి
  • నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికే విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌
  • యువ‌కుడు, ఉన్న‌త విద్యావంతుడిగా గుర్తింపు

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్: మానుకోటలో స‌త్తా చాటేందుకు బీఎస్పీ సిద్ధ‌మైంది. ఎస్టీ రిజ‌ర్వ్‌డ్‌గా ఉన్న మ‌హ‌బూబాబాద్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఈక్ర‌మంలోనే ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు ధీటైన అభ్య‌ర్థిగా భావించి ఉన్న‌త విద్యావంతుడు, సౌమ్యుడిగా పేరున్న‌ గుగులోత్ శేఖ‌ర్‌నాయ‌క్‌ను బ‌రిలోకి దింపారు ఆ పార్టీ అధినేత ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌. విదేశాల్లో ఉన్నత విద్య అభ్య‌సించిన శేఖ‌ర్‌నాయ‌క్ రెండేళ్లుగా పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌హబూబాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా కొన‌సాగుతున్న ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌తో త‌ల‌ప‌డ‌నున్నారు. ఇప్ప‌టికే జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులంద‌రినీ క‌లుపు కుంటూ.. స‌మ‌న్వ‌యంతో అడుగులు వేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. గిరిజ‌న గ‌డ్డ మానుకోట‌పై బ‌హుజన జెండా ఎగ‌ర‌వేయ‌డమే ల‌క్ష్యంగా ముందుకు క‌దులుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్‌ను ఓడించి బీఎస్పీ స‌త్తా చాటుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

యువ‌కుడు, ఉన్న‌త విద్యావంతుడిగా గుర్తింపు

బ‌హుజ‌న రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా తెలంగాణ‌లో బీఎస్పీని బ‌లోపేతం చేసేందుకు ఆపార్టీ అధినేత ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ క‌ష్ట‌ప‌డుతున్నారు. త‌మ‌కు అనుకూలంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలుపుతున్నారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులోనూ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తున్నారు. ఈక్ర‌మంలోనే కొన్నిరోజుల క్రితం 20 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన ప్ర‌వీణ్ కుమార్‌… తాజాగా మరో 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను వి డుదల చేశారు. తాజాగా విడుదల చేసిన 43 మందిలో 26 మంది బీసీలకు, ఏడుగురు ఎస్టీలకు, ఆరుగురు ఎస్సీలకు, ముగ్గురు ఓసీలకు టిక్కెట్లు కేటాయించారు. ఇందులో భాగంగా మానుకోట అసెంబ్లీ టికెట్‌ను యువ‌కుడు, ఉన్న‌త విద్యావంతుడైన శేఖ‌ర్‌నాయ‌క్ కు ఇచ్చి ప్రోత్స‌హించారు. ఈక్ర‌మంలోనే ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత బీఆర్ఎస్‌కు కంచుకోట‌గా ఉన్న మానుకోట‌పై బ‌హుజ‌న జెండా రెప‌రెప‌లాండిచాల‌న్న ప‌ట్టుద‌ల‌తో అడుగులేస్తున్నారు గుగులోత్ శేఖ‌ర్‌నాయ‌క్‌. పార్టీ త‌న‌కు ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని మానుకోట‌లో బీఎస్పీ జెండా ఎగ‌ర‌వేస్తామ‌ని శేఖ‌ర్‌నాయ‌క్ ధీమాగా ఉన్నారు.

పార్టీ బ‌లోపేతానికి కృషి..

గుగులోత్ శేఖ‌ర్‌నాయ‌క్ స్వ‌గ్రామం మ‌హ‌బూబాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నెల్లికుదురు మండ‌లం జామ తండా. సామాన్య వ్య‌వ‌సాయ కుటుంబం. ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు నెల్లికుదురు హైస్కూల్ చ‌దువుకున్నారు. అనంత‌రం మానుకోట‌లో ఒకేష‌న‌ల్ కోర్సు, ఆ త‌ర్వాత హోట‌ల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేశారు. అక్క‌డి నుంచి 2019లో ఉన్న‌త చ‌దువుల కోసం ఫ్రాన్స్‌కు వెళ్లారు. చ‌దువుకుంటూనే ఉన్న‌త ఉద్యోగం సంపాదించారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న సంక‌ల్పంతో 2021లో తిరిగి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో రెండేళ్ల క్రితం బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ ఆధ్వర్యంలో 100 మందితో బహుజనుల సంకల్ప సభలో డాక్ట‌ర్ ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరారు. బీఎస్పీతోనే అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కంతో శేఖ‌ర్‌నాయ‌క్ ముందుకు వెళ్తున్నారు. ప్ర‌స్తుతం మ‌హ‌బూబాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా కొన‌సాగుతున్న ఆయ‌న‌.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నాయ‌కులంద‌రినీ క‌లుపుకుంటూ గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ.. ప‌ట్టుసాధించే దిశ‌గా ముందుకు వెళ్తున్నారు. అలాగే, సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తోనూ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌ధానంగా నిరుపేద విద్యార్థుల‌ను ద‌త్త‌త తీసుకుని చ‌దివిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img