24.3 C
Hyderabad
Homeతెలంగాణనోటిఫికేషన్ లేకుండానే నియామకాలా..?

నోటిఫికేషన్ లేకుండానే నియామకాలా..?

– గిరిజన సంక్షేమ శాఖలో డీడీ ఇష్టారాజ్యం
– 40 మందికిపైగా హాస్టల్ వర్కర్ల అక్రమ నియామకాలు
– ఒక్కొక్క‌రి నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు?
– వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులపైనా వేధింపులు
– దేశిరామ్ నాయక్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు

అక్షరశక్తి ప్రతినిధి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న దేశిరామ్ నాయక్ ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి హాస్టళ్లలో 40 మందికిపైగా వర్కర్లను అక్రమంగా నియమించారని ఆరోపణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. కలెక్టర్, గిరిజన సంక్షేమ కమిషనర్, సెక్రటరీ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా నియామకాలు చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం. వివిధ ఆశ్రమ పాఠశాలలో, ప్రి మెట్రిక్ వసతి గృహాలలో, కళాశాల వసతి గృహాల‌లో ఎటువంటి నోటిఫికేషన్లు లేకుండా వర్కర్లను నియ‌మించ‌డం వెనుక పెద్ద‌మొత్తం అవినీతి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ నియామకాల కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు లంచాలు వసూలు చేసినట్లు స‌మాచారం. ఈ విధంగా అక్రమ నియామకాల వల్ల అర్హత ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దూరమయ్యాయి.

యూనిక్ ఐడీలు కూడా అక్రమంగానే..?
ఇన్‌చార్జి డీడీగా దేశిరామ్‌నాయ‌క్ గిరిజ‌న సంక్షేమ శాఖ‌ను భ్ర‌ష్టుప‌ట్టించార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అక్ర‌మంగా నియమించిన వర్కర్లకు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా యూనిక్ ఐడీలు జారీ చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో ప్రభుత్వ అనుమతులు, అధికారిక ఆమోదాలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ మేర‌కు ఉన్న‌తాధికారుల‌కు కూడా ఫిర్యాదులు అందడం గ‌మ‌నార్హం. దీనిపై సమగ్ర విచారణ జరిపితే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.
దేశిరామ్ నాయక్ తన అధికార పరిధిని మించి వ్యవహరిస్తున్నారనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అంతేగాకుండా, కొంతమంది ప్రైవేటు వ్యక్తులను అడ్డం పెట్టుకుని హాస్టళ్లలోని ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లపై సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా నోటీసులు పంపిస్తూ వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా తెలుస్తోంది.

అర్హతపై కూడా అనేక‌ ప్రశ్నలు

ఇన్‌చార్జి డీడీ దేశిరామ్‌నాయ‌క్‌కు సంబంధించి మరో కీలక అంశం కూడా తీవ్ర వివాదాస్ప‌దంగా మారుతోంది. ఏటీడీవోగా పనిచేస్తున్న వ్యక్తికి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని, అయినప్పటికీ దేశిరామ్ నాయక్‌కు ఆ బాధ్యతలు అప్పగించారని ప‌లువురు పేర్కొన్నారు. ఇటీవ‌ల‌ బదిలీ అయినప్పటికీ, తిరిగి ఇదే జిల్లాలో కొనసాగుతుండ‌డం గ‌మ‌నార్హం. పూర్తిస్థాయి బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు వ‌చ్చిన డీడీని కూడా తిరిగిపంపించే స్థాయిలో దేశిరామ్‌నాయ‌క్ ఉండ‌డం గ‌మ‌నార్హం. కాగా, ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే, గతంలో మహబూబాబాద్ ఏటీడీవోగా పనిచేసిన సమయంలో కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్‌టీల) నియామకాలలో కూడా అక్రమాలు జరిగాయని, ఆ అంశంపై అప్పటి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.