పార్టీ నేతలతో సుందర్‌రాజ్‌యాదవ్ సంప్రదింపులు?
సీరియస్‌గా పరిశీలిస్తున్న పార్టీ నేతలు!
అక్షరశక్తి, వరంగల్ : రానున్న ఉమ్మడి నల్లొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థిని ఖరారు చేయగా, బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం తమ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. అయితే.. అధికారికంగా ప్రకటించకున్నా.. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్‌రెడ్డి పేరు ఖరారు అయినట్లేనని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు బలమైన బీసీ నేత, ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.
బీసీవర్గాల కోసం సుందర్‌రాజ్‌యాదవ్ అనేక ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు. బీసీల హక్కుల కోసం పోరాడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ వాదం బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. అంతేగాకుండా, విద్యాసంస్థలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బలమైన ఓటుబ్యాంకు ఉంటుంది. గతంలోనూ ఆయన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో సుందర్‌రాజ్‌యాదవ్ పేరును బీజేపీ అధిష్ఠానం కూడా సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. వరంగల్ నుంచి ఇద్దరు అభ్యర్థులకు అవకాశం దక్కినట్లు అవుతుంది.

