* ఎన్నికల హామీలను అమలు చేయాలి
* 250 గజాల స్థలం, గృహ నిర్మాణానికి నిధులు ఇవ్వాలి
* పెండింగ్ కేసులు ఎత్తివేయాలి
* తెలంగాణ ఉద్యమ నేత జోరిక రమేష్ డిమాండ్
* ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నాన్చివేతధోరణిపై మండిపాటు
అక్షరశక్తి, హన్మకొండ, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 250 గజాల ఇంటి స్థలాల పట్టాలు అందించాలని తెలంగాణ ఉద్యమ నేత, మాజీ విద్యార్థి నాయకుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థి జేఏసీ మాజీ ఛైర్మన్ జోరిక రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఏకశిలా పార్కులో శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జోరిక రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్నా ఉద్యమకారుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం బాధాకరమన్నారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసులతో ఇప్పటికీ పలువురు ఉద్యమకారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హామీల అమలులో జాప్యం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి నిధులు అందిస్తామని హామీ ఇచ్చిందని జోరిక రమేష్ గుర్తుచేశారు. అలాగే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యమకారులకు పెన్షన్ అందిస్తామని ప్రకటించిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఈ హామీల అమలుపై స్పష్టత లేకపోవడం శోచనీయమన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే అధికారిక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాల పట్టాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధిని ఆచరణలో చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
పెండింగ్ కేసులు ఎత్తివేయాలి
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని రమేష్ తెలిపారు. అయితే ఇప్పటికీ అనేక కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యమకారులు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించి, ఉద్యమకారులకు ఉపశమనం కల్పించాలని కోరారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా కే. కేశవరావును, సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరామ్, అద్దంకి దయాకర్, రాములు నాయక్, శోభన్‌రెడ్డిలను నియమించిందని రమేష్ తెలిపారు. అయితే ఈ కమిటీకి కాలపరిమితి నిర్ణయించకుండా నాన్చివేత ధోరణిని అవలంబించడం వల్ల ఉద్యమకారుల సమస్యలు మరింత జాప్యమవుతున్నాయని విమర్శించారు.
మరో పోరాటానికి సిద్ధం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ ఉద్యమకారుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆగస్టు 15న జరిగే అధికారిక వేడుకల్లోనే ఉద్యమకారులకు ఇంటి స్థలాల పట్టాలు అందించాలని జోరిక రమేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యమకారులను సమీకరించి మరో దశ పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు బైరపాక ప్రశాంత్, గండ్రకోట రాకేష్ యాదవ్, పోలపల్లి రామ్మూర్తి, వంశీ, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
