వాహన తనిఖీల్లో పోలీసులకు చిక్కిన నిందితుడు
అక్షరశక్తి, హసన్‌పర్తి, సెప్టెంబరు 11 : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది. బళ్లారి జిల్లా గుడుదూరుకు చెందిన కార్ డ్రైవర్, రైతు వొద్దిరాజుల బసవరాజ్ (27) అనే యువకుడు తౌటం స్వప్న (40)ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని శుక్రవారం అంబాల–కమలాపూర్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హసన్‌పర్తి పరిధికి చెందిన స్వప్న మే 15న అదృశ్యమైంది. ఆమె తండ్రి అమంచ రాజేందర్ ఫిర్యాదు మేరకు మే 31న హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ బి.సుజిత్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు కొనసాగించగా స్వప్న అదృశ్యం వెనుక హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
బసవరాజ్‌తో స్వప్నకు పరిచయం ఉండేదని, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అతడిపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోకపోతే తమకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బయటపెడతానని స్వప్న హెచ్చరించడంతో బసవరాజ్ భయాందోళనకు గురయ్యాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను బళ్లారికి రప్పించాడు. అక్కడ గావి సిద్ధేశ్వర ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పీక పిసికి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
అనంతరం మరుసటి రోజు రాత్రి మటన్ కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేశాడని, తన రక్తపు మరకలు ఉన్న దుస్తులను పెట్రోల్‌తో తగులబెట్టాడని చెప్పారు. స్వప్న ఫోన్‌ను చెరువులో పడేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
శుక్రవారం అంబాల–కమలాపూర్ రోడ్డులో హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఎ.మహేందర్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బసవరాజ్ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో స్వప్న హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి రియల్‌మీ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 103, 238 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కేసును చాకచక్యంగా ఛేదించిన హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ ఎ.మహేందర్, ఎస్‌ఐలు సుజిత్, రవి, దేవేందర్, ఏఏఓ సల్మాన్ పాషా, పోలీస్ సిబ్బంది బావ్‌సింగ్, తిరుపతి, సుమన్, సోమన్న, పూర్ణచారి, నవీన్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.

