* ప్రజలు, కార్యకర్తలతో ఉండడమే ఇష్టం
* పరకాలలో పార్టీ బలోపేతానికి కృషి చేశా
* డీసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రయాణం
* కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి సొంతం చేసుకుంటుంది
* వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
* హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి
* డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్
అక్షరశక్తి, హన్మకొండ : విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలో 1985లో ఖమ్మం జిల్లాలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐ విభాగంలో పనిచేసిన అనుభవం, కుటుంబంలో మామ చంద్ర శేఖర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉండడం వల్ల రాజకీయ వాతావరణం ఇనగాలకు కొత్త కాదు. 2012లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, అనేక ఆటుపోట్లు ఎదుర్కొని, క్రమశిక్షణ గలిగిన కాంగ్రెస్ సైనికుడిగా ఎదిగానని ఇనగాల వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తలతో ఉంటూ, పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడ పని చెయ్యమని చెప్పినా అక్కడ పూర్తి నిబద్ధతతో పని చేస్తానని, పరకాల కాంగ్రెస్ పటిష్ఠతకు శక్తి వంచన లేకుండా కృషి చేశానని, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ గా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చానని, డీసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రయాణం చేస్తున్న అని చెబుతూ వచ్చే ఎన్నికల నాటికి పార్టీ నుంచి పోటీలో ఉంటా అని అనేక విషయాలను డిజిటల్ మీడియాతో పంచుకున్నారు.
రాజకీయ ప్రస్థానం…
వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఇనగాల వెంకట్రామిరెడ్డి 2012లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో 2014లో పరకాల బరిలో దిగారు. అప్పుడు అక్కడ నాకు సరైన కేడర్ లేకున్నా 35 వేల ఓట్లను సాధించగలిగాను. అయినా నిరుత్సాహ పడకుండా పార్టీ కోసం పని చేశాను. ప్రతీ గ్రామం తిరుగుతూ పార్టీ పటిష్ఠతకు శక్తి వంచన లేకుండా పని చేశానని అన్నారు. నియోజక వర్గంలో పార్టీ తరపున 40 వేల సభ్యత్వాలను నమోదు చేయించాను. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం, బలమైన కార్యకర్తలను తయారు చేసుకోవడానికి వారితో కలిసి తిరిగాను. 2018లో కొండా సురేఖ మళ్ళీ కాంగ్రెస్ కి రావడంతో అప్పటి రాజకీయ సమీకరణాలు, అధిష్ఠానం ఆదేశాల మేరకు పని చేస్తూ వచ్చాను. దానికి గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మెన్ గా, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడిగా ప్రజలకు మంచి అవకాశాన్ని పార్టీ కల్పించిందని అన్నారు.
ప్రజలకు సేవ చెయ్యడం కోసమే ట్రస్ట్….
పార్టీలో పని చేస్తున్నప్పుడు ప్రజలకు, కార్యకర్తల కుటుంబాలకు సేవ చెయ్యడమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. “ఇనగాల చారిటబుల్ ట్రస్ట్” ద్వారా చేసిన సేవలకు నాకు ప్రజల్లో మంచి గుర్తింపు లభించింది అని అన్నారు. ట్రస్ట్ ద్వారా ఎనిమిది ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించాం. అనారోగ్యం, ఆపద వచ్చినప్పుడు అర్ధరాత్రి అయినా అందుబాటులోకి వస్తాను. పరకాల నియోజక వర్గంలో చాలా మందికి వైద్య సేవలు అందించాము. ప్రతీ నెల ప్రజల ఇండ్లలో జరిగే ఫంక్షన్ లకు, విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు.
2025 లో ఎంజీఎం వైద్య సేవల కోసం కోటి రూపాయలు అందించారు. ఇప్పుడు పరకాలలో డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి తెచ్చేందుకు నా వంతుగా 50 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
కుడాకు ఆదాయం సమకూర్చా…
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ గా నగర అభివృద్ధి కోసం చేసిన పని సంతృప్తినిచ్చింది. అనేక రకాల స్కీమ్ లు ప్రవేశపెట్టాను. రైతులను ఒప్పించి స్వచ్ఛందంగా భూములు సేకరించడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా 225 ఎకరాల భూమి తీసుకోవడం వల్ల కుడాకు సుమారు నాలుగు వందల నుండి ఐదు వందల కోట్ల ఆదాయం లభించింది.
రాహుల్ గాంధీ విజన్ తో ముందుకు…
ఎలాంటి రికమండేషన్ లేకుండా డీసీసీ అధ్యక్షుడిగా పదవి లభించింది. సంఘటన్ సృజన్ అభియాన్ లో రాహుల్ గాంధీ విజన్ ప్రకారం నన్ను అధ్యక్షుడిని చేశారు. వారి నమ్మకాన్ని నిలబెట్టడం కోసం కలెక్టివ్ లీడర్షిప్ చేస్తూ కార్యకర్తలను ఒక్కటి చేసే ప్రయత్నాలు జరిగాయి. 13 మండలాల్లో ప్రతీ గ్రామంలో బూత్ కమిటీలు, మండల కమిటీలు వేసి వారి రిపోర్టులను పార్టీ వెబ్ సైట్ లో ఈ నెల 31లోగా పొందుపరిచే ప్రణాళిక సిద్ధం చేశాను. కాంగ్రెస్ లో యువతకు అవకాశాలు ప్రాధాన్యం ఇవ్వాలన్న రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారం పార్టీ కోసం పని చేసిన యువతకు పదవులు ఇస్తున్నాం. అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ లో అందరినీ సంతృప్తి పరచలేము, విమర్శలు సాధారణమే అని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి సొంతం చేసుకోవడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ లో స్వంతంగా 46 నుండి 48 సీట్లు గెలుచుకుంటామని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా…
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటి చేస్తానని, ఎమ్మెల్యే రేసులో ఉన్నానని స్పష్టం చేస్తున్నారు. పరకాల నుండి మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తాడని ముఖ్యమంత్రి చెప్పాడు కదా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అది వ్యూహాత్మక ప్రకటన అని స్పష్టం చేశారు. పరకాలలో ముఖ్యమంత్రి అధికారిక సభ కాబట్టే వెళ్లలేదని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపాడు. ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణలు, డీ లిమిటేషన్ లో నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుందని తెలిపారు. అప్పుడు ఇనగాల అనే వ్యక్తి ఖచ్చితంగా పోటీలో ఉంటాడని స్పష్టం చేశారు.
