– 7,112 పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
– యువత సద్వినియోగం చేసుకోవాలి
– భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్
అక్షరశక్తి, భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ, ఎస్‌పీఎఫ్ (SPF), జైళ్ల శాఖ (Prisons) తదితర విభాగాల్లో సుమారు 7,112 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, భూపాలపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాలు సాధించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ కోచింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ తెలిపారు. జిల్లాలోని పేద, గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల యువతకు నాణ్యమైన శిక్షణ అందించి పోలీసు ఉద్యోగాలకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్పీ గారు తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అర్హత కలిగిన ఫిజికల్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ అందించబడుతుందని, ఇందులో ఉచిత వసతి, తరగతి బోధన, శారీరక శిక్షణ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు శాఖలో చేరాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు 04-08-2026 నుండి 15-08-2026 వరకు తమ సమీప పోలీస్ స్టేషన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మహిళా అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. కోచింగ్ ప్రారంభ తేదీ, శిక్షణా కేంద్రం మరియు ఇతర పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా మీడియా ద్వారా వెల్లడిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి యువకుడు, యువతి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్రమశిక్షణతో శ్రమించి తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని” ఆకాంక్షించారు.
