27.5 C
Hyderabad
Homeతాజా వార్తలువ‌రంగ‌ల్ మ‌హానగరంలో నకిలీ వైద్యం

వ‌రంగ‌ల్ మ‌హానగరంలో నకిలీ వైద్యం

* అనుమతి లేని క్లినిక్ లపై మెరుపు దాడులు
* వైద్య వృత్తి దుర్వినియోగంపై టీజీఎంసీ సీరియస్
* 16 మంది నకిలీ వైద్యులపై కేసులు
* రిజిస్ట్రేషన్ దుర్వినియోగంపై వైద్యురాలికి షోకాజ్ నోటీసులు

అక్షరశక్తి, వరంగల్ : రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, వ్యాపారం చేస్తున్న క్లినిక్ లపై తెలంగాణా వైద్య మండలి మెరుపు దాడులు చేసింది. వరంగల్ నగరంలో వైద్య వృత్తి దుర్వినియోగం, నకిలీ వైద్యం, అనుమతి లేని క్లినిక్‌ల నిర్వహణపై తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) కఠిన చర్యలు ప్రారంభించింది. శివనగర్, కరిమాబాద్, కీర్తినగర్, కాజీపేట, ఊరుగొండ, ఊర్సు, ఫోర్ట్ వరంగల్ ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తుతో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 16 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసింది. గతంలో కూడా ఇలాంటి దాడుల్లో చాలా మంది పట్టుబడ్డారు. అయినా కానీ వీరు విచ్చల విడిగా వైద్యాన్ని వ్యాపార దందా గా మార్చారు. అర్హత లేని వైద్యం పై చర్యలు తీసుకోవడానికి కఠిన చట్టాలు వస్తేనే రోగుల ప్రాణాలు తీసే నకిలీ వైద్యుల ఆటకట్టించవచ్చు అని వైద్య వర్గాలు అంటున్నాయి.

*ఫస్ట్ ఎయిడ్ పేరుతో మోసం….
నగరంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో జరుగుతున్న వైద్య విధానం వెలుగులోకి వచ్చింది. చట్ట విరుద్ధంగా ఇన్‌పేషెంట్ సేవలు అందించడం, బెడ్లు ఏర్పాటు చేసి రోగులను చేర్చుకోవడం, సెలైన్‌లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడం, అపరిశుభ్ర వాతావరణంలో చికిత్సలు నిర్వహించడం, బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా పారవేయడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలు వెలుగుచూశాయి.
అత్యంత ఆందోళనకరంగా నమోదిత వైద్యుల రిజిస్ట్రేషన్‌ను దుర్వినియోగం చేస్తున్న ఘటనలను కూడా టీజీఎంసీ గుర్తించింది. ఫోర్ట్ రోడ్‌లోని కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎ. రమేష్, నమోదిత వైద్యురాలు డా. శ్రీహిత రిజిస్ట్రేషన్ వివరాలను అక్రమంగా వినియోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు మండలి వెల్లడించింది. నమోదిత వైద్యులు తమ రిజిస్ట్రేషన్‌ను ఇతరులకు వినియోగించేందుకు అనుమతించడం తీవ్రమైన వృత్తిపరమైన ఉల్లంఘన అని స్పష్టం చేసింది.

*పరారీలో నకిలీ వైద్యుడు….

మెడికల్ అధికారుల తనిఖీల సమాచారం అందగానే అక్రమ అబార్షన్లు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ వైద్యుడు రుద్ర భాస్కర్ పరారయ్యాడు. మరో నకిలీ వైద్యుడు లక్ష్మీనారాయణ కేసుల భయంతో తన క్లినిక్‌లోని బెడ్లు, వైద్య పరికరాలు, వాడిన సిరంజీలు, మందుల సీసాలు తొలగించినట్లు అధికారులు గుర్తించారు.

పట్టుబడ్డ నకిలీలు…

టీజీఎంసీ దాడుల్లో ఎ. రాములు , శివనగర్, కమలాకర్ ,జయశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కీర్తినగర్ ,బండి రమేష్ శ్వేత ఫస్ట్ ఎయిడ్ సెంటర్, శివనగర్, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర క్లినిక్, కీర్తినగర్ ,బాబురావు, శివనగర్, ఎ. రమేష్ – కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఫోర్ట్ రోడ్, కృష్ణమూర్తి , కరిమాబాద్, టి. రాజమౌళి, విజయదుర్గ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కరిమాబాద్ , శివశంకర్ గడ్డం హరీష్ ,గడ్డం శ్రీనివాస్,ఊర్సు
ఎం. సిద్ధేశ్వర్ – జయలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, జి. రామకృష్ణ ఫోర్ట్ వరంగల్, కుమారస్వామి,సుధాకర్ కాజీపేట, ఊరుగొండ కు చెందిన వెంకట రాములు పట్టుబడ్డారు.

టీజీఎంసీ హెచ్చ‌రిక‌

నకిలీ వైద్యం, అనుమతి లేని క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధ వైద్య సేవలు, నమోదిత వైద్యుల పేర్లు, రిజిస్ట్రేషన్ దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఈ సందర్భంగా టీజీఎంసీ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని తెలిపింది. ప్రజలు కూడా చికిత్స పొందే ముందు సంబంధిత వైద్యుడు తెలంగాణ వైద్య మండలి లేదా నేషనల్ మెడికల్ కమిషన్‌లో నమోదైన వైద్యుడేనా అనే విషయాన్ని తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. నకిలీ వైద్యుల సమాచారం ఉంటే 91543 82727 నంబర్‌కు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.