2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం: కేటీఆర్
పెన్షన్లు పెంచకపోగా 4.71 లక్షల మందికి కోత.. ఇదేనా ప్రజాపాలన?
మహిళలకు రూ.85,500 బాకీ.. రూ.2,500 హామీ ఏమైంది?
కాంగ్రెస్‌లో అవినీతి, కమీషన్ల దందా.. సొంత ఎమ్మెల్యేలే బట్టబయలు చేస్తున్నారు
వరంగల్ అభివృద్ధిని మూడేళ్లుగా అటకెక్కించిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలో ఆరు మెడికల్ కాలేజీలు.. ఐటీ, టెక్స్టైల్ పరిశ్రమలు
ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి
ఓరుగల్లు గడ్డతో నాది ఉద్యమ అనుబంధం.. 2028లో మళ్లీ కేసీఆర్ నాయకత్వం
అక్షరశక్తి, వరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, 2028లో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు రాబోయే ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పెన్షన్లు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ మంత్రులు వాస్తవాలు మాట్లాడాలని, నాలుగు లక్షల 71 వేల పెన్షన్లు తొలగించి కొత్తగా నాలుగు లక్షల 63 వేల పెన్షన్లు మాత్రమే ఇచ్చినప్పుడు పెంచినట్లా.. తగ్గించినట్లా అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి 36 నెలలు గడిచినా అమలు చేయలేదని, ఒక్కో మహిళకు రూ.85,500 బకాయి పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అవినీతి, 20 శాతం కమీషన్ల వ్యవహారాన్ని బయటపెడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా పర్సంటేజీల పాలన సాగుతోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో సంక్షేమం సున్నా.. అభివృద్ధి గుండుసున్నా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిందని కేటీఆర్ విమర్శించారు. మొదటి ఏడాది లక్షన్నర, రెండో ఏడాది మరో లక్షన్నర, మూడో ఏడాది లక్షా 20 వేల పెన్షన్లు తొలగించారని, మొత్తం 4.71 లక్షల పెన్షన్లకు కోత పెట్టి కొత్తగా 4.63 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రూ.2,000 పెన్షన్‌ను ఇప్పటికీ కొనసాగిస్తూ, కొత్తగా పెన్షన్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
మహిళలకు రూ.1.50 లక్షలు చెల్లించాలి
ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 36 నెలలుగా ఆ హామీని అమలు చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్కో మహిళకు రూ.85,500 బకాయి పడిందని, ఇతర పెండింగ్ హామీలను కలిపితే చెల్లించాల్సిన మొత్తం రూ.1.50 లక్షలకు చేరుతుందని చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం లక్షాధికారులుగా చేయాలని సవాల్ విసిరారు. మహిళలకు రూ.1.50 లక్షల చొప్పున ఇచ్చి లక్షాధికారులను చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలిపెట్టి వెళ్తానని ప్రకటించారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులకు రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం వంటి హామీలను కూడా కాంగ్రెస్ విస్మరించిందన్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ అవినీతిని బయటపెడుతున్నారు
రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిపోయిందో కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలే వెల్లడిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు వసూళ్లు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి చెబుతుంటే, 20 శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు జరగడం లేదని మరో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెబుతున్నారని గుర్తుచేశారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వందల కోట్లు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు, దేవాలయ భూముల వ్యవహారంపై మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అవినీతి బాగోతాన్ని బయటపెడుతున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కమీషన్ల వసూళ్లలో మునిగిపోయిందని మండిపడ్డారు.
వరంగల్ అభివృద్ధిని మూడేళ్లుగా అటకెక్కించారు
కేసీఆర్ పాలనలో వరంగల్‌ను రాష్ట్రంలోనే ప్రధాన పారిశ్రామిక, విద్యా, వైద్య, ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు పునాదులు వేశామని కేటీఆర్ తెలిపారు. 24 అంతస్తులు, 2,250 పడకలు, 35 వైద్య విభాగాలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను 90 శాతం పూర్తి చేశామని చెప్పారు. జనగామ, మహబూబాబాద్ ఆసుపత్రుల పనులు కూడా దాదాపు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేసి వైద్య విద్యకు పెద్దపీట వేశామని వివరించారు.
మడికొండ ఐటీ పార్కులో ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ, సైయెంట్, టెక్ మహీంద్రా, క్వాడ్రంట్ వంటి కంపెనీలను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కిటెక్స్, గణేశా ఎకోస్పియర్, యంగ్వన్ వంటి పరిశ్రమలను తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించామన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించామని, రూ.150 కోట్లతో రెండు సమీకృత కలెక్టరేట్లు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో వరంగల్‌కు ఒక్క కొత్త ఐటీ కంపెనీని, ఒక్క కొత్త పరిశ్రమను తీసుకురాలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే ఉన్న కంపెనీలు కూడా మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మిగిలిన పనులను కూడా పూర్తి చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు మాత్రం ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. పేదల కోసం నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించకుండా, మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించడంపై ప్రశ్నలు సంధించారు. ఆ ఆసుపత్రితో ముఖ్యమంత్రి బినామీ సంబంధాలున్నాయన్న ఆరోపణను కూడా ప్రస్తావించారు.
ఫ్యూచర్ సిటీ కాదు.. ఫ్యూచర్ ఉన్న సిటీ వరంగల్
హైదరాబాద్ సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం భూములు సేకరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దాని పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అని ప్రచారం చేసుకుంటోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నిజమైన భవిష్యత్తు ఉన్న నగరం వరంగల్ అని స్పష్టం చేశారు. వరంగల్‌ను రాష్ట్రంలోనే ప్రధాన పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను భవిష్యత్తులో తాను తీసుకుంటానని ప్రకటించారు.
ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేయడం ఎవరి ప్రయోజనాల కోసం?
ముఖ్యమంత్రి, మంత్రి కుటుంబాలకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాళోజీ కళాక్షేత్రంలో కుడా కార్యాలయమా?
ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీద 1,217 మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మించిన కళాక్షేత్రంలో కుడా కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. కవులు, కళాకారులు, రచయితల కోసం నిర్మించిన కళాక్షేత్రాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వరంగల్ ప్రజల వ్యతిరేకతతోనే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని అన్నారు. కాకతీయుల కళాతోరణం, కాళోజీ వారసత్వం, వరంగల్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
సాగునీటి నిర్వహణలోనూ కాంగ్రెస్ వైఫల్యం
గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. దేవాదుల పంపులు, కన్నెపల్లి మోటార్లను సమర్థంగా నిర్వహించి నీటిని వినియోగించుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. చెరువులు, రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేవని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డికి కనిపిస్తున్న సమస్య కేసీఆర్ గడ్డమే
ప్రజలు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ గడ్డంపై వ్యాఖ్యలు చేయడం మినహా రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు, రైతుల సమస్యలు, నిరుద్యోగం, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రికి పట్టింపు లేదన్నారు. బూతులు మాట్లాడటం తప్ప రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిందేమీ లేదని విమర్శించారు.
ఓరుగల్లు గడ్డతో నాది ఉద్యమ అనుబంధం
వరంగల్‌తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే వరంగల్‌లో కాగడాల ప్రదర్శనలో కవాతు చేసిన రోజులు, 17 ఏళ్ల క్రితం నవంబర్ 29న అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీగా గడిపిన సందర్భం తనకు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సాగిన ప్రతి కీలక సందర్భంలోనూ వరంగల్ అండగా నిలిచిందని, ఉద్యమ మహాగర్జన నుంచి తెలంగాణ రజతోత్సవ సభ వరకు ఓరుగల్లు ప్రజలు అందించిన మద్దతును ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీల ఢిల్లీ బానిసత్వానికి చరమగీతం పాడాలి
తెలంగాణ ఆత్మగౌరవం కోసం 1,200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లుతున్నారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే అధిష్ఠానాల మెప్పే వారికి ముఖ్యమైందన్నారు. కాకతీయుల పౌరుషానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్, బీజేపీల రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. వరంగల్ అభివృద్ధి, యువతకు ఉపాధి, ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం
తెలంగాణ ఉద్యమంలో ప్రతి పరీక్షా సమయంలోనూ ఓరుగల్లు అండగా నిలిచిందని, భవిష్యత్తులోనూ వరంగల్ ప్రజల ఆశీర్వాదం తమకు ఉంటుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2028లో పెద్దలు కేసీఆర్ తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు ఉపాధి, వరంగల్ ప్రగతి, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలంటే కేసీఆర్ నాయకత్వం మళ్లీ రావాలని పేర్కొన్నారు. కేసీఆర్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చుకుంటేనే వరంగల్‌తో పాటు తెలంగాణ సురక్షితంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

