అక్షరశక్తి, హైద్రాబాద్: మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి కొండా సురేఖను ఆదేశించినట్లు తెలిసింది. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, గవర్నర్‌కు బర్తరఫ్ సిఫారసు లేఖ పంపాల్సి వస్తుందని అధిష్ఠానం హెచ్చరించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకునేలోపే కొండా సురేఖ రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. బర్తరఫ్ వేటు పడే పరిస్థితి కంటే స్వయంగా రాజీనామా చేయడమే మంచిదని సురేఖ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో బర్తరఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని, ఆ స్థాయికి పరిస్థితిని తీసుకురావద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సురేఖకు సూచించినట్లు సమాచారం.
తన నిర్ణయంపై పునరాలోచించాలని సురేఖ కోరినప్పటికీ అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం పార్టీలో కొనసాగడం అవమానకరంగా భావిస్తున్న సురేఖ, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

