మాకు పథకాలు కాదు.. సీట్లు కావాలి
బీసీలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం
జనరల్ సీట్లు అందరివీ
నోట్లు వాళ్లవి.. ఓట్లు మావి.. ఇక కొనుడు బంద్ చేయాలి
వరంగల్ జనరల్ మేయర్ స్థానం బీసీలకే దక్కాలి
అక్టోబర్‌లో పరకాలలో బీసీల బహిరంగ సభ
ఉమ్మడి వరంగల్‌లో 8 భారీ సభలు..
ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి:
బీసీలకు అధికారం ఒకరు పెడితే వచ్చే బిక్ష కాదు..న్యాయంగా వచ్చే రాజకీయ వాటా, వాటినే అడుగుతున్నాము. మెజారిటీగా ఉన్న బిసిలు రాజకీయ అంతిమ తీర్పు ఇవ్వగల శక్తి ఉన్నవాళ్లే అని ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జనరల్ స్థానాలు అన్ని వర్గాల వారు పోటీ చేసే అవకాశమున్నవని, కానీ అవి ఒక్క వర్గానికే పరిమితమైనట్లుగా మారాయని విమర్శించారు. నోట్లు కొందరివి.. ఓట్లు బీసీలవిగా మారిన పరిస్థితిని ఇక మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, ఉద్యోగాలు, విద్య, ఆర్థిక అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. బీసీ ఉద్యమంలో డప్పులు ఎన్ని ఉన్నా శబ్దం చేసే లక్ష్యం..భావజాలం ఒకటే అని స్పష్టం చేశారు. డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన రాజకీయ, విద్యా, సామాజిక ప్రస్థానంతో పాటు వరంగల్ అభివృద్ధి, బీసీల హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై సుందర్రాజ్ యాదవ్ మాట్లాడారు.
బీసీలకు సీట్లు దక్కే వరకూ పోరాటం…
బీసీలకు సంక్షేమ పథకాలు అందించడం మాత్రమే సామాజిక న్యాయం కాదని సుందర్రాజ్ యాదవ్ అన్నారు. రాజకీయ అధికారంలో వాటా, చట్టసభల్లో ప్రాతినిధ్యం, పార్టీ పదవుల్లో సముచిత స్థానం, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కల్పించినప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బీసీల ఓట్లను ఎన్నికల సమయంలో వినియోగించుకుని, సీట్లు ఇచ్చే సమయంలో పక్కన పెట్టే విధానం ఇక కొనసాగకూడదన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీలన్నీ బీసీల ఓట్లు కావాలని కోరుకుంటున్నాయని, కానీ వారికి తగిన సంఖ్యలో సీట్లు ఇవ్వడంలో వెనుకంజ వేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పే రాజకీయాలకు ముగింపు పలకాలని అన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఓబీసీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.
జనరల్ అంటే అందరిదీ.. ఆ ఒక్క వర్గానిది కాదు
జనరల్ స్థానాలు అన్ని కులాలు, వర్గాల వారు పోటీ చేయడానికి ఉద్దేశించినవని సుందర్రాజ్ యాదవ్ అన్నారు. రిజర్వేషన్ స్థానాలు మినహా జనరల్ స్థానాలంటే ఒకే వర్గానికి చెందిన అభ్యర్థుల పేర్లే వినిపించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ముఖ్యంగా వరంగల్ మేయర్ స్థానం జనరల్‌గా మారినప్పుడు ఫలానా రెడ్డి, మరో రెడ్డి అంటూ చర్చ జరగడం ఏమిటని ప్రశ్నించారు. బీసీల నుంచి నాయకులు లేరా? బీసీల్లో సామర్థ్యం ఉన్నవారు లేరా? అని నిలదీశారు. జనరల్ మేయర్ స్థానాన్ని ఈసారి బీసీలకే దక్కేలా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని తెలిపారు. ఓటర్లు తమ ఓట్ల విలువను గుర్తించాలని, డబ్బులు తీసుకుని ఓట్లు వేసే విధానాన్ని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. బీసీలు రాజకీయంగా ఏకమైతే జనరల్ స్థానాల్లోనూ తమ అభ్యర్థులను గెలిపించుకునే శక్తి వస్తుందని అన్నారు.
బీసీల చైతన్యం కోసం బహిరంగ సభ
అక్టోబర్‌లో పరకాలలో బీసీల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సుందర్రాజ్ యాదవ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 8 ప్రాంతాల్లో సభలు నిర్వహించి బీసీలకు రాజకీయ, సామాజిక హక్కులపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. అన్ని పార్టీల్లో ఉన్న బీసీలను కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. బీసీలు ఏ పార్టీలో ఉన్నా వారికి ఎదురవుతున్న సమస్యలు ఒకేలా ఉన్నాయని అన్నారు. బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వకుండా ఎన్నికల సమయంలో మాత్రమే వారిని గుర్తు చేసుకునే విధానం మారాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీల హక్కులపై చర్చ మొదలైందని, ఈ పరిస్థితిని రాజకీయ ప్రాతినిధ్యంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల ఉద్యమం బలపడితే డబ్బులు లేకుండానే అభ్యర్థులు గెలిచే పరిస్థితి వస్తుందని చెప్పారు. ప్రతి ఇంటి నుంచి బీసీ నినాదం మొదలుకావాలని, ప్రతి కుటుంబం తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగాలు, విద్యకు ఓబీసీ కార్యాచరణ
బీసీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అక్టోబర్ 9న మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సహకారంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని సుందర్రాజ్ యాదవ్ తెలిపారు. ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో బీసీలకు అవకాశాలు కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. బీసీ యువతకు కేవలం రాజకీయ నినాదాలు సరిపోవని, విద్యా, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా యువతను ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బీసీలు ఆర్థికంగా ఎదగాలంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఓబీసీ సంస్థ ద్వారా బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఉపాధి అవకాశాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. బీసీలు ఉన్నత స్థాయికి ఎదగకుండా అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు సామాజిక ఐక్యత అవసరమన్నారు. ఓసీలు తమకు శత్రువులు కాదని, అయితే బీసీలకు దక్కాల్సిన అవకాశాలను ఇతరులు ఆక్రమించకూడదని స్పష్టం చేశారు.
ఈడబ్ల్యూఎస్, ఆదాయ పరిమితులపై ప్రశ్నలు
బీసీలకు, ఓసీలకు పేదరికాన్ని నిర్ణయించే ఆదాయ పరిమితుల్లో తేడా ఎందుకు ఉందని సుందర్రాజ్ యాదవ్ ప్రశ్నించారు. బీసీలకు రూ.1.50 లక్షల ఆదాయం లోపు ఉంటే పేదలుగా పరిగణిస్తున్నారని, ఓసీలకు రూ.8 లక్షల ఆదాయం లోపు ఉంటే పేదలుగా పరిగణించడం ఏ విధమైన న్యాయమని నిలదీశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలోనూ రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కారణంగా బీసీల ఉద్యోగ అవకాశాలకు నష్టం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలంటే విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సి ఉందన్నారు. బీసీల ఓట్లను తీసుకుని వారికి సీట్లు ఇవ్వకపోవడం సరైన విధానం కాదని చెప్పారు. పార్టీలన్నీ తాము బీసీలకు అనుకూలమా, వ్యతిరేకమా ముందుగానే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
నగర అభివృద్ధికి మంచి విజన్ కావాలి
వరంగల్ నగరానికి అభివృద్ధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయని సుందర్రాజ్ యాదవ్ అన్నారు. అయితే వాటిని వినియోగించుకునేందుకు స్పష్టమైన ప్రణాళిక, దాన్ని అమలు చేసే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. కుడా ద్వారా మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో ఇళ్లు అందించవచ్చని తెలిపారు. నగరానికి బయట అపార్ట్మెంట్లు నిర్మించి రూ.30 లక్షల లోపు ధరలకు అందిస్తే మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కుడా పరిధిలోని ప్రైవేట్ భూములను అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ స్థలాలను కూడా వినియోగించుకోవాల్సి ఉందన్నారు. సరైన ప్రణాళికతో పనిచేస్తే ఒక్క పశ్చిమ నియోజకవర్గానికే రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలిపారు. కుడా ద్వారా వచ్చే ఆదాయంలో 75 శాతం స్థానికంగానే ఖర్చు చేయాలనే నిబంధన ఉందన్నారు. భూముల మార్టిగేజ్ చార్జీలు వసూలు చేస్తే కుడాకు భారీ ఆదాయం వస్తుందని చెప్పారు. తన హయాంలో పలువురికి నోటీసులు ఇచ్చినా ఆ అంశం తర్వాత నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు.
ఐటీ , టూరిజంతో ఉపాధి అవకాశాలు
వరంగల్‌లో ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో తాను పనిచేశానని సుందర్రాజ్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ ఐటీ కేంద్రంగా ఎదగాలని భావించానన్నారు. అమెరికా పర్యటనలో 13 కంపెనీలతో చర్చించి వరంగల్‌లో సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఒప్పించానని చెప్పారు. మడికొండలో ఐటీ రంగానికి కేటాయించిన స్థలం చుట్టూ పారిశ్రామిక ప్రాంతం ఉండటంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. నగర కేంద్రంలోని ప్రభుత్వ స్థలాల్లో ఐటీ టవర్లు నిర్మించి కంపెనీలకు కేటాయిస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేవని చెప్పారు. ప్రస్తుతం వరంగల్ యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. దేవునూరు గుట్టల్లోని 5 వేల ఎకరాల్లో పర్యాటక అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని, డిస్నీల్యాండ్ తరహా ప్రాజెక్టును తీసుకురావాలనుకున్నామని తెలిపారు. ఇందుకోసం 500 ఎకరాలు కుడా కేటాయించేందుకు సిద్ధమని లేఖ ఇచ్చిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేస్తే వరంగల్ ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
తండ్రి మాటే జీవితానికి బాట
1970 జనవరి 1న వడ్డేపల్లిలో జన్మించిన సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ తన కుటుంబ నేపథ్యాన్ని చిట్‌చాట్‌లో వివరించారు. తల్లిదండ్రులు లక్ష్మీరాజం, వరలక్ష్మీ దంపతుల పది మంది సంతానంలో తానే చివరివాడినని తెలిపారు. తండ్రి ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారని, చదువుపై ఎంతో మక్కువ ఉండేదని చెప్పారు. కుటుంబంలోని అందరికీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయించారని, ఆడపిల్లలను చదివించేందుకు వెనుకాడిన కాలంలోనే తన రెండో అక్కను సివిల్స్ రాయించారని గుర్తుచేశారు. తండ్రి లాహోర్‌లో చదువుకున్నారని, స్వాతంత్య్రం అనంతరం కుటుంబం వరంగల్‌లో స్థిరపడిందన్నారు. రూ.10 వేల ఫీజు చెల్లించలేక హైదరాబాద్‌లో డిగ్రీలో చేరానని, అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ, కేయూలో ఎంబీఏ, పీహెచ్డీ పూర్తి చేశానని తెలిపారు. 1991లో రూ.1,200 మొదటి జీతంతో ఉద్యోగ జీవితం ప్రారంభమైందన్నారు. తండ్రి భీమారంలోని ఇల్లు అమ్మి ఇచ్చిన రూ.1.50 లక్షలతో కంప్యూటర్ శిక్షణా కేంద్రానికి బీజం పడిందని చెప్పారు. 1992లో మాస్టర్జీ ఇన్స్టిట్యూట్స్ ప్రారంభమైందని, ప్రొఫెసర్ జయశంకర్ ప్రోత్సాహంతో విద్యా రంగంలోకి అడుగుపెట్టానన్నారు. 2001 నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, 2009 నుంచి మాస్టర్జీ వేదికగా ఉద్యమ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. 2015, 2021లో ఎమ్మెల్సీ అవకాశాలు చేజారాయని, కుడా చైర్మన్, మేయర్ పదవులపై హామీలు వచ్చినా అమలు కాలేదని చెప్పారు. అయినప్పటికీ ప్రజా జీవితం, బీసీ ఉద్యమం, వరంగల్ అభివృద్ధి కోసం తన ప్రయాణం కొనసాగుతుందని సుందర్రాజ్ యాదవ్ స్పష్టం చేశారు.

