28.8 C
Hyderabad
Homeప్రత్యేకంఓ(గో)ల్డ్ ఫ్రెండ్....!

ఓ(గో)ల్డ్ ఫ్రెండ్….!

ఓ(గో)ల్డ్ ఫ్రెండ్….!!

 

చిన్ననాటి సర్కారు బడిలో చదివిన ఒక తరం జ్ఞాపకాలు ప్రకృతికి హాని చెయ్యని, చెదలు పట్టని సంచిలో మూటకట్టి ఉన్నాయి. వాటిలో ఉండే

గవర్నమెంటు పుస్తకాలను తడిమి చూసినప్పుడు ఇన్ని పాఠాలా అని బరువుగా నిట్టూర్చిన రోజు, నిమ్మ పిప్పారమెంటు దాచుకున్న సంచి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. జుబ్బల సంచి మెడకేసుకొని, మొదటి బడి గంట కొట్టక ముందే తొందరపడి బయలుదేరిన మిత్రతరం మనదే కదా!!

 

స్నేహితులతో కలిసి ఇంటి నుండి బడికి వెళ్తూ చెప్పుకున్న ముచ్చట్లు, ప్రతీ ఊళ్ళో  సందు సందులో ఉన్న ఇంటిని గమనిస్తూ, ఆగిన బస్సులో ప్రయాణీకులను తీసుకొని పోయినట్లు, దోస్తుగాన్ని తోడుకొని బడికి పోవడం కాన్వెంటు, కాంక్రీటు విద్యార్థులకు తెలవని గొప్ప అనుభవం…..!

 

బడి గంట కొట్టగానే దోస్తులతో కలిసి తిన్న

పుల్ల ఐస్క్రీమ్, పల్లీ పట్టి, బూరు మిఠాయి, బొంబాయి మిఠాయి గడియారం,నిమ్మ పిప్పారమెంటు,బఠాణీ, “ఆశ” పెట్టే ఐదు పైసల చాక్లెట్లు కల్తీ లేని క్లాస్ మేట్ లు. అవే మాకు పిజ్జాలు, బర్గర్లు, బ్రేక్ ఫాస్ట్ లు……!

 

బజార్లో బాతాఖానీ, గోళీలాట, తొక్కుడుబిళ్ళ మర్చిపోలేదు. చింత గింజల ఆటల్లో, అష్టా చెమ్మా ఆటల్లో తొండి చేసిన దోస్తు బెండు తీసినా, కొట్లాటకు పోయి దెబ్బలుతిన్నా,

తెల్లారి కలిసిపోయేలా అపర చాణక్యం ప్రదర్శించే నేస్తం ఒకడు ఉండేటోడు. దోస్తులను

విడదీయడానికి వాట్సప్ లు, ఫేస్ కు మాస్కులు వేసుకునే ఫేస్ బుక్ ఫ్రెండ్స్ అప్పుడు లేకుండే…..!!

 

బడికి సెలవు వస్తే, చెడ్డి దోస్తుతో చేసిన హంగామా ఊరంతా తిరిగే అంబారీ ఎక్కినంత సంబరం.

పచ్చని పసిరిక చేలల్లో చేరి ఆడిన పతంగులు, చిర్రగోనె,  టైరు బండి ఆటలు తిరిగి రాని బ్లాక్ అండ్ వైట్ అనుభవాలు.

గ్రామీణ సంపదలో, మట్టి మనుషుల్లో  పెరిగిన బాల్యం, నిప్పుల కొలిమిలో కాల్చుకు తిన్న తాటిపండు అంతటి తియ్యటి జ్ఞాపకాలు అవి……!

 

ఇప్పటి వరకూ మీతో ఉన్న ప్రతీ ఒక్క ఓ(గో)ల్డ్ ఫ్రెండ్ కి ఈ పదాలు అంకితం.

#(G)oldfriend

#Happyfriendship day

డా. పల్లె రవి వంశీ మోహన్

ఎడిటర్ అండ్ ఎండీ

అక్షరశక్తి.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.