- ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో సుమారు 2వేల మందితో చేరిక
- నర్సంపేటలో భారీ ర్యాలీ
- తిరిగి యువనేత రాకతో గులాబీ శ్రేణుల్లో నయాజోష్
- ఇక పార్టీకి తిరుగులేదని సంబురాలు
- భారీ విజయం ఖాయమంటూ ధీమా
అక్షరశక్తి, నర్సంపేట : ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరుతోంది. నియోజకవర్గంలో యువనేతగా అన్నివర్గాల్లో ప్రజల్లో గుర్తింపు పొందిన డాక్టర్ గోగుల రాణాప్రతాప్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం నర్సంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి సుమారు 2వేల మందితో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రధానంగా నియోజకవర్గ యువతలో తిరుగులేని యువనేతగా గుర్తింపు పొందిన రాణాప్రతాప్ తిరిగి గులాబీదళంలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని, పెద్ది ఘన విజయం ఖాయమని నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- నిత్యం ప్రజల మధ్యనే…
గోగుల రాణాప్రతాప్ అనతి కాలంలోనే నర్సంపేటలో కీలక నేతగా ఎదిగారు. ప్రధానంగా యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఆపదలో ప్రజలను ఆదుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలా నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఆయన పర్యటించారు. ప్రధానంగా కరోనా సమయంలో, భారీ వర్షాలు, వరదల సమయంలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడ్డారు. అడుగడుగునా ధైర్యం చెప్పారు. కరోనా సమయంలో నిత్యావసర సరుకులు అందిస్తూ మనోధైర్యం నింపారు. ఇక భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని సర్వం కోల్పోయిన రైతాంగానికి రాణాప్రతాప్ గుండెధైర్యంగా నిలబడ్డారు. గ్రామాలు, తండాలు తిరుగుతూ.. వారికి తన వంతు సాయం అందిస్తూ ముందుకుసాగారు. ఈ నేపథ్యంలోనే నియోజవర్గంలో అనతికాలంలోనే అన్నివర్గాల ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించారు. - తిరిగి గులాబీదళంలోకి…
మొదట రాణాప్రతాప్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2018 ఎన్నికల్లోనూ పెద్ది సుదర్శన్‌రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. అత్యంత కీలక సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి పార్టీ గెలుపులో చాకచక్యంగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ అన్నివర్గా ల ప్రజలకు ప్రధానంగా యువత బాగా దగ్గరయ్యారు. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. అయితే.. కొంతకాలం బీజేపీలోనూ కీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, స్థానిక నేతల తీరుతో విసిగిపోయిన రాణాప్రతాప్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. రాణాప్రతాప్ రాకతో నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.