28.8 C
Hyderabad
Homeతాజా వార్తలునేరాల అదుపు కోసం పోలీసు వ్యవస్థలో సంస్కరణలు

నేరాల అదుపు కోసం పోలీసు వ్యవస్థలో సంస్కరణలు

-డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణకు బహుముఖ వ్యూహాలు

-డీజీపీ సీవీ ఆనంద్

అక్షరశక్తి, హనుమకొండ: తెలంగాణ రాష్ట్రంలో సవాల్‌గా మారిన డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణకు పలు సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా నిట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాల పర్యటన చేస్తున్నానని సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో వరంగల్ రూరల్ ఏసీపీగా పనిచేసిన తనకు ఈ ప్రాంతంతో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. 30 ఏళ్ల క్రితం నక్సల్స్‌ ప్రభావం తీవ్రంగా ఉండేదని, ప్రతి గ్రామంలో సుమారు 50 మంది సాయుధ మిలిటెంట్లు ఉండేవారని తెలిపారు. ల్యాండ్‌మైన్‌ దాడులు కూడా జరిగేవని చెప్పారు. ప్రస్తుతం నక్సల్స్‌, మావోయిజం ప్రభావం లేదని, పోలీసుల కూంబింగ్‌ ఆపరేషన్లతో మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. బస్తర్‌, కర్రిగుట్ట ప్రాంతాల్లో ప్రధాన నాయకులు లొంగిపోయారని తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టులు, జనజీవన స్రవంతిలో కలిసిన వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని డీజీపీ చెప్పారు. సోమవారం ములుగులో లొంగిపోయిన మావోయిస్టులతో ఆరోగ్య కార్డులు, ఇతర సౌకర్యాల కల్పనపై చర్చిస్తామని తెలిపారు. మావోయిస్టుల దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు భూమి కేటాయింపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ‘టీజీ వీర్’ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయని డీజీపీ తెలిపారు. వీటి నియంత్రణ కోసం ఈగల్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలను ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. వరంగల్‌లో సైబర్‌ నేరాల నియంత్రణకు పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని, సైబర్‌ నేరగాళ్లను పట్టుకోవడంతో పాటు బాధితులు కోల్పోయిన డబ్బును తిరిగి ఇప్పించేందుకు పోలీసు బృందాలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయని తెలిపారు.

డ్రగ్‌ పెడ్లర్లను పట్టుకునేందుకు సమర్థవంతమైన బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, చిన్నపిల్లలకు చాక్లెట్లలో డ్రగ్స్‌ కలిపి ఇవ్వడాన్ని కూడా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. గత రెండు నెలలుగా సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీసు వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావడంతో పాటు అవినీతి నిరోధక, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలను మరింత బలోపేతం చేస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. నేరాల కట్టడికి అన్ని విధాలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వరంగల్ పోలీసు కమిషనర్ శ్వేత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.