32.5 C
Hyderabad
Homeతాజా వార్తలుగిరిజ‌న గురుకులాలో టెండ‌ర్లు ఖ‌రారు.. ర‌ద్దు!

గిరిజ‌న గురుకులాలో టెండ‌ర్లు ఖ‌రారు.. ర‌ద్దు!

– ఆహార‌ప‌దార్థాల స‌ర‌ఫ‌రా, కేట‌రింగ్‌, స్వీపింగ్‌, శానిటేష‌న్ టెండ‌ర్లు
– 2026-27 ఏడాదికిగాను టెండ‌ర్లు వేసింది మెజార్టీగా గిరిజ‌నులే..
– ఆర్సీవో ఆఫీస్‌లో జూలై ఒక‌టో తేదీన ఖారారు..
– ర‌ద్దు చేశామంటూ నెల త‌ర్వాత‌ స‌మాచారం
– గిరిజ‌నుల‌కు తీవ్ర అన్యాయం
– ర‌ద్దు చేయ‌డంపై అనేక అనుమానాలు
– అనేక ఏళ్లుగా దందా చేస్తున్న వారికోస‌మేనంటూ ఆరోప‌ణ‌లు
– వివాదాస్ప‌దంగా అధికారుల తీరు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఏటూరునాగారం ఐ.టి.డి.ఏ ప‌రిధిలో 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఉన్న గిరిజన సంక్షేమ‌ గురుకుల విద్యాలయాలకు ఆహారపదార్థాలు ( పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్) సరఫరా చేయ‌డానికి, కేటరింగ్, స్వీపింగ్, శానిటేషన్‌కు సంబంధించిన టెండ‌ర్లు అనూహ్యంగా ర‌ద్దు చేయ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టెండ‌ర్లు ఖ‌రారు చేసి, టెండ‌రుదారుల‌కు గురుకుల పాఠ‌శాల‌లు కేటాయించిన అనంత‌రం ఒక్క‌సారిగా టెండ‌ర్లు ర‌ద్దు చేశామంటూ స‌మాచారం ఇవ్వ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయని, నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా టెండ‌ర్లు వేశామ‌ని, త‌మ‌ను ఎంపిక చేశార‌ని, తీరా.. ఇప్పుడు టెండ‌ర్లు ర‌ద్దు చేశామ‌ని చెప్ప‌డం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. గిరిజ‌నుల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

9 గురుకులాల‌కు టెండ‌ర్లు..

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప‌రిధిలో ఉన్న గిరిజ‌న సంక్షేమ గురుకుల విద్యాల‌యాలు TGTWURJC (G) Hanamkonda, COE Warangal, TGTWRCOE Yakubpura, TGTWURJC (G) Parvathagiri, TGTWURJC (B) Narsampet, TGTWRJC (G) MC Pally, Sainik School Ashoknagar, TGTWURJC (G) Palakurthy, TGTWRDC (W) Janagaonతోపాటు త‌దిత‌ర గురుకులాల‌కు సంబంధించి జూన్‌ 18న టెండ‌ర్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. టెండర్ దరఖాస్తులు 19.06.2026 నుండి 30.06.2026కు స్వీక‌రించారు. హ‌న్మ‌కొండ‌లోని ప్రాంతీయ స‌మ‌న్వ‌య అధికారి (ఆర్సీవో) కారాలయంలో జూలై 1వ తేదీన‌ జిల్లా కొనుగోలు క‌మిటీ స‌మ‌క్షంలో టెండ‌ర్లు తెరిచి ఖ‌రారు చేశారు. నియమ నిబంధనలకు లోబ‌డి టెండ‌ర్ వేసిన వారికి గురుకులాలు కూడా కేటాయించారు. తీరా.. ఇప్పుడు మీ ద‌గ్గ‌ర‌ త‌గిన ప‌త్రాలు పాన్ నంబ‌ర్‌, జీఎస్టీ నంబ‌ర్‌, ఫుడ్ సేఫ్టీ, లేబ‌ర్ లైసెన్స్ లేవు.. రెండ‌ర్లు ర‌ద్దు అయ్యాయి.. అంటూ అధికారులు స‌మాచారం ఇస్తున్నారని టెండ‌ర్‌దారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈసారి గిరిజ‌నులే అధికం…

గిరిజ‌న సంక్షేమ గురుకుల విద్యాల‌యాల‌కు ఆహారపదార్థాలు (పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్) సరఫరా చేయ‌డానికి, కేటరింగ్, స్వీపింగ్, శానిటేషన్‌కు సంబంధించిన టెండ‌ర్లు ఈసారి మెజార్టీగా గిరిజ‌నులే దాఖ‌లు చేశారు. నియ‌మ‌నిబంధ‌న‌ల ప్ర‌కారం.. మొద‌టి ప్రాధాన్య‌త గిరిజ‌నుల‌కు, ఆ త‌ర్వాత గిరిజ‌నేత‌రుల‌కు ఇవ్వాల్సి ఉంటుంది. గిరిజ‌నులు టెండ‌ర్లు దాఖ‌లు చేయ‌నిప‌క్షంలోనే ఇత‌రుల‌కు అవ‌కాశం ఇవ్వాల్సి ఉంటుంది. గ‌తంలో గిరిజ‌నుల‌కు అవగాహ‌న లేక‌పోవ‌డంతో మెజార్టీగా గిరిజ‌నేత‌రులే టెండ‌ర్లు వేసి, ద‌క్కించుకున్నారు. వారే ప్ర‌స్తుతం ఆహార‌ప‌దార్థాలు ( పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్) సరఫరా చేయ‌డానికి, కేటరింగ్, స్వీపింగ్, శానిటేషన్‌కు సంబంధించిన కాంట్రాక్టులు చేస్తున్నారు. అయితే.. ఈసారి 2026-27 ఏడాదికి సంబంధించి నిర్వ‌హించిన‌ టెండ‌ర్లు మెజార్టీగా గిరిజ‌నులే దాఖ‌లు చేశారు. జూలై ఒక‌టో తేదీన టెండ‌ర్లు కూడా ఖ‌రారు చేశారు. సుమారు నెల రోజుల త‌ర్వాత టెండ‌ర్లు ర‌ద్దు అయ్యాయి అంటూ.. ఆర్సీవో చెబుతున్నార‌ని టెండ‌ర్‌దారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

టెండ‌ర్ల ర‌ద్దుపై అనేక అనుమానాలు..

టెండ‌ర్లు ర‌ద్దు చేయ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న గిరిజ‌నేత‌ర‌ టెండ‌ర్‌దారుల‌ను కొన‌సాగించేందుకే ఈ టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేశార‌ని, ఈసారి గిరిజ‌నులే మెజార్టీగా టెండ‌ర్లు వేయ‌డంతో అడ్డుకునేందుకు కొంద‌రు కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే పాన్ నంబ‌ర్‌, జీఎస్టీ నంబ‌ర్‌, ఫుడ్ సేఫ్టీ, లేబ‌ర్ లైసెన్స్ లేవనే అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నార‌ని, గ‌తంలో ఉన్న టెండ‌ర్‌దారుల‌కు కూడా ఆ ప‌త్రాలు లేవ‌ని, మ‌రి వారిని ఎలా కొన‌సాగిస్తున్నార‌ని ప్ర‌స్తుతం టెండ‌ర్లు వేసిన గిరిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు. గిరిజ‌న గురుకుల విద్యాల‌యాల టెండ‌ర్ల‌లో అనేక ఏళ్లుగా కొంద‌రు గిరిజ‌నేత‌రులు దందా చేస్తున్నార‌ని, వారికి అధికారులు స‌హ‌క‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.