24.7 C
Hyderabad
Homeతెలంగాణవైఎస్సారే నాకు అన్న!

వైఎస్సారే నాకు అన్న!

📰 Generate e-Paper Clip

* నేనే పార్టీకి కండువా.. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు

* పదవుల కోసం ఏనాడూ అడగలేదు.. పార్టీ కోసం పనిచేయడమే తెలుసు

* మేయర్‌గా వరంగల్‌ అభివృద్ధికి రూ.178 కోట్ల నిధులు

* ఓటమి తర్వాతే ప్రజలతో బంధం మరింత బలపడింది

* మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేసి ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం

* రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, వరంగల్‌ మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ

* డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్‌చాట్‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : రాజకీయాల్లో పదవుల కోసం పరుగులు పెట్టకుండా.. పార్టీని నమ్ముకుని పనిచేస్తే గుర్తింపు, పదవులు వాటంతట అవే వస్తాయని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, వరంగల్‌ మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, ఒడిదుడుకులను, వరంగల్‌ అభివృద్ధి కోసం చేసిన కృషిని ఆమె డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పంచుకున్నారు. రాజకీయాల్లోకి వస్తానని ఊహించని తాను అనూహ్యంగా పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నికై.. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. చివరకు వరంగల్‌ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తీరును వివరించారు. మేయర్‌గా ఉన్న సమయంలో నగరానికి రూ.178 కోట్ల నిధులు తీసుకొచ్చామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘నాకు అన్నలు లేరు.. వైఎస్సారే నా అన్న’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘నాకు పార్టీ కండువాలు కాదు.. నేనే పార్టీకి కండువా. రాజకీయాల్లో రిటైర్‌మెంట్‌ ఉండదు. ఓపిక ఉన్నంత కాలం కాంగ్రెస్‌ కోసం పనిచేస్తా’’ అని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళలను పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.

కరీంనగర్‌లో బాల్యం.. 19 ఏళ్లకే వివాహం

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం పాతగూడూరు తమ స్వస్థలమని స్వర్ణ తెలిపారు. తండ్రి హన్మంతరావు లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసి, అనంతరం కాంట్రాక్టర్‌గా పనిచేశారని చెప్పారు. తల్లి జయలక్ష్మి. అక్క, చెల్లి, తమ్ముడితో కలిసి కరీంనగర్‌ పట్టణంలో పెరిగానన్నారు. ఇంటర్‌ వరకు కరీంనగర్‌లోనే చదివానని, ఇంటర్‌ సెకండియర్‌లో ఉండగానే వివాహం కావడంతో ఆ తర్వాత చదువును కొనసాగించలేకపోయానని గుర్తు చేసుకున్నారు. అక్క భర్త స్నేహితుడైన వరద రాజేశ్వర్‌రావుతో పరిచయం ద్వారా వివాహ సంబంధం కుదిరిందన్నారు. రాజేశ్వర్‌రావు అప్పట్లో ఏ ఉద్యోగం చేయకపోవడంతో ఇంట్లో కొంత అభ్యంతరం వ్యక్తమైనా, ఆయన మంచివారని చెప్పి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని తెలిపారు. తన తాతకు ఆ సంబంధంపై అభ్యంతరం ఉంటే, ఆయనకంటే ముందే నువ్వే ‘నో’ చెప్పాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే తనకు రాజేశ్వర్‌రావు నచ్చారని, తనను కూడా ఆయనకు నచ్చడంతో వివాహం జరిగిందన్నారు.

రాజకీయాలతో అసలు పరిచయం లేదు..

తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదని స్వర్ణ తెలిపారు. ఆడవాళ్లు గడీల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు. పెళ్లి తర్వాత అత్తింట్లో తనకు ఎంతో గౌరవం లభించిందని చెప్పారు. కోడలిని కూడా కూతురిలాగే చూసుకునే సంప్రదాయం తమ అత్తింట్లో ఉందన్నారు. అత్తమామలు కులశేఖర్‌రావు, లక్ష్మీదేవి తనను సొంత బిడ్డలా చూసుకునేవారని తెలిపారు. వారి వృద్ధాప్యంలో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం వారి బాగోగులు చూసుకునేదాన్నని, మరిది, తోటి కోడలు కూడా ఎంతో మంచిగా చూసుకునేవారని గుర్తు చేసుకున్నారు. అత్తింట్లో తనకు లభించిన గౌరవమే రాజకీయంగా ముందుకు సాగే అవకాశాన్ని కూడా కల్పించిందన్నారు.

రాజకీయ ఓనమాలు నేర్పింది మా వారే..

రాజకీయాల్లోకి రావడం మాత్రం చాలా అనూహ్యంగా, తన ప్రమేయం లేకుండానే జరిగిందని స్వర్ణ తెలిపారు. రాజకీయ ఓనమాలు నేర్పింది తన భర్త వరద రాజేశ్వర్‌రావేనని చెప్పారు. రాజకీయంగా ముందుకు రావడానికి అన్ని విధాలుగా ప్రోత్సహించింది తన మామ కులశేఖర్‌రావేనని తెలిపారు. వరద రాజేశ్వర్‌రావు యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసేవారని చెప్పారు. ఆ సమయంలో సంజయ్‌ గాంధీ వచ్చిన సందర్భంగా అండాల కొద్దీ పులిహోర తయారు చేశానని, దానిని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

అనుకోకుండా పీఏసీఎస్‌ చైర్మన్‌గా..

తాను రాజకీయాల్లోకి వస్తానని ఏనాడూ అనుకోలేదని స్వర్ణ చెప్పారు. వర్ధన్నపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎన్నికలు వచ్చినప్పుడు తన మామ పోటీ చేయాలని సూచించారని తెలిపారు. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో రాజకీయాల్లోకి వస్తే ఎలా అని తొలుత అడిగానని చెప్పారు. అయితే మామ కులశేఖర్‌రావు, భర్త వరద రాజేశ్వర్‌రావు పట్టుబట్టి పోటీ చేయించారని తెలిపారు. ఒక్క రోజు మాత్రమే ప్రచారానికి వెళ్లినా భారీ మెజార్టీతో గెలిచానని చెప్పారు. 1991లో తొలిసారి పీఏసీఎస్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టానని తెలిపారు. అనంతరం రాష్ట్రంలో టీడీపీ హవా నడుస్తున్న కాలంలో ఓడీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పదవికి బరిలో నిలిపారని, ఆ ఎన్నికల్లో కూడా విజయం సాధించానన్నారు. అయితే చైర్మన్‌ కావాల్సిన సమయంలో సొంత పార్టీలోని వ్యక్తే హ్యాండ్‌ ఇవ్వడంతో ఆ పదవి చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చైర్మన్‌గా బీరం సంజీవరెడ్డి గెలిచారని తెలిపారు.

మాది కాంగ్రెస్‌ కుటుంబం..

తమ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్‌తోనే ఉందని స్వర్ణ స్పష్టం చేశారు. అన్ని పార్టీల నాయకులతో వ్యక్తిగతంగా మంచి అనుబంధాలు ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం కాంగ్రెస్‌ను వీడలేదన్నారు. వివిధ పార్టీల నుంచి తమ కుటుంబాన్ని పార్టీలోకి రావాలని ఆహ్వానించినా వెళ్లలేదని తెలిపారు. కేసీఆర్‌ సైతం పార్టీలోకి రావాలని పిలిచారని, అయినా కాంగ్రెస్‌ను వీడలేదన్నారు. “ఎన్ని సమస్యలు వచ్చినా కాంగ్రెస్‌లోనే ఉన్నాం. పదవులు ఉన్నా, లేకున్నా పార్టీతో మా ప్రయాణం కొనసాగింది. జీవితం అంతా కాంగ్రెస్‌ పార్టీతోనే” అని స్పష్టం చేశారు.

తొలి ఎమ్మెల్యే ఎన్నికలు.. 10 వేల ఓట్లతో ఓటమి

1985లో వరద రాజేశ్వర్‌రావుకు ఎమ్మెల్యే టికెట్‌ వచ్చిందని గాంధీభవన్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని స్వర్ణ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో టికెట్‌ అంటే ఏమిటో కూడా పూర్తిగా అర్థం కాలేదన్నారు. వరద రాజేశ్వర్‌రావు అంటే అప్పటికి రాజకీయంగా పెద్దగా ఎవరికీ తెలియదని, కేవలం మాధవరావు మనుమడు అనే గుర్తింపు మాత్రమే ఉండేదన్నారు. ఆ ఎన్నికల్లో సుమారు 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు.

ఓటమి తర్వాతే జనాలతో బంధం..

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజు నుంచే రాజేశ్వర్‌రావు ఉదయం 7 గంటలకు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలవడం ప్రారంభించారని స్వర్ణ తెలిపారు. ప్రతి ఒక్కరినీ పలకరించి, వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారని చెప్పారు. మళ్లీ ఎన్నికలు రాగానే రాజేశ్వర్‌రావుకు టికెట్‌ వచ్చిందన్నారు. అయితే ఆ ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని స్వర్ణ తెలిపారు. ముందుగా బీ-ఫాం ఇచ్చారని, కానీ ఎన్నికలకు ముందు రోజు మాచర్ల జగన్నాథంను అభ్యర్థిగా ప్రకటించారని చెప్పారు. రాజేశ్వర్‌రావు బీ-ఫాంతో నామినేషన్‌ వేయడంతో చేయి గుర్తు కూడా వచ్చిందన్నారు. పార్టీలోనే ఇద్దరు అభ్యర్థులు ఉండే పరిస్థితి రావడంతో చివరకు సుమారు 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. టీ. రాజేశ్వర్ రావు గెలిచారు. ఆ ఎన్నికలతో రాజకీయంగా తీవ్ర దెబ్బ తగిలిందన్నారు.

వైఎస్‌ పిలుపుతో ఎమ్మెల్యే బరిలోకి..

పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్న తమ కుటుంబాన్ని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తించారని స్వర్ణ తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో ఐదు నియోజకవర్గాల సమీక్షను వర్ధన్నపేటలో ఏర్పాటు చేయాలని మా ఆయనకు ఫోన్‌ చేశారని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తన భర్త రాజేశ్వర్‌రావు వైఎస్‌తో కలిసి ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో తనను పిలిచి వచ్చే ఎన్నికల్లో నీకు టికెట్‌ ఇస్తానని, నువ్వే పోటీ చేయాలని వైఎస్‌ చెప్పారని గుర్తు చేసుకున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు పోటీ చేసినా పార్టీకి నష్టం జరుగుతుందని, ఒకవేళ ఓడిపోయినా తాను చూసుకుంటానని వైఎస్‌ భరోసా ఇచ్చారని తెలిపారు. చెప్పినట్లుగానే టికెట్‌ ఇచ్చారని అన్నారు. అప్పటికే దయాకర్‌రావు బలమైన నాయకుడిగా ఉన్నప్పటికీ పోటాపోటీగా ప్రచారం చేశానని స్వర్ణ చెప్పారు. తీగరాజుపల్లిలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో భారీ బహిరంగ సభ నిర్వహించామని, ఇసుకపోస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారని తెలిపారు. ఆ సభను ఫెయిల్‌ చేసేందుకు దాడులు జరిగాయని, తన కుమారులను ఇష్టారాజ్యంగా కొట్టారని ఆరోపించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రత్యర్థి అభ్యర్థి దయాకర్‌రావు చంద్రబాబుతో సమావేశం పెట్టారని, తన ఓటమి కోసం అనేక కుట్రలు జరిగాయని స్వర్ణ ఆరోపించారు. డిపాజిట్‌ ఓట్లు సాధించడమే కష్టమనుకున్న నియోజకవర్గంలో చివరకు కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని తెలిపారు.

మేయర్‌ ప్రకటన.. ఓ యుద్ధమే..

ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని స్వర్ణ చెప్పారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తాను కేవలం కార్పొరేటర్‌గా మాత్రమే పోటీ చేసి గెలిచానని తెలిపారు. అయితే అప్పటికే నగర రాజకీయాల్లో మేయర్‌ పదవిపై తీవ్ర పోటీ నెలకొందన్నారు. పోటీలో ఉన్న ఇద్దరు కీలక నేతల భార్యలు తామే మేయర్‌ అభ్యర్థులమంటూ అప్పట్లో ప్రచారం కూడా చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. తాను మాత్రం ఎక్కడా మేయర్‌ పదవి గురించి ప్రచారం చేయలేదని చెప్పారు. ఎన్నికల తర్వాత తన భర్త వరద రాజేశ్వర్‌రావుతో కలిసి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని కలిశామని తెలిపారు. వైఎస్సార్‌తో తమ కుటుంబానికి ఉన్న సన్నిహిత అనుబంధం, ఆయన చలువతోనే తనకు మేయర్‌ పదవి దక్కిందన్నారు. బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ వైఎస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి తనను మేయర్‌గా చేశారని చెప్పారు. అయితే తనను వరంగల్‌ మేయర్‌గా ప్రకటించిన రోజు మాత్రం మున్సిపాలిటీ వద్ద పెద్ద యుద్ధమే జరిగినంత పరిస్థితి ఏర్పడిందని స్వర్ణ గుర్తు చేసుకున్నారు.

రూ.178 కోట్ల నిధులు..

మేయర్‌గా ఉన్న సమయంలో వరంగల్‌ నగర అభివృద్ధిలో తన కృషి ఎంతో ఉందని స్వర్ణ తెలిపారు. ఎవరూ ఊహించని స్థాయిలో రూ.178 కోట్ల నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ఆ నిధులను తీసుకురావడంలో అప్పటి కేంద్ర మంత్రి దివంగత నేత జయపాల్‌రెడ్డి వంద శాతం సహకరించారని తెలిపారు. ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, విస్తరణ, తాగునీటి సరఫరా, స్లమ్‌ ఏరియాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. తన హయాంలో నగర అభివృద్ధికి సంతృప్తికరంగా పని చేశామని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని సంకల్పించామని చెప్పారు. మహిళలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు.

వర్ధన్నపేటతో ప్రత్యేక అనుబంధం

వర్ధన్నపేట నియోజకవర్గంతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని స్వర్ణ తెలిపారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా తమ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలతో, కార్యకర్తలతో మంచి సంబంధాలు కొనసాగించడమే తమ రాజకీయ బలమన్నారు.

రేవంత్‌తో కలిసి పార్టీ విజయం కోసం..

రేవంత్‌రెడ్డి పాదయాత్ర సమయంలో వరంగల్‌లో తమ కుటుంబాన్ని కలిశారని స్వర్ణ తెలిపారు. తమది కాంగ్రెస్‌ కుటుంబమని, గతంలో తమకు ఉన్న గౌరవం పార్టీకి ఉంటుందని, కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు చివరి అవకాశమని, ఓడిపోతే భవిష్యత్‌ ఉండదని చెప్పి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారని చెప్పారు. ఆయన సూచన మేరకు పార్టీ విజయం కోసం పనిచేశామని తెలిపారు. కరీంనగర్‌లో ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇచ్చినా పార్టీ కోసం పని చేశానన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తాను ఏ పదవీ అడగలేదని చెప్పారు. అయితే తన పనిని గుర్తించి 2023లో వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించారని తెలిపారు.

టికెట్‌ రాకపోయినా నిరాశ పడలేదు..

వరంగల్‌ టికెట్‌ వస్తుందని ఆశించానని స్వర్ణ తెలిపారు. అయితే అనుకోని రాజకీయ పరిణామాల్లో కొండా సురేఖ రావడంతో ఆమెకు టికెట్‌ ఇచ్చారని చెప్పారు. టికెట్‌ రాకపోయినా తాను బాధపడలేదన్నారు. తన పార్టీ సేవలను గుర్తించి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఆ ప్రకటన వెలువడిన సమయంలో తాను ఆస్ట్రేలియాలో ఉన్నట్లు చెప్పారు.

పదవులు ఆశించం.. పార్టీ కోసం పని చేస్తాం

తమది పదవులను ఆశించే కుటుంబం కాదని స్వర్ణ స్పష్టం చేశారు. పార్టీకి కట్టుబడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని అన్నారు. ఇప్పటివరకు తాను ఏ పదవీ అడగలేదని తెలిపారు. సుమారు ఐదు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నామని, పదవులు ఉన్నా లేకున్నా కాంగ్రెస్‌తో తమ ప్రయాణం కొనసాగుతూనే ఉందన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే 20 జిల్లాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు. మహిళలను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తున్నామని, రానున్న ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెంచడంతో పాటు ప్రచారంలో వారిని ముందుండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

‘నాకు అన్న వైఎస్సారే.. పార్టీకి కండువా నేనే’

తనకు అన్నలు లేరని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డినే అన్నగా భావిస్తానని స్వర్ణ భావోద్వేగంగా చెప్పారు. “నాకు పార్టీ కండువాలు కాదు.. నేను పార్టీకి కండువా. రాజకీయాల్లో రిటైర్‌మెంట్‌ ఉండదు. ఈ సందర్భంగా డిజిటల్ మీడియా ప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారా అని ప్రశ్నించగా.. పార్టీ అవకాశం వస్తే తప్పకుండా బరిలో ఉంటానని చెప్పారు. నాకు ఓపిక ఉన్నంత కాలం పార్టీ కోసం పనిచేస్తా. పదవులు వాటంతట అవే వస్తాయి” అని స్పష్టం చేశారు.

 

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.