అక్షరశక్తి, హనుమకొండ: అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే, చర్చకు రాకుండా ధర్నా పేరుతో తన క్యాంప్ ఆఫీస్‌పై దాడికి ప్రయత్నించడం ఏమిటని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. తాను క్యాంప్ ఆఫీస్‌లో లేని సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారని తెలిసి అక్కడికి వచ్చి ఆందోళన చేయడం సమంజసం కాదని అన్నారు.
గత పదేళ్ల పాలనలో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న వారు, చేసిన పనులకు సంబంధించిన ఆధారాలతో ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని నాయిని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో ఎందుకు ఓటమి పాలయ్యారో కూడా వివరించాలని ప్రశ్నించారు.
అభివృద్ధిపై చర్చకు రావాలని తాను అంబేద్కర్ చౌరస్తాకు సవాల్ విసిరితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారని, చర్చకు రావాల్సిన వారు మాత్రం సమాధానం చెప్పకుండా వెనుదిరిగారని ఆరోపించారు. గతంలో చేపట్టిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, ఆధారాలతో తమ నాయకులు చర్చకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రాజకీయాల పేరుతో కబ్జాలు, దౌర్జన్యాలు, గొడవలకు పాల్పడకుండా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. పోలీసుల జోక్యం లేకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొంటూ, మరోసారి తన క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి గొడవలు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తూ ఎవరూ తొందరపడి ఎలాంటి చర్యలకు దిగవద్దని, సంయమనం పాటించాలని కోరారు. ప్రజలే అన్ని విషయాలను గమనిస్తున్నారని, మనం అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిపై చర్చకు తాను ఎప్పుడూ సిద్ధమేనని, అయితే కుటుంబ సభ్యులు ఉన్న సమయంలో క్యాంప్ ఆఫీస్‌పై దాడికి ప్రయత్నించడం, రాజకీయాల పేరుతో అల్లర్లు సృష్టించడం మాత్రం సహించేది లేదని నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

