28 C
Hyderabad
Homeతాజా వార్తలువిద్యార్థులు మొక్కలను దత్తత తీసుకుని కాపాడాలి

విద్యార్థులు మొక్కలను దత్తత తీసుకుని కాపాడాలి

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

*కాకతీయ వైద్య కళాశాలలో ఘనంగా మెగా ప్లాంటేషన్

అక్షరశక్తి,వరంగల్:విద్యార్థులు ఒక్కొక్కరు ఒక మొక్కను దత్తత తీసుకొని సంరక్షించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ వైద్య కళాశాల (కేఎంసి) వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో మెగా ప్లాంటేషన్ (వన మహోత్సవం) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డా. కస్తూరి శ్రీధర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, తదితరులు కలిసి మొక్కలు నాటారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వృక్షో రక్షతి రక్షితః అనే భావనతో మొక్కలను కాపాడితే అవే మనలను కాపాడతాయని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను దత్తత తీసుకుని, దానికి క్రమం తప్పకుండా నీరు పోసి సంరక్షించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తాము వైద్య కళాశాలలో ఐదేళ్లు చదువు పూర్తి చేసే సమయానికి, తాము దత్తత తీసుకున్న మొక్క కూడా ఐదేళ్ల పాటు పెరిగి పెద్దదిగా మారేలా బాధ్యత తీసుకోవాలని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించడంతో పాటు అనేక వ్యాధులను నివారించేందుకు కూడా దోహదపడుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించడం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. పెద్ద సంఖ్యలో మొక్కలను ఉచితంగా అందించి కార్యక్రమానికి సహకరించిన అటవీ శాఖ అధికారులను అభినందించారు.

 

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ కాకతీయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కళాశాలతో ఇంత బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ, కళాశాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారునగరంలో భవిష్యత్తులో బహిరంగ ప్రదేశాలు తగ్గిపోయే పరిస్థితుల్లో కళాశాల ప్రాంగణం నగరానికి కీలకమైన గ్రీన్ స్పేస్‌ గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించి బతికించడం అంతకంటే ముఖ్యమని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం నాటిన మొక్కలను కనీసం వచ్చే ఏడాది వరకు జాగ్రత్తగా సంరక్షిస్తే వాటి మనుగడ శాతం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.

మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించేందుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు సంబంధిత శాఖలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కాకతీయ వైద్య కళాశాల వంటి విద్యాసంస్థల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను విద్యార్థులు, కళాశాల యాజమాన్యం తీసుకోవాలని అధికారులు సూచించారు.

పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డా. కస్తూరి శ్రీధర్ మాట్లాడుతూ, కాకతీయ వైద్య కళాశాలతో పూర్వ విద్యార్థులకు ఉన్న అనుబంధం, కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే బాధ్యతను ఈ కార్యక్రమం ద్వారా చాటుతున్నామని తెలిపారు. అటవీ శాఖ అధికారులు అందించిన సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. మోహన్ దాస్, ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులు, అటవీ శాఖ అధికారులు, పూర్వ విద్యార్థులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.