20.4 C
Hyderabad
Homeతాజా వార్తలుసేవా గుణంలో ముందుండే గొట్టె పుల్లయ్య

సేవా గుణంలో ముందుండే గొట్టె పుల్లయ్య

📰 Generate e-Paper Clip

బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వాటర్‌ బాటిళ్ల పంపిణీ

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : చదువుకునే పేద విద్యార్థులకు చేయూతనందిస్తూ.. వారి ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న గొట్టె పుల్లయ్య మరోసారి తన సేవా నిరతిని చాటుకున్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ యూపీఎస్‌ ఆర్‌ఈసీ పాటక్‌ పాఠశాల విద్యార్థులకు వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేసి చిన్నారులను ప్రోత్సహించారు. గ్రేటర్‌ వరంగల్‌ 61వ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు, సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి, సామాజిక సేవకుడు గొట్టె పుల్లయ్య నవంబర్‌ 14న పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయుల సమక్షంలో సుమారు 40 మంది విద్యార్థులకు వాటర్‌ బాటిళ్లను బహూకరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. చదువుపై ఆసక్తి చూపుతూ ముందుకు సాగే విద్యార్థులకు భవిష్యత్తులోనూ తన వంతు ప్రోత్సాహం, బహుమతులు అందిస్తానని తెలిపారు.

విద్యార్థుల ప్రోత్సాహమే లక్ష్యం

విద్యార్థులకు అవసరమైన చిన్నచిన్న వస్తువులు అందించడం కూడా వారి చదువుపై ఆసక్తిని పెంచుతుందని పుల్లయ్య అభిప్రాయపడ్డారు. బాల్యం నుంచే విద్యార్థుల్లో చదువుపట్ల శ్రద్ధ, పట్టుదల పెంపొందించాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. కేవలం బాలల దినోత్సవానికే పరిమితం కాకుండా, అవసరమైన సందర్భాల్లో విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.

నిరంతరం సేవా కార్యక్రమాలు

సింగరేణి ఉద్యోగ విరమణ అనంతరం కూడా గొట్టె పుల్లయ్య సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు సహాయం అందించడం, పేద కుటుంబాలకు తనవంతు చేయూతనివ్వడం వంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో సేవాభావాన్ని చాటుతున్నారు. సమాజం నుంచి పొందిన దానిలో కొంతైనా తిరిగి సమాజానికి అందించాలనే భావనతో తనకు సాధ్యమైన రీతిలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడటమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె. రఘోత్తంరెడ్డి, ఉపాధ్యాయురాలు ఆర్‌. శోభ, ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌ కె. అరుణజ్యోతి, ఆయా కె. సంధ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.