28 C
Hyderabad
Homeతాజా వార్తలురేవూరి రాజకీయం....!

రేవూరి రాజకీయం….!

రేవూరి రాజకీయం…!

*ఎమ్మెల్యే నయా రాజకీయ నీతి?

అక్షరశక్తి,పరకాల: పరకాలలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించకపోవడం కాంగ్రెస్‌ పార్టీలో తాజా చర్చకు దారి తీస్తున్నది. పరకాలలో కాంగ్రెస్ కేడర్ బలంగా ఉండడానికి ఇనగాల చేసిన కృషిని తగ్గించే ప్రయత్నాలకు స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడా? భవిష్యత్ రాజకీయాలకు ఆయనను దూరం చేసే ప్రయత్నాలకు ఆజ్యం పోతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న కీలక నేతను సీఎం సభకు దూరంగా ఉంచడం వెనుక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నాడా అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ప్రొటోకాల్‌కు సంబంధం లేని పబ్లిక్‌ మీటింగ్‌ అయినప్పటికీ పార్టీకి చెందిన సీనియర్‌ నేతకు కనీస సమాచారం లేకపోవడంపై ఇనుగాల వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పదేళ్లుగా పరకాలలో కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేసిన నేతకు దక్కుతున్న గౌరవం ఇదేనా అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్‌లోకి వచ్చి అభ్యర్థిగా బరిలో నిలిచిన సమయంలో పార్టీ అభ్యర్థిత్వం, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహంలో ఇనుగాల కీలకంగా పనిచేశారని ఆయన వర్గీయులు గుర్తుచేస్తున్నారు. పార్టీ కష్టకాలంలోనూ వెన్నంటి నిలిచిన నేతనే ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలిసి పనిచేద్దామని చెబుతూనే ఒక కీలక నేత రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయన్నదే అసలు ప్రశ్నగా మారింది. ఈ పరిణామాలు కొనసాగితే పరకాల కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరింత ముదిరే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు సీఎం సభ వేదికపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఉన్న సమయంలోనే డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల గైర్హాజరు కావడం చర్చకు మరింత ఆజ్యం పోసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిని కీలక కార్యక్రమానికి దూరంగా ఉంచడంపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇనుగాలను రాజకీయంగా అణిచివేస్తున్నారన్న ప్రచారానికి తెరదించాలంటే కాంగ్రెస్‌ నాయకత్వం నేతల మధ్య సమన్వయం, పరస్పర గౌరవాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే రేవూరి, ఇనుగాల మధ్య పెరుగుతున్న దూరం వ్యక్తిగత విభేదాలకే పరిమితం కాకుండా పరకాల కాంగ్రెస్‌ కేడర్‌ను రెండు వర్గాలుగా చీల్చే పరిస్థితికి దారితీసే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పరకాల కాంగ్రెస్ బలహీనపడింది అనడానికి ఇది సంకేతంగా ఈ ప్రచారం జరుగుతున్నది.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.