26.2 C
Hyderabad
Homeతెలంగాణమ‌హ‌బూబాబాద్ స‌బ్‌డివిజ‌న్‌ను ట్రాన్స్‌కో వరంగల్ సర్కిల్‌లోనే కొనసాగించాలి

మ‌హ‌బూబాబాద్ స‌బ్‌డివిజ‌న్‌ను ట్రాన్స్‌కో వరంగల్ సర్కిల్‌లోనే కొనసాగించాలి

📰 Generate e-Paper Clip

* ఒకరిద్దరి స్వలాభం కోసం కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు

* ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్‌ చొరవ తీసుకోవాలి

* సబ్‌స్టేషన్ల విభజనతో పెరిగిన పనిభారం

* రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని కలిసిన కార్మికులు

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లను వరంగల్ సర్కిల్‌లోనే కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఒకరిద్దరి స్వలాభం కోసం మహబూబాబాద్ జిల్లా కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయంలో ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. గత ఏడాది ట్రాన్స్‌కో వరంగల్ జోన్ పరిధిలో అధికారుల ప్రమోషన్లకు అనుకూలంగా జనగామ సర్కిల్‌ను ఏర్పాటు చేసిన సమయంలో మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని సబ్‌స్టేషన్లను జనగామ సర్కిల్‌లో విలీనం చేశారని కార్మికులు తెలిపారు. అప్పట్లోనే కార్మిక సంఘాలు, ఉద్యోగులు తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా విభజన చేశారని ఆరోపించారు. మహబూబాబాద్‌కు జనగామ భౌగోళికంగా దూరంగా ఉండటంతో ఉద్యోగులు, సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

వరంగల్‌లోనే కొనసాగించాలి

మహబూబాబాద్ జిల్లాకు చెందిన సబ్‌స్టేషన్లు, సబ్‌డివిజన్‌ను వరంగల్ సర్కిల్ పరిధిలోనే కొనసాగించాలని కార్మికులు కోరుతున్నారు. ఒకవేళ జనగామ సర్కిల్‌ను కొనసాగించాల్సిన పరిస్థితి ఉంటే దానిని హనుమకొండ సర్కిల్‌గా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే వరంగల్ ప్రాంతంలో విద్యుత్ సంస్థకు అవసరమైన కార్యాలయాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని, జనగామలో కొత్తగా కార్యాలయాలు నిర్మించాల్సి వస్తే సంస్థపై అదనపు ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. ఉన్న వసతులను వినియోగించుకోవడం ద్వారా సంస్థకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

సిబ్బంది కొరత.. పెరిగిన పనిభారం

జనగామ, మహబూబాబాద్ ప్రాంతాల్లో లైన్స్, మెయింటెనెన్స్ విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని కార్మికులు తెలిపారు. పది మంది పనిచేయాల్సిన చోట ప్రస్తుతం ఆరుగురితోనే రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మరోవైపు వరంగల్ నుంచి వివిధ లైన్లను జనగామ, మహబూబాబాద్ ప్రాంతాలకు అనుసంధానం చేయడంతో సిబ్బందిపై పనిభారం మరింత పెరిగిందన్నారు. గతంలో మహబూబాబాద్‌లో పనిచేసిన సిబ్బందిలో పలువురు వరంగల్‌కు వెళ్లిపోవడంతో స్థానికంగా మానవ వనరుల కొరత ఏర్పడిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మహబూబాబాద్‌ను జనగామ సర్కిల్‌లో కలపడం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదని పేర్కొన్నారు.

ఎంపీ వేం నరేందర్‌రెడ్డికి వినతి

మహబూబాబాద్ సబ్‌డివిజన్‌ను వరంగల్ సర్కిల్‌లోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కార్మికులు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తమ జిల్లాను జనగామ సర్కిల్‌లో ఎలా కలుపుతారని ఎంపీని ప్రశ్నించారు. సమస్యను ట్రాన్స్‌కో సీఎండీ దృష్టికి తీసుకెళ్లినట్లు కార్మికులకు తెలిపారు. అవసరమైతే జనగామ సర్కిల్‌ను మహబూబాబాద్‌కు బదిలీ చేసేలా కూడా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు కార్మికులు వెల్లడించారు. కార్మికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్, వరంగల్ చీఫ్ ఇంజినీర్ సమన్వయంతో తగిన ప్రతిపాదనలు పంపించి మహబూబాబాద్‌ను వరంగల్ సర్కిల్‌లోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మ‌హ‌బూబాబాద్ జిల్లా జేఏసీ చైర్మ‌న్ శ్రీకాంత్, ఇస్మాయిల్, విద్యాసాగర్, కాసిం తదితరులు, మహబూబాబాద్ జిల్లా కార్మికులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.