* రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నా.. అక్రమంగా సంపాదించలేదు!
* ఎన్టీఆర్‌తో తొలి పరిచయం నుంచి టీడీపీ ఆవిర్భావంలో కీలక పాత్ర
* వర్ధన్నపేట నుంచి హ్యాట్రిక్.. వరంగల్ ఎంపీగా అనూహ్య విజయం
* వైఎస్ మంత్రి పదవి ఆఫర్ చేసినా.. కాంగ్రెస్‌లోకి వెళ్లని దయాకర్‌రావు
* కేసీఆర్‌తో సాన్నిహిత్యం.. 2018లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి
* ఎంజీఎం అభివృద్ధికి ప్రత్యేక చొరవ.. ఆస్పత్రికి రూ.2 కోట్ల నిధుల సమీకరణ
* ఎక్కడ అవకాశం వచ్చినా పోటీ చేస్తా.. వారసులను రాజకీయాల్లోకి దింపను
* తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం.. ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకు అగ్రనేతలతో సాన్నిహిత్యం.. ఎమ్మెల్యేగా ఐదుసార్లు విజయం.. అనూహ్యంగా ఎంపీగా గెలుపు.. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు.. ఇలా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణాన్ని సాగించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన జీవితంలోని కీలక ఘట్టాలను తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. చిన్ననాటి రాజకీయ ఆసక్తి నుంచి ఎన్టీఆర్‌ను కలిసిన సందర్భం, టీడీపీ ఆవిర్భావంలో తన పాత్ర, వరుస విజయాలు, వైఎస్ ఇచ్చిన మంత్రి పదవి ఆఫర్‌ను తిరస్కరించడం, కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం, తాజా రాజకీయ పరిణామాల వరకు తన ప్రస్థానాన్ని వివరించారు. “రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నానే కానీ అక్రమంగా సంపాదించుకోలేదు” అని స్పష్టం చేసిన దయాకర్‌రావు.. “ఎక్కడ అవకాశం వచ్చినా పోటీ చేస్తా.. రాజకీయ వారసులను దింపే ఆలోచన లేదు” అని భవిష్యత్‌పై తన వైఖరినీ వెల్లడించారు.
రాజకీయాలపై చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్
నేను 1956 జూలై 4న పర్వతగిరిలో పుట్టిన. మా అమ్మానాన్నలు ఆదిలక్ష్మి-జగన్నాథం. స్థానిక పాఠశాలలోనే చదువుకున్న. రాజకీయాలంటే నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉండేది. పదో తరగతిలో స్కూల్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన. నాకు పోటీగా బొల్లం సంపత్ కుమార్ అనే మిత్రుడు ఉండే. నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితి ఉన్నా.. నేను చేసిన ఓ తుంటరి పని వల్ల ఓడిపోయిన” అంటూ ఆ రోజులను నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. “నాకు 18 ఏళ్లకే పెండ్లి అయింది. కేసీఆర్ మామ కేశవరావు దగ్గరుండి సంబంధం చూసి పెండ్లి చేసిండ్లు. నాకు ఒక కూతురు, ఒక కొడుకు” అని చెప్పారు.
మా నాన్నే రాజకీయాల్లో ఉండేవాడు..
మా నాన్న ఎర్రబెల్లి జగన్నాథం రాజకీయాల్లోనే ఉండేవాడు. పర్వతగిరి సర్పంచ్‌గా ఆరుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అప్పుడు సమితిలు ఉండేవి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు సమితులు ఉండేవి. మా నాన్న సంగెం సమితి ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత పోరు వల్ల టాస్ వేయాల్సి వచ్చింది. అందులో మా నాన్న ఓడిపోయాడు. ఆ తర్వాత ఓడీసీఎంఎస్ చైర్మన్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్‌లోని లొల్లి వల్ల చైర్మన్ పదవి రాలేదు. వైస్ చైర్మన్ పదవి దక్కింది. ఆ తర్వాత వరంగల్ ల్యాండ్ బ్యాంక్ చైర్మన్ అయ్యాడంటూ తన తండ్రి రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.
నన్ను డాక్టర్ చేయాలనేది నాన్న కల
మా నాన్న నన్ను డాక్టర్ చేయాలని అనుకున్నాడు. పట్టుబట్టి ఎల్‌బీ కాలేజీలో బైపీసీ గ్రూపులో చేర్పించాడు. కాకతీయ మెడికల్ కాలేజీకి దగ్గరలోనే ఉంటుందని.. అక్కడ డాక్టర్లను చూసైనా నాకు డాక్టర్ కావాలనే ఆశ కలుగుతుందని అనుకున్నాడు. కానీ నాకు సదువు అంతగా అబ్బలేదు. దీంతో అగ్రికల్చర్ బీఎస్సీ చదివించాడు. చదువుకునే రోజుల్లో జయశంకర్ సార్ ఇంట్లో నెల రోజుల పాటు ఉన్న. తెలంగాణ ఉద్యమం చేసిన రోజుల్లో దుర్గా టాకీస్ తగలబెట్టిన కేసులో కూడా ఉన్న. కానీ మైనర్‌ను అని ఆ కేసు నుంచి తీసేశారంటూ తన విద్యార్థి దశను గుర్తు చేసుకున్నారు.
15 ఎకరాల్లో మిర్చి.. అక్కడి నుంచి కాంట్రాక్టర్‌గా..
వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఒకసారి 15 ఎకరాల్లో మిర్చి వేసిన. తెగులు వచ్చి బాగా లాస్ అయిన. అక్కడి నుంచి కాంట్రాక్టర్‌గా మారి పనులు చేసిన. ఆర్‌అండ్‌బీ పనులు ఎక్కువగా చేసేవాడిని. రంగశాయిపేట, తీగరాజుపల్లి రోడ్డు నేనే వేశానని చెప్పారు.
కాంగ్రెస్ కక్షే నాలో కసి పెంచింది
తన తండ్రి రాజకీయ జీవితంలో కాంగ్రెస్ చేసిన కక్షసాధింపు చర్యలే తనలో రాజకీయ కసి పెంచాయని చెప్పారు. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నాడని తెలిసింది. ఆయన చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాడని తెలిసి నాలుగు జీపుల్లో కార్యకర్తలను తీసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి నిలబడ్డా. ఎన్టీఆర్ ట్రైన్ దిగగానే.. ‘జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్..’ అంటూ నినాదాలు చేశా. ఆయన నన్ను.. నా వెనక ఉన్న జనాన్ని చూసి ఎక్కడి నుంచి వచ్చావు బాబు అంటూ పలకరించాడు. కారులో ఆయనతోపాటు తీసుకెళ్లాడు. ఓ హోటల్‌లో టిఫిన్ చేసి.. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్టీ ఏర్పాటుపై మీటింగ్ ఉంటుందని, రావాలని చెప్పాడు.
పార్టీ జెండా రూపకల్పనలో నేను..
టీడీపీ పార్టీ ఏర్పాటు, జెండా రూపకల్పన కోసం ఎన్టీఆర్ పర్వతగిరి ఉపేందర్‌ను కన్వీనర్‌గా, యూత్ తరఫున నన్ను ఎంపిక చేశారు. నేను చురుగ్గా ఉండడంతో ఎన్టీఆర్ నన్ను ప్రత్యేకంగా అభిమానించేవాడు” అని చెప్పారు.
వరంగల్‌లో ఎన్టీఆర్ సభ..
ఎన్టీఆర్‌ను వరంగల్‌కు తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. దోనపూడి రమేశ్‌బాబు, నేను కలిసి సభా సన్నాహక సమావేశం నిర్వహించినం. రెండు వందల మందికిపైగా ఎన్టీఆర్ అభిమానులు వచ్చారు. ఎన్టీఆర్‌తో వరంగల్‌లో బహిరంగ సభతోపాటు కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. బహిరంగ సభకు స్టేజీ, మైక్‌ల కోసం రూ.5 వేలు.. కార్యకర్తల సమావేశానికి రూ.2 వేలు అవుతాయని నిర్ణయించారు. డబ్బులు పెట్టిన వాళ్లే సభకు అధ్యక్షత వహించాలని కూడా చెప్పారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. నేను సభ ఖర్చు పెట్టుకుంటే.. కార్యకర్తల సన్నాహక సమావేశం ఖర్చు రమేశ్‌బాబు పెట్టుకున్నారు. 1982లో ఇస్లామియా గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభ భారీ సక్సెస్ అయింది. ఆ సభ నుంచే ఎన్టీఆర్ నన్ను జిల్లా కన్వీనర్‌గా.. రమేశ్‌బాబును పట్టణ అధ్యక్షుడిగా ప్రకటించాడు.
మూడు అసెంబ్లీ.. ఒక ఎంపీ టికెట్..
1983 ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు సందర్భంగా ఎన్టీఆర్ నన్ను పిలిచి టికెట్లు ఎంచుకోవాలని అడిగారు. మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ టికెట్ ఇస్తే గెలుస్తామని చెప్పిన. నాకు వరంగల్ లేకపోతే వర్ధన్నపేట కావాలని పట్టుబట్టిన. ఆయన నాలుగు బీ-ఫారాలు ఇచ్చారు. అప్పుడు టీడీపీ నుంచి వరంగల్‌లో నిలబడే అభ్యర్థి దొరకలేదు. బండా ప్రకాశ్, గుండా ప్రకాశ్.. ఇలా నలుగురైదుగురిని అడిగితే కొత్త పార్టీ నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపించారు. బండారు నాగభూషణ్‌ను అడిగితే రెండు రోజులు తిప్పుకున్నడు. ఆ తర్వాత ఒకే అన్నాడు. ఆయన ఆ ఎన్నికల్లో గెలిచిండు. పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలని అడిగితే మాచర్ల సత్యనారాయణ బీసీ అని ఆయనకు ఇవ్వాలని సూచించిన అని చెప్పాడు.
అది ఓడిపోయే సీటని బీ-ఫారం వెనక్కిచ్చిన..
1985 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో వర్ధన్నపేట బీజేపీకి కేటాయించారు. నాకు వర్ధన్నపేటలోనే పోటీ చేయాలని కోరిక. కానీ పొత్తులో ఆ సీటు వెళ్లిపోవడంతో ఎన్టీఆర్ హనుమకొండలో పోటీ చేయమని బీ-ఫారం ఇచ్చారు.” “నేను బీ-ఫారం తీసుకొని మెట్లు దిగుతుంటే పార్టీ నాయకుడు ఒకరు చూసి.. ‘ఎక్కడ ఇచ్చారు’ అని అడిగాడు. హన్మకొండ అని చెప్పిన. ఆయన నవ్వుతూ.. ఓడిపోయే సీటు నీకు ఇచ్చారు అన్నాడు. అప్పుడే వెనక్కి పోయి.. నాకు వద్దని చెప్పి వి. వెంకటేశ్వర రావుకు ఇప్పించిన. ఆయన పోటీ చేసి గెలిచాడు. “ఆ తర్వాత ఎన్టీఆర్ నాపై ఉన్న అభిమానంతో జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం కల్పించాడు. అయితే ఎడబోయిన బస్వారెడ్డి పోటీకి రావడంతో అదీ వదులుకున్న.”
తొలి విజయం.. డీసీసీబీ చైర్మన్‌గా..
ఎన్టీఆర్ దృష్టిలో నేను ఉండడంతో మళ్లీ 1987లో డీసీసీబీ చైర్మన్‌కు పోటీ చేయాలని చెప్పారు. పర్వతగిరి పీఏసీఎస్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యా. కానీ డైరెక్టర్ల సంఖ్యాబలం టీడీపీకి ఎక్కువగా లేదు. కాంగ్రెస్ బలం ఎక్కువగా ఉంది. అయినా నాకున్న వ్యక్తిగత సంబంధాలతో చైర్మన్‌గా ఎంపికయ్యాయని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినా.. పదవులు లేకపోయినా పార్టీలో కీలకంగా ఉండేవాడిని. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, త్రీమెన్ కమిటీలో మెంబర్‌గా ఉండేవాడినని చెప్పారు.
వర్ధన్నపేట నుంచి హ్యాట్రిక్..
1994లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించిన. 1999లో, 2004లో జరిగిన ఎన్నికల్లోనూ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించా. అయితే 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
వైఎస్ పిలిచాడు.. మంత్రి పదవి ఆఫర్ చేశాడు..
ఆ సమయంలో కాంగ్రెస్ హవా నడుస్తోంది. వైఎస్‌తోనూ నాకు ప్రత్యేక బంధం ఉంది. ఆయన నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించాడు. మంత్రి పదవి కూడా ఆఫర్ చేశాడు. కానీ నేను పోలేదని దయాకర్ రావు చెప్పాడు. అప్పుడే ఆయన నాతో ఓ మాట అన్నాడు.. నిన్ను వర్ధన్నపేటలోనే కాదు.. వరంగల్‌లోనూ పోటీ చేయకుండా చేస్తానన్నారు. ఆ తర్వాత జరిగిన డీలిమిటేషన్‌లో వర్ధన్నపేట ఎస్సీకి.. వరంగల్ ఎంపీ కూడా ఎస్సీకి పోయిందన్నారు. వర్ధన్నపేట వదిలిపెట్టాలని ఢిల్లీలో అడిగిన కుదరలేదు. వైఎస్ ఇంట్రెస్ట్ ప్లీజ్ అని నా రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేశారు.
మాస్క్ వేసుకొని పాలకుర్తిలో సర్వే..
జనరల్ సీట్లు ఉన్న వరంగల్‌తో పాటు పాలకుర్తిలో కూడా సర్వే చేసుకున్న. వరంగల్‌లోనూ గెలుస్తానని వచ్చింది. అయినా పాలకుర్తికి వెళ్లిన. ముఖానికి మాస్క్ వేసుకొని కూలీలతో, ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు సేకరించానని గుర్తు చేసుకున్నారు. మీ దగ్గర కొత్తగా ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అడిగితే.. దయాకర్ వస్తున్నడట అని చెప్పారు. ఆయన మంచోడని.. గెలిపించుకుంటామని చెప్పడంతో నేను అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్న. అక్కడికి వెళ్లిన తర్వాత నాకు ప్రజల మద్దతు పుష్కలంగా వచ్చింది. 2009 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఘన విజయం సాధించిన. 2014లో కూడా గెలిచి.. టీడీపీ నుంచి వరుసగా ఐదుసార్లు శాసనసభకు ఎన్నికైన.”
కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్న..
2014లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్‌లో చేరానని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. కేసీఆర్‌తో నాకు అంతకుముందే సన్నిహిత సంబంధం ఉండేది. పార్టీలో చేరిన వెంటనే నాకు మంత్రి పదవి ఇస్తానన్నాడు. కానీ పార్టీ గుర్తుపై గెలిచిన తర్వాతే మంత్రి పదవి తీసుకుంటానని చెప్పిన. 2018లో ఆరవసారి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా నియామకం అయ్యా. నా శాఖల నుంచి మంచి పనులు చేసినం. ఎన్నో అవార్డులు సాధించినమని తెలిపారు.
ఆదో వడ్డాణం కథ..
టీడీపీ రోజుల్లో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించిన సందర్భాన్ని కూడా దయాకర్ రావు గుర్తు చేసుకున్నారు. టీడీపీలో ఎమ్మెల్యేగా గెలువగానే నన్ను ఎన్టీఆర్ పిలిచి మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. అయితే నేను ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి పెళ్లికి నిరాకరించిన. నెల రోజుల పాటు ఆపిన. ఆ కుట్ర ఉండేది. ఆ తర్వాత ఒక రోజు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లితే లక్ష్మీపార్వతి.. ‘నేను నీకు మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పాను కదా.. నాకు ఒక వడ్డాణం చేయించు’ అని కోరారు. దీంతో వడ్డాణం లేదు.. ఏమీ లేదు.. మంత్రి పదవి వద్దు అంటూ వచ్చేసిన. ఇది నేను గొప్పగా చెప్పుకోవడం కాదు. ఈ ఘటనను చూసిన అప్పటి ఎన్టీఆర్ డ్రైవర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు” అని అన్నారు. ఎన్టీఆర్ దగ్గరకు రెగ్యులర్‌గా వెళ్లేవాళ్లలో నేను, జస్టిస్ రమణ ఇద్దరమే. ఉదయమే ఆయన దగ్గరికి వెళ్లి పార్టీ, ప్రభుత్వ విషయాలు చెప్పేవాళ్లం. మాకే ఆయన కూడా ఆ అవకాశం ఇచ్చేవాడని చెప్పారు.
ఎంతో మందిని టీడీపీలోకి తీసుకొచ్చిన..
“టీడీపీలోకి నేను ఎంతో మందిని తీసుకొచ్చిన. సీతక్క, రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఆహ్వానించి ప్రోత్సహించిన. జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా గంగుల కమలాకర్, విద్యాసాగర్‌రావు, మాగంటి గోపినాథ్‌తోపాటు ఆంధ్రాలో కూడా చాలా మందికి టికెట్లు ఇప్పించిన. ఎన్టీఆర్‌కు ఎంసీపీఐ-యూతో పొత్తు పెట్టుకోవాలని ఆసక్తి ఉండేదని, ఆ పార్టీ నేత ఓంకార్‌తో మాట్లాడాలని తనకు చెప్పారని తెలిపారు. మూడు నాలుగు సార్లు మాట్లాడిన. మూడు టికెట్లు ఇస్తామని చెబితే ఆయన నాలుగు అడిగిండు. దీంతో 1994లో నర్సంపేటలో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని నిలబెట్టినం. ఆయన గెలిచిండని చెప్పారు.
ఎంజీఎం అంటే నాకు ప్రత్యేక ఇష్టం..
ఎంజీఎం దవాఖానను డెవలప్ చేయాలని నాకు చాలా కాయస్ ఉండేది. చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లతో మాట్లాడి రూ.20 లక్షలు చేసి ఆస్పత్రిలో కొత్త బెడ్లు వేయించిన. కేఎంసీలో చదువుకున్న వాళ్లతో ఉన్న పరిచయాలతో రూ.2 కోట్లు ఆస్పత్రి కోసం తెచ్చి ఆడిటోరియం కట్టించిన. ఎంజీఎంను డెవలప్ చేసిన. ఎంజీఎంను అభివృద్ధి చేసిన తీరుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలోనే నన్ను పొగిడారు అంటూ దయాకర్ రావు గుర్తు చేసుకున్నారు.
అది దుబాయ్ మోడల్..
కేసీఆర్‌కు ఆస్పత్రులు మెరుగ్గా ఉండాలని ఉంటుంది. అందుకే వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో మల్టీలెవల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. ఆ మోడల్‌ను దుబాయ్ వెళ్లినప్పుడు చూసి.. సేమ్ టు సేమ్ నిర్మాణం మొదలుపెట్టారని చెప్పారు.
ఎంపీగా గెలవడం ఒక వండర్..
2008లో నేను ఎంపీగా గెలవడం ఒక చరిత్ర. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్టీలు, రెడ్డీలు ఎక్కువ మంది ఉండేవారు. కాంగ్రెస్ హవా నడుస్తోంది. జిల్లాలో నేను ఒక్కడినే ఎమ్మెల్యేను. అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే.” “నేను నిలబడనని చంద్రబాబుకు చెప్పిన. కానీ ఆయన వినలేదు. కాంగ్రెస్ నుంచి రమేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆయనే గెలుస్తారని అనుకున్నారు. కానీ నాకు ప్రతి ఊళ్లో పరిచయస్తులు ఉంటారు. ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారు. ఎవరూ ఊహించని విధంగా గెలిచిన” అని చెప్పారు.
చంద్రబాబుతో లెటర్ ఇప్పించా..
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు నేను కూడా ఉద్యమంలో పాల్గొన్న. జయశంకర్ సార్ పిలిచి నన్ను చంద్రబాబు నాయుడి నుంచి ఢిల్లీకి లెటర్ రాయించమని చెప్పాడు. బాబు వద్దకు వెళ్లి అడిగిత మొదట నిరాకరించడంతో నేను పది మంది ఎమ్మెల్యేలతో రిజైన్ చేస్తా. తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉందని చెప్పిన. వెంటనే ఆయన తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చారు.
అందరూ ‘దయన్న’ అంటరు..
నన్ను ఎక్కడికి పోయినా.. అప్పుడైనా ఇప్పుడైనా అంతా దయన్న.. దయన్న అని పిలుస్తుంటారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలో జిల్లాలో ఎక్కడికి వెళ్లినా దయన్న.. దయన్న అంటూ నినాదాలు చేసేవారు. పర్వతగిరిలో మాత్రం దొర అని అంటరు. దీన్ని చూసి చంద్రబాబు షాక్ అయ్యాడు. అంతటా దయన్న అంటే.. ఇక్కడ ఒక్కకాడనే ఇలా ఎందుకు అంటున్నారని అడిగాడు. నేను అందరితో కలిసిపోతా. ఉదయం 5 గంటలకు లేచి.. 6 గంటల నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటా. వాళ్ల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా. అందుకే అంత అభిమానం అని చెప్పారు.
రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నా..
“మాకు ఒకప్పుడు 500 ఎకరాల వరకు ఉండేది. నేను రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నానే కానీ అక్రమంగా సంపాదించుకోలేదు. 200 ఎకరాల వరకు ఇప్పటికీ మా పేరు మీద ఉంటే.. ఇటీవలే కబ్జాలో ఉన్నవారికి రాసి ఇచ్చాం. నాకు సాయం చేయడమే తెలుసు” అని చెప్పారు.
భార్య సపోర్ట్ పుష్కలం..
నా భార్య ఉషా సపోర్ట్ నాకు పుష్కలంగా ఉంటుంది. ఎర్రబెల్లి ట్రస్ట్‌ను ఆమెనే చూసుకుంటుంది.” “ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతాం. కుట్టు మిషన్లు, నిరుద్యోగులకు కోచింగ్, 200 వాటర్ ప్లాంట్లు, డ్రైవింగ్ లైసెన్సులు.. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం” అని చెప్పారు.
ఎక్కడ అవకాశం వచ్చినా పోటీ చేస్తా..
భవిష్యత్ రాజకీయాలపైనా దయాకర్ రావు తనదైన శైలిలో స్పందించారు. “డీలిమిటేషన్‌లో స్థానాలు మారడం పక్కా. నేను ఎక్కడ అవకాశం వచ్చినా పోటీ చేస్తా. కానీ రాజకీయాల్లోకి వారసులను దింపే ఆలోచన లేదు” అని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో తన ఓటమి గురించి కూడా మాట్లాడారు. “2024 ఎన్నికల్లో నేను ఓడిపోతానని ఆరు నెలల ముందే తెలుసు. ఈ విషయం కేసీఆర్‌కు కూడా చెప్పిన. నాకు వేరే స్థానం కావాలని అడిగిన. కానీ అలా జరగలేదు.” “ఎన్ని రోజులు దయాకర్ రావే అనే మాట వచ్చింది. అందుకే ఓడిపోయిన” అంటూ తన రాజకీయ ప్రయాణంలోని తాజా మలుపును కూడా అంతే నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు.

