32.5 C
Hyderabad
Homeతెలంగాణవాడగూడెం ఇసుక‌ ర్యాంపులో ఇష్టారాజ్యం

వాడగూడెం ఇసుక‌ ర్యాంపులో ఇష్టారాజ్యం

– డీడీతో ప‌నిలేదు.. ప్ర‌త్యేక చార్జీలు చెల్లించాల్సిందే
– ఆన్‌లైన్‌ బుకింగ్‌.. బిల్లులు చెల్లించినా అదనపు వసూళ్లు
– లారీకి రూ.3 వేల నుంచి రూ.3,500.. డబ్బిస్తేనే లోడింగ్‌?
– ఓవర్‌లోడ్‌, నకిలీ వేబిల్లులు.. రాత్రివేళల్లోనూ రవాణా?
– టీజీఎండీసీకి ఫిర్యాదులు చేసినా స్పందన ఏది?
– నిబంధనలు కాగితాలకేనా.. అధికారుల పర్యవేక్షణ ఏమైంది?

అక్ష‌రశ‌క్తి, నిఘా ప్ర‌తినిధి : ఇసుకను అక్రమంగా తరలించకుండా, నిర్ణీత ధరకు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన విధానానికే తూట్లు పొడుస్తున్నారా..? ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌చేసి, నిబంధనల ప్రకారం బిల్లులు చెల్లించిన లారీ యజమానుల నుంచి మళ్లీ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారా..? ఓవర్‌లోడ్‌, నకిలీ వేబిల్లులు, రాత్రివేళల్లో రవాణా, నదీ గర్భంలో యథేచ్ఛగా తవ్వకాలు.. ఇలా ఇసుక ర్యాంపుల్లో సాధారణంగా వినిపించే అక్రమాల ఆరోపణలన్నీ ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడెం ఇసుక ర్యాంపులోనూ వినిపిస్తున్నాయి. ఒక్కో లారీకి రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలకు తోడు, ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడమే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఆన్‌లైన్‌ బుకింగ్‌.. ఆపై అదనపు బాదుడు

ప్రభుత్వ విధానం ప్రకారం ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని, నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన అనంతరం రవాణా చేయాలి. ఇసుక కొనుగోలుదారుడికి రవాణా కోసం రవాణా పాస్‌ లేదా వేబిల్‌ జారీ చేయాలి. వాహన సామర్థ్యానికి అనుగుణంగానే ఇసుక లోడింగ్‌ చేయాలి. ప్రభుత్వ నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా వాడగూడెం ర్యాంపులో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకుని, బిల్లులు చెల్లించిన తర్వాత కూడా లారీ లోడింగ్‌ కోసం అదనంగా రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు చెల్లించాల్సి వస్తోందని లారీ అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. డబ్బులు ఇవ్వకపోతే లోడింగ్‌ ఆలస్యం చేస్తూ రోజుల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారని వాపోతున్నాయి.

ఓవర్‌లోడ్‌కు అడ్డెవరు?

ఇసుక ర్యాంపుల్లో అక్రమాలకు ప్రధాన కారణంగా మారుతున్న ఓవర్‌లోడ్‌ ఆరోపణలు వాడగూడెంలోనూ వినిపిస్తున్నాయి. వాహన ఆర్సీలో ఉన్న అనుమతించిన సామర్థ్యం మేరకే లోడింగ్‌ చేయాల్సి ఉంటుంది. టీజీఎండీసీ కూడా వాహన పాసింగ్‌ సామర్థ్యానికి అనుగుణంగానే లోడింగ్‌ చేయాలని స్పష్టం చేస్తోంది. అయినా ఎక్కువ ఇసుకను తరలిస్తే ఎక్కువ లాభం వస్తుందన్న ఉద్దేశంతో సామర్థ్యానికి మించి లోడింగ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల రహదారులు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలకు కూడా అవకాశం ఏర్పడుతోంది. వాడగూడెం ర్యాంపు పరిధిలో నకిలీ వేబిల్లుల సాయంతో రాత్రివేళల్లో ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇసుక రవాణాకు చెల్లుబాటు అయ్యే రవాణా పాస్‌ తప్పనిసరి. అందులో వాహనం, పరిమాణం, గమ్యస్థానం వంటి వివరాలు ఉండాలి. రవాణాను ఎలక్ట్రానిక్‌ పర్యవేక్షణ, డాక్యుమెంటేషన్‌ ద్వారా పర్యవేక్షించాలన్నది నిబంధన. అయినా రాత్రివేళల్లో అక్రమ రవాణా జరుగుతోందంటే పర్యవేక్షణ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ర్యాంపులోకి ఎన్ని లారీలు వచ్చాయి..? ఎన్ని లోడ్లు వెళ్లాయి..? ఏ వాహనానికి ఎంత ఇసుక కేటాయించారు..? వేబిల్‌లో ఉన్న పరిమాణమే లోడ్‌ చేశారా..? అన్నది పరిశీలిస్తే అసలు వ్యవహారం బయటపడే అవకాశం ఉంది.

ఫిర్యాదులపై టీజీఎండీసీ మౌనం ఎందుకు?

వాడగూడెం ర్యాంపులో అదనపు వసూళ్లపై వీడియో బయటకు వచ్చినా, లారీ యజమానులు, స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు కనిపించకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ర్యాంపుల నిర్వహణ, ఇసుక తవ్వకాలు, లోడింగ్‌, రవాణాపై పర్యవేక్షణ బాధ్యత ఉన్న టీజీఎండీసీ అధికారులు అసలు ఏం తనిఖీలు చేస్తున్నారు? ఫిర్యాదులు అందితే ర్యాంపులోని రికార్డులు, సీసీ కెమెరా దృశ్యాలు, వేబిల్లులు, లారీ లోడింగ్‌ వివరాలను పరిశీలించారా? అదనపు వసూళ్ల ఆరోపణలు నిజమైతే బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ఇసుక విధాన ప్రధాన లక్ష్యాల్లోనే అక్రమ కార్యకలాపాలను అరికట్టడం, ఓవర్‌లోడింగ్‌ను నియంత్రించడం, పారదర్శకతతో ఆన్‌లైన్‌ ఇసుక విక్రయాలు నిర్వహించడం ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఇసుకను ఎలక్ట్రానిక్‌ పర్యవేక్షణలో వెలికితీసి, స్టాక్‌యార్డుకు తరలించే ముందు తూకం లేదా పరిమాణ నిర్ధారణ చేయాలి. కొనుగోలుదారు నిర్ణీత ధర చెల్లించి రవాణా పాస్‌ పొందాలి. స్టాక్‌యార్డు నుంచి వాహనం ఆమోదిత సామర్థ్యం మేరకే లోడింగ్‌ చేయాలి.

నిబంధనల అమలు ఎందుకు లేదు?

ప్రభుత్వమే ఇసుక ర్యాంపుల్లో అక్రమాలను అరికట్టడం, ఓవర్‌లోడింగ్‌ను నియంత్రించడం, పారదర్శకత పెంచడం తమ విధాన లక్ష్యాలని చెబుతోంది. మరి వాడగూడెంలో అదనపు వసూళ్లు, ఓవర్‌లోడ్‌, నకిలీ వేబిల్లులు, అక్రమ రవాణా ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? ర్యాంపులో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎలా ఉంది? రోజువారీగా లోడింగ్‌, వేబిల్‌, లారీ వివరాలను ఎవరు తనిఖీ చేస్తున్నారు? ప్రభుత్వ ధరకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయకూడదనే నిబంధనకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ఎలాంటి విచారణ జరిగింది? అసలు టీజీఎండీసీ అధికారులకు ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోవడం లేదు? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరిపి ర్యాంపు రికార్డులు, సీసీ కెమెరా దృశ్యాలు, ఆన్‌లైన్‌ బుకింగ్‌ వివరాలు, వేబిల్లులు, వాహనాల బరువులను బహిర్గతం చేస్తేనే వాడగూడెం ర్యాంపులో జరుగుతున్నదేమిటో ప్రజలకు స్పష్టమవుతుంది. లేకపోతే నిబంధనలు కాగితాలకే పరిమితమై.. ర్యాంపులో మాత్రం ఇసుకతో పాటు అక్రమాలూ యథేచ్ఛగా ప్రవహిస్తున్నాయనే విమర్శలకు అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

*అక్రమాలకు టీజీఏండీసీ వత్తాసు…
మరో కథనంలో…

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.