30.5 C
Hyderabad
Homeతెలంగాణసోషల్ జస్టిస్ చేసింది కేసీఆర్ నే.....

సోషల్ జస్టిస్ చేసింది కేసీఆర్ నే…..

సోషల్ జస్టిస్ చేసింది కేసీఆర్‌నే:

*దాస్యం వినయ్‌ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి

అక్షరశక్తి,హనుమకొండ: తెలంగాణే శ్వాసగా, ధ్యాసగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసినదే అసలైన సోషల్‌ జస్టిస్‌ అని బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. సోమవారం హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం 420 హామీలు, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను కేసీఆర్‌ సాకారం చేశారని, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాలతో పేద, బడుగు, బలహీన వర్గాలను ఆదుకున్నారని వినయ్‌ భాస్కర్‌ పేర్కొన్నారు. బీసీ, మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. తొలి డిప్యూటీ సీఎంగా దళిత నేతకు, తొలి స్పీకర్‌గా బీసీ నేతకు అవకాశం కల్పించడంతో పాటు అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. అయితే రేవంత్‌రెడ్డి పాలనలో సోషల్‌ జస్టిస్‌ ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాల పర్యటనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం పర్యటనతో పరకాలకు ఒరిగిందేమీ లేదని, రైతులకు యూరియా అందించడం, నియోజకవర్గానికి సాగునీరు తీసుకురావడం వంటి సమస్యలపై ముఖ్యమంత్రి మాట్లాడలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు రంగులు వేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం తామే చేసినట్లుగా ప్రచారం చేసుకుంటోందని అన్నారు. టెక్స్‌టైల్‌ పార్కు, వంద పడకల ఆసుపత్రి వంటి అభివృద్ధి పనులను బీఆర్‌ఎస్‌ హయాంలోనే తీసుకొచ్చామని, గత మూడేళ్లలో పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పరకాల నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌–నాన్‌ వెజ్‌ మార్కెట్‌, దామెర చెరువు సుందరీకరణ, చిరు వ్యాపారుల కోసం నిర్మిస్తున్న కాంప్లెక్స్‌ వంటి పనులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. సీఎం సభ కోసం చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించి వారిని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మహిళా సంఘాల సభ్యులను సభకు రావాలని ఒత్తిడి చేసి, రాకపోతే జరిమానా విధిస్తామని బెదిరించారన్న ఆరోపణలను కూడా ఆయన చేశారు. రైతులకు యూరియా అందించలేని అసమర్థ ప్రభుత్వం ఇదని, ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.

కేసీఆర్‌ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను చల్లా ధర్మారెడ్డి తప్పుబట్టారు. రాజకీయ విమర్శలు చేయడంలో హద్దులు పాటించాలని, కుటుంబాల జోలికి వెళ్లడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్‌ వంద జన్మలు ఎత్తినా ఆయనను ఏమీ చేయలేరని, ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఆనవాళ్లను కూడా చెరపలేరని అన్నారు. అక్కంపేట గ్రామం ఇప్పటికీ రెవెన్యూ గ్రామంగా మారిందా లేదా అనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అధికార బలంతో ఏది మాట్లాడినా చెల్లుతుందనే భ్రమలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని దాస్యం వినయ్‌ భాస్కర్‌ హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రారంభిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, ఓఆర్‌ఆర్‌ వంటి ప్రాజెక్టుల విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మూడేళ్లుగా వంచించిన రేవంత్‌రెడ్డి తాను సోషల్‌ జస్టిస్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం పర్యటనకు జిల్లా మంత్రి సురేఖ హాజరుకాకపోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ అంతర్గత పరిస్థితులకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. హామీలను నెరవేర్చకపోతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వినయ్‌ భాస్కర్‌, చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, హన్మకొండ, పరకాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.